నాలుగో విడత ‘తెలంగాణకు హరితహారం’ ప్రారంభం

​ప్రకృతిని మనం కాపాడితే… ఆ ప్రకృతి మనను కాపాడుతుంది… ప్రకృతి కన్నెర్ర జేస్తే మన మనుగడ కష్టం… ప్రకృతిని పూజిస్తే వానదేవుడు కరుణిస్తాడు అందుకే అందరూ తప్పకుండా మొక్కలను నాటి ప్రకృతిని కాపాడుకోవాలి “ అని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణలో అడవులను పునరుద్ధరించడంతో పాటు భారీ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటి పచ్చదనాన్ని రక్షించడం కోసం గ్రీన్ బెటాలియన్స్ తరహాలో పకడ్బందీగా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో పోలీస్ బెటాలియన్ గ్రీన్ బెటాలియన్ గా మారి ఒక్కో అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకునేలా ప్రయత్నించి అడవుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

‘తెలంగాణకు హరితహారం’ నాలుగో విడత కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు బుధవారం గజ్వేల్ లో విస్త్రుతంగా పర్యటించారు. గజ్వేల్ తో పాటు మేడ్చల్ జిల్లా తుర్కపల్లిలో నాలుగు చోట్ల హరితహారంలో పాల్గొని సీఎం మొక్కలు నాటారు. గజ్వేల్ లోని బస్టాండ్ చౌరస్తా లో కదంబం మొక్కను నాటారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఒకే రోజు లక్షా నూటా పదహారు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి గజ్వేల్ పట్టణంలో మొక్కలు నాటే సమయానికి గజ్వేల్ ప్రాంతమంతా మేఘావృతమై ఓ మెస్తరు వర్షం కురిసింది. షామీర్ పేట మండలం తుర్కపల్లి, ములుగు, ప్రజ్ఞాపూర్ గ్రామాలలో మొక్కలు నాటారు. రాజీవ్ రహదారి పై ఆకాశమల్లి మొక్కను నాటారు. గజ్వేల్ లో కార్యక్రమాన్ని ముగించుకొని ప్రజ్ఞాపుర్ లో ఆగి నాగరాజు అనే గ్రామస్తుని నివాసంలో కొబ్బరితో పాటు గృహ అవసరాలకు ఉపయోగపడే మొక్కలు నాటే కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఆ కుటుంబ మంచి చెడులు అడిగి తెల్సుకున్నారు.

మొదట 1,00,116 మొక్కలు అనుకున్నప్పటికీ ప్రజలనుంచి అనూహ్య స్పందన ఉండండంతో 1,36,000 మొక్కలను గజ్వేల్ మున్సిపాలిటీ ప్రాంతంలో ప్రజలు నాటారు.

నాలుగో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు గజ్వేల్ వెళుతున్న ముఖ్యమంత్రి దారిలో సింగాయపల్లి ఫారెస్ట్ లోపలికి వెళ్ళి చాలా సేపు కలియదిరిగి పరిశీలించారు. తన వెంట వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఫారెస్ట్ చూపించి మీ నియోజవర్గాల్లో కూడా ఇలాగే అడవుల పునరుద్ధరణ కు కృషి చేయాలని సూచించారు. ఫారెస్ట్ రక్షణకు అధికారులు తీసుకుంటున్న చర్యలను  ప్రత్యక్షంగా చూసి వారిని అభినందించారు. ఫారెస్ట్ అధికారులకు ప్రొత్సాహకంగా రూ. 5 లక్షల రివార్డు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. ఇంకా అవసరమైన సిబ్బందిని, కావలసినంత బడ్జెట్ ఇస్తామని సీఎం పేర్కోన్నారు. రాష్ట్రంలో అడవుల పెంపకంలో భాగంగా భారీ స్థాయిలో మొక్కలు నాటడంలో రాజీపడేది లేదని చెప్పారు.
వనదర్శిని కార్యక్రమం పేరుతో ఒక రోజు ఎమ్మెల్యేలందరినీ గజ్వెల్ అటవీ ప్రాంతానికి తీసుకొచ్చి అడవుల పునరుద్ధరణ మీద అవగాహన కల్పించాలన్నారు. ఎమ్మెల్యేలకు కూడా హరితహారం మీద శ్రద్ధ పెరగడంతో పాటు వారికి వనబోజనాలకు వచ్చిన తృప్తి కలుగుతుందని సీఎం అన్నారు.

శింగాయపల్లి ఫారెస్ట్ బ్లాక్ వద్ద అటవీ పునరుజ్జీవనం గురించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖ మంత్రి శ్రీ జోగురామన్న, పిసిసిఎఫ్ శ్రీ పి.కె. జా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి శ్రీ హరీష్ రావు, చీఫ్ సెక్రటరీ శ్రీ జోషి, డిప్యూటీ స్పీకర్ శ్రీమతి పద్మా దేవేందేరెడ్డి, ఎంపీలు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్, శ్రీ ప్రభాకర్ రెడ్డి, శ్రీ మల్లారెడ్డి, కలెక్టర్ శ్రీ వెంకట్రామిరెడ్డి, మండలి విప్ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ మదన్ రెడ్డి, శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీ సుధీర్ రెడ్డి, టిఎస్ఎండిసి చైర్మన్ శ్రీ శేరి సుభాష్ రెడ్డి, సీఎంఓ అధికారులు శ్రీ భూపాల్ రెడ్డి, శ్రీమతి ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ శ్రీ పీ.కే. ఝా, అడిషనల్ పీసీసీఎఫ్ శ్రీ డోబ్రియల్, మెదక్ చీఫ్ కన్జర్వేటర్ శ్రీ ఏ.కె. సిన్హా తదితరులు ఉన్నారు.

గజ్వేల్ లో సీఎం మొక్క నాటుతున్న సమయంలోనే అన్ని ప్రార్థనా మందిరాల్లో సైరన్ మోగించగానే ప్రజలందరూ ఒకేసారి మొక్కలు నాటారు. గజ్వేల్ పరిధిలో ఉన్న ప్రతీ ఇంట్లో, అన్ని రకాల రోడ్లపైనా, ఔటర్ రింగ్ రోడ్డుపైనా, ప్రభుత్వ-ప్రైవేటు విద్యాసంస్థల్లో, ప్రార్థనా మందిరాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటారు. వివిధ ప్రాంతాల నర్సరీల నుంచి ఎత్తుగా ఎదిగిన ఆరోగ్యవంతమైన మొక్కలను నాటారు. పండ్లు, పూల మొక్కలతో పాటు ఇండ్లలో పెంచడానికి ఇష్టపడే చింత, మామిడి, అల్ల నేరడు, కరివేపాకు, మునగ మొక్కలను గజ్వేల్ వాసులు తమ ఇండ్లల్లో నాటుకున్నారు. గజ్వేల్ పట్టణాన్ని 8 క్లస్టర్లుగా విభజించి, ప్రత్యేక అధికారులను నియమించి, ఒక్కో క్లస్టర్ లో 15వేలకు పైగా మొక్కలు నాటారు.

గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలటీ పరిధిలో సుమారు 75 వేల పండ్ల మొక్కలు (కొబ్బరి, జామ, దానిమ్మ, మామిడి, అల్లనేరడు), 16 వేల పూల మొక్కలు, పది వేల అటవీ జాతులకు చెందిన మొక్కలను నాటారు. పట్టణ ప్రాంతానికి నీడను, స్వచ్చమైన గాలిని ఇచ్చే ఆకర్షణీయమైన చెట్లతో పాటు, ప్రతీ ఇంటికీ రోజూ ఉపయోగపడే కరివేపాకు, మునగ లాంటి మొక్కలు, ఇళ్ల ముందు, వెనకా ఉన్న ఖాళీ స్థలాల్లో పెంచుకునే పూలు, పండ్ల మొక్కలను కూడా ఇంటింటికీ సరఫరా చేసి, నాటించారు. బహిరంగ ప్రదేశాల్లో నాటిన అన్ని మొక్కలకు రక్షణ కోసం ట్రి గార్డులను అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. తమ ఇండ్లల్లో, తమ ఇంటి ముందు నాటిని మొక్కలను తమ కుటుంబ సభ్యుల్లాగా పిల్లా పెద్దల్లాగా ఆప్యాయంగా చూసుకుని నీరు పోసి రక్షణ ఏర్పాట్లు చేసి పెంచాలని గజ్వేల్ వాసులకు సీఎం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఈ మహా హరితహారం కార్యక్రమంలో 1778 మంది ఉద్యోగులు, 13000 మంది వర్కర్స్, 12,000 మంది కుటుంబాల నుండి 45,000 మంది ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయంవంతం చేశారు. గజ్వేల్ హరితహారం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి ఏర్పాట్లు చేసిన అటవీ శాఖ అధికారులకు, పోలీస్ శాఖకు సీఎం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.