ఆగస్టు 1న గజ్వేల్‌లో హరితహారం కార్యక్రమం

తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 1న గజ్వేల్ పట్టణంలో లక్షా 116 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. వీటికి అదనంగా అదే రోజు అటవీభూముల్లో మరో 20వేల మొక్కలు నాటాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు, విద్యార్థులు, మహిళలు, యువకులు, వ్యాపారులు, సాధారణ ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఏకకాలంలో లక్షా 116 మొక్కలు నాటాలని చెప్పారు. అన్ని రకాల రోడ్ల వెంట, ప్రభుత్వ-ప్రైవేటు సంస్థల ఆవరణలో, గుడి, మసీదు, చర్చి లాంటి ప్రార్థనా మందిరాల్లో, ప్రతీ ఇంట్లో మొక్కలు నాటాలని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమానికి కావాల్సిన మొక్కలను ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ పట్టణంలో లక్షా 116 మొక్కలను నాటే కార్యక్రమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో బుధవారం సమీక్ష నిర్వహించారు. మంత్రులు శ్రీ జోగు రామన్న, శ్రీ జగదీష్ రెడ్డి, శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.కె. జోషి, పిసిసిఎఫ్ శ్రీ పికె జా, ఎపిసిసిఎఫ్ శ్రీ డోబ్రియాల్, సిద్దిపేట కలెక్టర్ శ్రీ వెంకట్రామ్ రెడ్డి, పోలీస్ కమిషనర్ శ్రీ జోయల్ డెవిస్, మున్సిపల్ చైర్మన్ శ్రీ భాస్కర్, హుడా ప్రత్యేక అధికారి శ్రీ హన్మంతరావు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు శ్రీ ఎలక్షన్ రెడ్డి, శ్రీ భూపతి రెడ్డి, శ్రీ భూమారెడ్డి, సిఎంఓ ప్రత్యేక కార్యదర్శి శ్రీ భాపాల్ రెడ్డి, ఓఎస్డి శ్రీమతి ప్రియాంక వర్గీస్ తదితరులు పాల్గొన్నారు.

‘‘గజ్వేల్ పట్టణంలో ఒకేరోజు లక్షా 116 మొక్కలు నాటాలి. విద్యార్థులు, స్వయం సహాయక బృందాల సభ్యులతో పాటు మొక్కలు నాటడానికి కావాల్సినంత మందిని సమీకరించాలి. కావాల్సిన మొక్కలను ముందే సిద్ధం చేసుకోవాలి. మొక్కలు నాటడానికి ముందే గుంతలు తీసి పెట్టాలి. మొక్కలు పెద్ద సైజులో ఉండేలా చూసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, అన్ని ఖాళీ ప్రదేశాలతో పాటు అన్ని ఇండ్లలో ఖచ్చితంగా మొక్కలు నాటాలి. ఇంట్లో ఎందరు సభ్యులుంటే అంతమంది తలా ఒక మొక్క చొప్పున నాటాలి. దీనికోసం ప్రజలను చైతన్య పరచాలి. అవగాహన కలించాలి. ఇండ్లలో నాటడానికి కావాల్సిన మొక్కలను ఒకరోజు ముందే ఆ ఇంటికి చేర్చాలి. ప్రజలకు ఇచ్చే చెట్లలో ఖచ్చితంగా పండ్ల చెట్లు, పూల చెట్లు కూడా ఉండాలి. ఆగస్టు 1వ తేదీన అనుకున్న సమయానికి గజ్వేల్ పట్టణంలోని అన్ని మసీదుల్లో ఒకేసారి సైరన్ మోగాలి. సైరన్ మోగిన వెంటనే ముఖ్యమంత్రితో సహా, అంతా ఒకేసారి ఎక్కడికక్కడ మొక్కలు నాటాలి. మైకుల ద్వారా, వాల్ రైటింగ్ ద్వారా, హోర్డింగుల ద్వారా, పెయింట్స్ ద్వారా ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. విద్యార్థులు వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించాలి. ఆగస్టు 1న గజ్వేల్ పట్టణంలో ప్రజలంతా మొక్కలు నాటేలా ప్రోత్సహించాలి. నాటిన మొక్కలను బతికించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేయాలి. రోడ్లపై పెట్టే మొక్కలకు ట్రీ గార్డులు పెట్టాలి. పట్టణంలో తుమ్మ, జిల్లేడు లాంటి పిచ్చిమొక్కలను తీసేసి, మంచి మొక్కలను మాత్రమే పెంచాలి. మొక్కలు పెంచడంలో బాగా శ్రద్ద చూపిన వారికి అవార్డులు కూడా అందించాలి’’ అని ముఖ్యమంత్రి వివరించారు.

‘‘పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుంటున్నాం. ఆదాయాభివృద్ధిలో దేశంలోనే నెంబరు వన్ గా ఉన్నాం. కాళేశ్వరం సహా నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. 2019 జూన్ నుంచి పుష్కలంగా నీళ్లువస్తాయి. చెరువులన్నింటినీ కాల్వల ద్వారా నింపుతాం. లక్షా 25వేల కోట్ల పంట పండుతుంది. వ్యవసాయం బాగుపడుతుంది. రెసిడెన్షియల్ స్కూళ్ల ద్వారా పిల్లలకు మంచి విద్య అందుతున్నది. రాష్ట్రం అన్ని విధాలా బాగుపడుతున్నది. ఇంత చేసినా జీవించగలిగే పరిస్థితులు లేకుంటే దండుగ. మనిషి జీవించ గలిగే పరిస్థితి కావాలి. భగవంతుడో, ప్రకృతో మనకు కావాల్సినవన్నీ సమకూర్చింది. కానీ మనమే వాటిని చేజేతులా నాశనం చేసుకున్నాం. నాశనమైన వాటిని పునరుద్ధరించుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. పోయిన అడవులను, పచ్చదనాన్ని తిరిగి పొందేందుకే రాష్ట్రంలో తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమం చేపట్టాం. వచ్చే ఏడాది నుంచి ఏడాదికి వందకోట్ల చొప్పున మొక్కలు నాటాలని నిర్ణయించాం. ప్రతీ గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేస్తున్నాం. ఆ నర్సరీల్లో ఇతర మొక్కలతో పాటు కనీసం 25 శాతం పండ్ల మొక్కలను సిద్దం చేయాలి. చెట్ల పండ్లు దొరికితే కోతలు జనావాసాల మీద పడే పరిస్థితే ఉండదు. గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటి బండ వద్ద అడవి పునరుద్ధరణలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. దానిని ఆదర్శంగా తీసుకోవాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.

మనిషి, చెట్టు నిష్పత్తిలో మన దేశం చాలా వెనుకబడి ఉంది. కెనడాలో ప్రతీ మనిషికి సగటున 8,953 చెట్లు, రష్యాలో 4,465, అమెరికాలో 716, చైనాలో 102 చెట్లుంటే, భారతదేశంలో ఒక్కో మనిషికి కేవలం 28 చెట్లు మాత్రమే ఉన్నాయి. ఇది వాతావరణ సమతుల్యం దెబ్బతినడానికి, ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమవుతున్నది. అందుకే మనం తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమాన్ని ఉద్యమ స్థాయిలో నిర్వహిస్తున్నాం. 33 శాతం పచ్చదనం కోసం పరితపిస్తున్నాం. అధికార యంత్రాంగమంతా పచ్చదనం పెంచాలనే తపనతో పనిచేయాలి. అటవీ భూముల్లో కూడా పోయిన అడవిని పునరుద్ధరించాలి. మొక్కలు నాటడం, వాటిని రక్షించడం ప్రధాన విధి కావాలి. ఈ కార్యక్రమానికి నిధుల కొరతలేదు. ఉపాధి హామీ పథకం నిధులను వాడుకోవాలి’’ అని ముఖ్యమంత్రి వివరించారు.