Decennial Celebrations of Telangana Formation

Decennial-Celebrations-of-Telangana-Formation
CM-Sri-KCR-addressing-in-Decennial-Celebrations-of-Telangana-Formation

​తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రసంగం:

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభ సందర్భంలో ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. మనం స్వప్నించి, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు దశాబ్ది ముంగిట నిలిచిన ఉజ్వల సందర్భంలో 60 ఏండ్ల పోరాట చరిత్రనీ, పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్నీ ఘనంగా తలుచుకుందాం. భవిష్యత్తు పురోగమనానికి మహోన్నతమైన ప్రేరణగా మలుచుకుందాం.

ప్రజల అభీష్టానికి భిన్నంగా తెలంగాణను ఆంధ్రాప్రాంతంతో కలిపి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి తెలంగాణ ప్రజలు తమ అసమ్మతిని నిరంతరం తెలియజేస్తూనే వచ్చారు. 1969లో ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమం రక్తసిక్తమైంది, దారుణమైన అణచివేతకు గురైంది. 1971 లో జరిగిన ఎన్నికల్లో ప్రత్యేక తెలంగాణ డిమాండ్ కు మద్దతుగా ప్రజాతీర్పు వెలువడినప్పటికీ.. దానిని ఆనాటి కేంద్ర ప్రభుత్వం గౌరవించలేదు. ఫలితంగా తెలంగాణ సమాజంలో నాడు తీవ్ర నిరాశా నిస్పృహలు ఆవరించాయి. ఉద్యమాన్ని రగిలించేందుకు నడుమ నడుమ కొన్ని ప్రయత్నాలు జరిగినా.. నాయకత్వం మీద విశ్వాసం కలగకపోవడంవల్ల, సమైక్య పాలకుల కుట్రల వల్ల ఆ ప్రయత్నాలు ఫలించలేదు. 2001 వరకూ తెలంగాణలో నీరవ నిశ్శబ్దం రాజ్యమేలింది. “ఇంకెక్కడి తెలంగాణ” అనే నిర్వేదం జనంలో అలుముకున్నది.

ఆ నిర్వేదాన్ని, నిస్పృహని బద్దలు కొడుతూ 2001లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించే చారిత్రాత్మక పాత్ర నాకు లభించినందుకు నా జీవితం ధన్యమైంది.

అహింసాయుతంగా, శాంతియుత పంథాలో వివేకం పునాదిగా, వ్యూహాత్మకంగా సాగిన మలిదశ ఉద్యమంలోకి క్రమక్రమంగా అన్ని వర్గాలు వచ్చి చేరాయి. ఈ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన మేధావులూ, విద్యావంతులూ, ఉద్యోగ ఉపాధ్యాయులూ, కవులూ, కళాకారులూ, కార్మికులూ, కర్షకులూ, విద్యార్థులూ, మహిళలూ కులమత భేదాలకు అతీతంగా, సిద్ధాంతరాద్ధాంతాలకు తావివ్వకుండా ఏకోన్ముఖులై కదిలారు. వారందరికీ నేటి దశాబ్ది ఉత్సవ సందర్భంగా సవినయంగా తలవంచి నమస్కరిస్తున్నాను. స్వరాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన త్యాగధనులైన అమరులకు హృదయపూర్వకంగా నివాళులర్పిస్తున్నాను. 2014లో అధికారంలోకి వచ్చిన నాటినుంచి బిఆర్ఎస్ ప్రభుత్వం అమరుల ఆశయాలను, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మనసా వాచా కర్మణా అంకితమైంది.

ప్రతిరంగంలోనూ యావద్దేశం నివ్వెరపోయే ఫలితాలను సాధిస్తూ ప్రగతిపథంలో పరుగులు పెడుతున్న తెలంగాణ నేడు పదో వసంతంలో అడుగు పెట్టడం ఒక మైలురాయి. ఈ సందర్భంగా స్వరాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నేటినుంచి 21 రోజులపాటు ఈ ఉత్సవాలు వేడుకగా జరుగుతాయి. గ్రామస్థాయి నుంచి రాజధాని నగరం వరకూ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలని కోరుతున్నాను.

అటు పోరాటంలోనూ, ఇటు ప్రగతి ప్రయాణంలోనూ ప్రజలు ప్రదర్శించిన అపూర్వమైన స్ఫూర్తినీ, అమరుల ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో చేసిన కృషినీ మననం చేసుకుందాం. దేశానికి దిక్సూచిగా నిలిచిన తెలంగాణ ప్రగతిని దశదిశలా చాటుదాం. భవిష్యత్ కర్తవ్యాలను నిర్దేశించుకుందాం.

తెలంగాణ సమాజం ఆరు దశాబ్దాల పాటు అలుపెరుగని పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకుంది. ప్రజల ఆశయం జయించి, 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ ఆవిర్భవించిన నాటి దృశ్యం గుర్తుచేసుకుంటే.. ఏ రంగంలో చూసినా విధ్వంసమే. అంతటా అలుముకున్నది గాఢాంధకారమే. అస్పష్టతలను, అవరోధాలను అధిగమిస్తూ తెలంగాణ దేశంలోనే అత్యంత బలీయమైన ఆర్థికశక్తిగా ఎదగడం ఒక చారిత్రాత్మక విజయం.

తెలంగాణ ఏయే రంగాలలో ధ్వంసం చేయబడిందో ఆ రంగాలన్నింటినీ మళ్లీ చక్కదిద్ది సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యతను ప్రభుత్వం నిజాయితీగా చేపట్టింది.

సమైక్య పాలకులు అనుసరించిన వివక్షా పూరిత విధానాలను మార్చేయడానికి పూనుకున్నది. ‘‘తెలంగాణను పునరన్వేషించుకోవాలి, తెలంగాణను పునర్నిర్మించుకోవాలి’’ అనే నినాదంతో ముందడుగు వేసింది.తెలంగాణ దృక్పథంతో నూతన విధానాలను రూపకల్పన చేసుకున్నది.తెలంగాణ ప్రజల తక్షణ అవసరాలు, వనరులు, వాస్తవాలు, అందుబాటులో ఉన్న పరిస్థితుల ఆధారంగా వివిధ చట్టాలు ప్రణాళికలు, మార్గదర్శకాలన్నింటినీ రూపొందించుకున్నాం.

2014 జూన్ 2న పరేడ్ గౌండ్స్ లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనొక వాగ్దానం చేశాను. తెలంగాణ రాష్ట్రాన్నిచూసి దేశం నేర్చుకొనే విధంగా, భారతదేశానికే తలమానికంగా ఉండే విధంగా తెలంగాణను తీర్చిదిద్దుతానని ఆనాడు నేను ప్రజలకు హామీ ఇచ్చాను. ఆ ఉక్కు సంకల్పాన్ని ఏ క్షణమూ విస్మరించలేదు. ఏమాత్రం చెదరనివ్వలేదు. తొమ్మిదేళ్ళ అనతికాలంలోనే అనేక రంగాలలో మన తెలంగాణ దేశానికే స్ఫూర్తినిస్తున్న రాష్ట్రంగా అవతరించింది.

తెలంగాణ ఉద్యమంలో ప్రజలు వ్యక్తం చేసిన ఆకాంక్షల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంపూర్ణమైన అవగాహన ఉంది. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన అనుభవం ప్రాతిపదికగా తెలంగాణ ప్రజల ఆర్తిని ప్రతిబింబించే విధంగా మేనిఫెస్టోను రూపొందించుకొని చిత్తశుద్ధితో అమలు చేసింది.

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆనాటి పరిస్థితులను నేటి పరిస్థితులతో ఒకసారి బేరీజు వేసుకొని చూస్తే, మనం సాధించిన ఆశ్చర్యకరమైన విజయాలు మన కళ్ళ ముందు కదలాడుతాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ తొమ్మిదేళ్ళ వ్యవధిలో కరోనా మహమ్మారి వల్ల దాదాపు మూడేళ్ళ కాలం వృధాగానే పోయింది. ఇక మిగిలిన ఆరేళ్ళ స్వల్ప కాలంలోనే వాయువేగంతో రాష్ట్రం ప్రగతి శిఖరాలను అధిరోహించింది.

ఇప్పుడు ఇది నవీన తెలంగాణ. నవనవోన్మేష తెలంగాణ. దేశంలో ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా తెలంగాణ మోడల్ అనే మాట మార్మోగుతున్నది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అభివృద్ధి నమూనా మన్ననలందుకుంటున్నది.

అనేక సవాళ్ళు, అవరోధాల మధ్య నెమ్మదిగా ప్రారంభమైన తెలంగాణ ప్రగతి ప్రస్థానం నేడు పరుగులు తీస్తోందంటే, అందుకు అంకితభావంతో పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం, ప్రభుత్వోద్యోగులు, ప్రజా సహకారమే కారణమని సవినయంగా తెలియజేస్తున్నాను. అభివృద్ధిని సాధించడమేకాదు, అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడంలో కూడా మన రాష్ట్రం నూతన ఒరవడిని దిద్దింది. మానవీయకోణంలో రూపొందించిన పథకాల పట్ల నేడు దేశమంతటా ఆదరణ వ్యక్తమవుతున్నది. తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా ఆచరణీయంగా నిలవడమే కాదు, ఆయా రాష్ట్రాల ప్రజలు తమకు కూడా తెలంగాణ తరహా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. మన రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు మన పథకాలపట్ల ఆకర్షితులై, తమ రాష్ట్రాలలో కూడా వీటిని అమలు చేస్తామని ప్రకటించినప్పుడు మనకు ఎంతో గర్వంగానూ ఆనందంగానూ అనిపిస్తున్నది.

‘‘సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం’’ అనే నినాదంతో తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించింది, అభివృద్ధిలో అగ్రపథాన నిలిచింది. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం 1,24,104 మాత్రమే ఉండేది. తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతితో నేడు మన రాష్ట్ర తలసరి ఆదాయం 3 లక్షల 17 వేల 115 రూపాయలకు పెరిగింది. పదేళ్ల చిరుప్రాయంలో ఉన్న తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోని పెద్ద రాష్ట్రాలకన్నా మిన్నగా నిలిచింది. 2014లో రాష్ట్ర జీఎస్.డి.పి విలువ రూ.5,05,849 కోట్లు మాత్రమే ఉండగా, నేడు రాష్ట్రంలోని అన్నిరంగాలూ ఆర్ధికంగా పరిపుష్టి కావడంతో రాష్ట్ర జీ.ఎస్.డి.పి 12,93,469 కోట్లకు పెరిగింది. అంటే కరోనా, డీ మానిటైజేషన్ వంటి సంక్షోభాలు ఏర్పడినప్పటికీ తట్టుకొని 155 శాతం వృద్ధిరేటును నమోదు చేస్తూ, దశాబ్ది ముంగిట నిలిచింది తెలంగాణ.

ఇవాళ రాష్ట్రంలో కరెంటు కోతలు లేవు, ఎటుచూసినా వరికోతలే కనిపిస్తున్నాయి. తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ దేశంలోనే ప్రప్రథమ స్థానంలో నిలిచి, ప్రగతి బావుటాను సగర్వంగా ఎగురవేసింది.

ఎత్తిపోతలతో తరలించిన నదీ జలాలతో తెలంగాణ బీడుభూములన్నీ తరిభూములైనాయి. మిషన్ భగీరథ తెలంగాణ తాగునీటి వ్యథలకు చరమగీతం పాడింది. వృత్తి పనులవారికి ఆర్ధిక ప్రేరణనివ్వడంతో తెలంగాణ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు పరిపుష్టి చేకూరింది. పల్లె ప్రగతితో గ్రామీణ జీవన ప్రమాణాలు పెరిగినాయి. మన ఆదర్శ గ్రామాలు జాతీయ స్థాయిలో అనేక అవార్డులందుకుంటున్నాయి. పట్టణాలు, నగరాలు పరిశుభ్రతకు, పచ్చదనానికి నిలయాలై ప్రపంచస్థాయి గుర్తింపును పొందుతున్నాయి.

ఏ విషయంలో చూసినా, ఏ కోణంలో చూసినా అనేకరంగాల్లో తెలంగాణ నంబర్ వన్ గా నిలుస్తున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే.. నిన్నటి ఉద్యమ తెలంగాణ నేడు ఉజ్వల తెలంగాణగా వాసికెక్కింది.

దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వృత్తి పనుల వారికి ఆర్ధిక ప్రేరణ
దశాబ్ది ఉత్సవాల కానుకగా బి.సి కుల వృత్తుల కుటుంబాలకు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్ధికసాయం అందిస్తున్నామని చెప్పడానికి నేనెంతో ఆనందిస్తున్నా. రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ, కుమ్మరి, మేదరి తదితర కుటుంబాల వారికి దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది.

అదేవిధంగా గొల్ల కుర్మలకు భారీ ఎత్తున గొర్రెల పంపిణీని చేపట్టిన సంగతి తెలిసిందే. తొలి విడతలో రూ.6,100 కోట్లతో 3.93 లక్షల మంది లబ్ధిదారులకు 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేయడం జరిగింది. ప్రస్తుతం రెండో విడతలో భాగంగా రూ.5 వేల కోట్లతో 3.38 లక్షల మందికి గొర్రెల్ని పంపిణీ చేసే కార్యక్రమం దశాబ్ది ఉత్సవాల్లోనే ప్రారంభమవుతుంది.

పోడు భూములకు పట్టాలు
తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ ఆదివాసీ గిరిజనుల చిరకాల ఆకాంక్షను తెలంగాణ ప్రభుత్వం తీరుస్తున్నదని తెలియజేయడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారంగా గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం భూములపై హక్కులు కల్పిస్తున్నది. జూన్‌ 24 నుంచి పోడు పట్టాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. అటవీ భూములపై ఆధారపడిన ఒక లక్షా యాభైవేల మంది ఆదివాసీ, గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాల పోడు భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తున్నది. దీనికి రైతుబంధు పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నది.

పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీ
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సేకరించి ఉన్న ప్రభుత్వ భూముల్లో అర్హులకు ఇండ్ల స్థలాల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన నిరుపేదలను గుర్తించి ఆయా గ్రామాల్లో ఇంకా మిగిలి ఉన్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను పేదల ఇండ్ల నిర్మాణాల కోసం కేటాయిస్తుంది.

24 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ
తెలంగాణ ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా దానివెనుక ఉండేది మానవీయ కోణమే. పేదలు అనుభవించే ప్రతి సమస్యనూ సూక్ష్మంగా అర్థం చేసుకొని పరిష్కరించే దిశగానే ప్రభుత్వం యొక్క ప్రతి ప్రయత్నమూ కొనసాగుతున్నది. గర్భిణులలో రక్తహీనత సమస్యను నివారించడం కోసం, గర్భస్థశిశువు ఆరోగ్యంగా ఎదగడం కోసం ప్రొటీన్లు, విటమిన్లతో కూడిన పోషకాహారాన్ని న్యూట్రిషన్ కిట్ల ద్వారా ప్రభుత్వం అందజేస్తున్నది. ఇప్పటికే ఈ పథకం 9 జిల్లాల్లో ప్రారంభమై మంచి ఫలితాలను సాధిస్తున్నది. ఈ దశాబ్ది ఉత్సవాల్లోనే మిగతా 24 జిల్లాల్లోనూ న్యూట్రిషన్ కిట్ల పంపిణీని ప్రభుత్వం ప్రారంభిస్తున్నదని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.

గృహలక్ష్మి పథకం ప్రారంభం
సొంతస్థలం ఉండి కూడా ఇళ్ళు నిర్మించుకోలేని పేదల కోసం గృహలక్ష్మి అనే పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. మహిళల పేరిట అమలు చేసే ఈ పథకాన్ని జూలై నెలలో ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.

గృహలక్ష్మి పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి 3 లక్షల రూపాయలను మూడు దశల్లో అందించడం జరుగుతుంది. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నది.

ఉద్యమంలా దళితబంధు
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బోధనలే శిరోధార్యంగా భావించిన తెలంగాణ ప్రభుత్వం దళితులు స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలన్న ఆశయంతో “దళితబంధు” అనే విప్లవాత్మక పథకాన్ని అమలు చేస్తున్నది. చరిత్రలో మునుపెన్నడూలేనివిధంగా రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల మొత్తాన్ని నూరుశాతం గ్రాంట్ గా అందిస్తున్నది. దీనిని లబ్ధిదారులు తిరిగి చెల్లించనవసరం లేదు. ఈ ధనంతో దళితులు తమకు నచ్చిన, ఇష్టం వచ్చిన ఉపాధిని ఎంచుకొని, ఆత్మగౌరవంతో జీవించడానికి ప్రభుత్వం అండదండగా నిలుస్తున్నది.

దళిత బంధు పథకం కింద ప్రభుత్వం ఇప్పటివరకూ 50 వేల మంది లబ్దిదారులకు 5 వేల కోట్ల రూపాయలను అందించింది. ఈ ఏడాది బడ్జెట్ లో ఈ పథకానికి 17,700 కోట్లు కేటాయించుకున్నం. రెండవ విడత లక్షా 30 వేల మందికి దళిత బంధు పథకం అందించుకుంటున్నం.

హుజూరాబాద్ నియోజకవర్గంలో నూటికి నూరు శాతం దళితబంధు పథకాన్ని అమలు పరిచాం. మిగిలిన 118 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 1100 మందికి ప్రస్తుతం అందిస్తున్నాం. దళితులు పారిశ్రామిక, వ్యాపార రంగాలలో మరింత ముందుకువచ్చి ప్రగతి సాధించాలన్నది నా ఆకాంక్ష.

ఇందుకు అనుగుణంగా లాభసాటి వ్యాపారాలకు ప్రభుత్వం ఇచ్చే లైసెన్సులలో దళితులకు 15 శాతం రిజర్వేషన్లు కూడా అమలు చేస్తున్నది. ఫర్టిలైజర్ షాపుల కేటాయింపులో, హాస్పిటల్ హాస్టల్ కాంట్రాక్టుల కేటాయింపుల్లో, మెడికల్ షాపుల కేటాయింపుల్లో రిజర్వేషన్ అమలవుతున్నది. ఇటీవల రాష్ట్రంలో కేటాయించిన 2,616 వైన్ షాపుల్లో 261 షాపులు దళితులకు కేటాయించింది.

దళిత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ కింద 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నది. దళితుల గృహావసరాలకోసం 101 యూనిట్ల వరకూ విద్యుత్ ను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోంది.

షెడ్యూలు కులాలు, తెగల అభివృద్ధికి ప్రత్యేక ప్రగతినిధి చట్టాన్ని రాష్ట్రప్రభుత్వం అమలుపరుస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు ఉద్దేశించిన నిధులు ఇతర పథకాలకు మళ్లించకుండా రక్షణ కల్పించింది. ఏదైనా ఆర్థిక సంవత్సరంలో ఈ నిధులు పూర్తిగా ఖర్చుగాని పక్షంలో ఈ చట్టంప్రకారం ఆ నిధులను తరువాతి సంవత్సరానికి కచ్చితంగా బదలాయింపు చేసేలా నిబంధనలు తీసుకొచ్చింది.

మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే చేపట్టిన బృహత్తరమైన పథకం మిషన్ కాకతీయ. తెలంగాణ భూ భౌతిక పరిస్థితికి అనుగుణంగా కాకతీయ రాజులు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల సాగునీటి వ్యవస్థ తెలంగాణకు ప్రాణప్రదమైనది. సమైక్యపాలనలో చెరువుల వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. గంగాళాల వంటి చెరువులు పూడిక నిండి తాంబాళాల్లా తయారయినాయి. చెరువులకు నవజీవం తెచ్చే పథకానికి కాకతీయుల స్మరణలో మిషన్ కాకతీయగా నేను స్వయంగా నామకరణం చేసాను.

ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 47 వేలకు పైగా చెరువులను పునరుద్ధరించి, చెరువు కట్టలను పటిష్టపరిచి, కాలువలకు, తూములకు మరమ్మతులు చేసి, పూడిక తొలగించిన ఫలితంగా నేడు రాష్ట్రంలోని చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరిగిపోయింది. 5,350 కోట్ల రూపాయలు వెచ్చించి చెరువులను పునరుద్ధరించడంతోపాటు, విరివిగా చెక్ డ్యాముల నిర్మాణం చేపట్టి వాగులను పునరుజ్జీవింప చేయటంతో లక్షలాది ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడింది. ఫలితంగా, నేడు దేశవ్యాప్తంగా 94 లక్షల ఎకరాల వరి సాగు అయితే.. అందులో 56 లక్షల ఎకరాలు యాసంగిలో తెలంగాణలోనే సాగు అయ్యింది.

నేడు దేశంలో చాలాచోట్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. కానీ, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఉబికిఉబికిపైకి వస్తున్నాయి. చెరువుల కింద ఆయకట్టుకు సాగునీరు సమృద్ధిగా లభిస్తుండటంతో ఆకుపచ్చ తివాచీ పరచినట్టు కనిపిస్తూ పంట పొలాలు కనువిందు చేస్తున్నాయి.

సురక్షిత జలాల మిషన్ భగీరథ
మిషన్ భగీరథ ద్వారా నూటికి నూరు శాతం గృహాలకు నల్లాల ద్వారా శుద్ధిచేసిన మంచినీటిని సరఫరా చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధిచేసిన నీరు ఇవ్వలేకపోతే, బిందెడు నీళ్ల కోసం మహిళలు పడే కడగండ్లను నివారించకుంటే, నేను ప్రజలను ఓట్లు అడగనని రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలోనే నేను ప్రతిజ్ఞ చేసిన విషయం ఈ సందర్భంగా మీకు గుర్తుచేస్తున్నాను. నేను నా ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నాను.

ప్రతీ ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోకెల్లా ప్రథమ స్థానంలో ఉంది. దేశంలోని పెద్ద రాష్ట్రాలలో పశ్చిమబెంగాల్ అట్టడుగు స్థానంలో ఉండగా, ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ మూడోస్థానంలో ఉంది. మనం ప్రారంభించిన మిషన్ భగీరథను అనుకరిస్తూ కేంద్రప్రభుత్వం “హర్ ఘర్ జల్ యోజన” అనే పథకాన్ని అమలుచేస్తోంది కానీ అదింకా నూటికి నూరుశాతం లక్ష్యాన్ని చేరుకోలేదు.

కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ భగీరథ నీటిని పరీక్షలు నిర్వహించి రూపొందించిన వాటర్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ నివేదిక ప్రకారం... ఒక్క తెలంగాణలోనే 99.95 శాతం నల్లానీళ్లలో కలుషిత కారకాలు లేవని నిర్థారించింది. నేషనల్ వాటర్ మిషన్ అవార్డు, జల్ జీవన్ అవార్డుల తో సహా, పలు అవార్డులు, ప్రశంసలు మిషన్ భగీరథకు లభించాయి.

ఇప్పుడు తాగునీటి కోసం మండుటెండలో బిందెలు నెత్తిన పెట్టుకొని మైళ్ళకుమైళ్ళ దూరం నడిచే దృశ్యాలు లేవు, ఖాళీ బిందెలతో ప్రజల ధర్నాలు లేవు, ఫ్లోరైడ్ నీరు తాగడం వల్ల ఫ్లోరోసిస్ బారినపడి ప్రజలు వికలాంగులుగా మారిన దృశ్యాలు మచ్చుకు కూడా నేడు కానరావు. నేడు రాష్ట్రంలో ఎక్కడా ఫ్లోరైడ్ బాధలు లేవన్నది కేంద్రంతో సహా అందరూ అంగీకరించిన వాస్తవం.

విద్యుత్తు విజయం
అరవై ఏండ్ల పరిపాలనలో ఏ ఒక్క ప్రభుత్వమూ విద్యుత్తు సమస్యను పరిష్కరించలేదు. వ్యవసాయానికి చాలినంత విద్యుత్తును సరఫరా చేయకపోవడంతో పంటలెండిపోయి రైతన్నలు పడ్డ పాట్లు చెప్పనలవికాదు. జనజీవితంలో జనరేటర్లు ఇన్వర్టర్లు, కన్వర్టర్లు అనివార్యమైపోయాయి. పదేపదే మోటార్లు కాలిపోయేవి. పటాకల వలె ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోయేవి. పవర్ హాలిడేలతో పరిశ్రమలు కునారిల్లిపోయేవి. పారిశ్రామికవేత్తలు ఇందిరాపార్కు దగ్గర ధర్నాకు దిగాల్సిన దయనీయ పరిస్థితి ఆవరించి ఉండేది.

తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకార బంధురమవుతుందని, తీగెల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని సమైక్య పాలకులు ఎద్దేవా చేశారు. శాపనార్ధాలు పెట్టారు. కానీ, వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు రంగంలో విప్లవాత్మక విజయాలు సాధించింది. నేడు అన్ని రంగాలకు నిరంతరాయంగా 24 గంటల పాటు, వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తు సరఫరా చేసే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ కీర్తి దేశం నలుదిశలా వ్యాపించింది.

తెలంగాణ రైతుకు కరెంటు లేక నీళ్ళు ఆగిపోతాయనే రంది లేదు. మోటర్ కాలిపోతదన్న భయం లేదు. చివరి మడి దాకా తడి ఒక్కతీరుగ అందుతున్నది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు కోసం ప్రభుత్వం ఏటా 12 వేల కోట్లు ఖర్చు చేస్తూ రైతు సంక్షేమం పట్ల తన చిత్తశుద్ధిని చాటుకుంటున్నది. దేశ ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ రాష్ట్రంలో ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు చొప్పున పవర్ హాలిడే ప్రకటిస్తుంటే దశాబ్దిలో అడుగుపెడుతున్న పసికూన తెలంగాణ రాష్ట్రంలో క్రాప్ హాలిడేలు, పవర్ హాలిడేలు అనే మాటే లేదు. అందుకే ఇవాళ తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడే నాటికి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా, నేడది 18,453 మెగావాట్లకు పెంచుకోగలిగాం. రాష్ట్రం ఏర్పడిన నాడు సోలార్ పవర్ ఉత్పత్తి 74 మెగావాట్లు మాత్రమే ఉండగా, నేడది 5,741 మెగావాట్లకు పెంచగలిగాం. సౌర విద్యుదుత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రభాగాన నిలిచింది.

తెలంగాణ విద్యుత్తు రంగాన్ని తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం త్రిముఖ వ్యూహాన్ని అనుసరించింది. సంస్థలో అంతర్గత సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. ప్లాంటు లోడ్ ఫ్యాక్టర్ పెంచుకున్నది. పంపిణీలో నష్టాలను నివారించుకున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్ గఢ్ తో విద్యుత్తు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల వార్దా నుంచి హైదరాబాద్ కు 765 కె.వి. డీసీ లైను నిర్మాణానికి అవకాశం ఏర్పడింది. ఉత్తర, దక్షిణ గ్రిడ్ ల మధ్య పి.జి.సీ.ఐ.ఎల్. ఆధ్వర్యంలో కొత్త లైన్ల నిర్మాణం జరిగింది. దీంతో దేశంలో ఎక్కడి నుంచైనా విద్యుత్తును ఇచ్చి పుచ్చుకునే అవకాశం ఏర్పడింది. శాశ్వతంగా సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం కొత్త పవర్ స్టేషన్లను నిర్మించింది.

రికార్డు సమయంలో కేటీపీఎస్ 7వ దశ నిర్మాణాన్ని పూర్తి చేసింది. భూపాలపల్లి, జైపూర్ ప్లాంట్ల నిర్మాణం పూర్తిచేసి 1800 మెగావాట్ల విద్యుత్తును అదనంగా అందుబాటులోకి తెచ్చింది. జూరాల, పులిచింతల నుంచి 360 మెగావాట్ల హైడల్ పవర్ సమకూర్చింది. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో ఉత్పత్తి ప్రారంభమైంది. 4000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో టీఎస్.జెన్కో దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంటు నిర్మాణం తుదిదశకు చేరుకున్నది.. త్వరలోనే ఈ ప్లాంట్ ఫలితాలు మనకు అందనున్నాయి.

ఉత్పత్తితోపాటు సరఫరాను మెరుగు పరచడంలో కూడా తెలంగాణ విద్యుత్తు సంస్థలు ఎంతో ప్రగతి సాధించాయి. 22,502 కోట్ల రూపాయల వ్యయంతో సబ్ స్టేషన్ల నిర్మాణం, పవర్ ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు, కొత్త లైన్ల నిర్మాణం చేయడంతో పంపిణీ వ్యవస్థ బలోపేతమైంది.

నేడు తలసరి విద్యుత్తు వినియోగంలో సైతం తెలంగాణ ఎంతో ముందున్నది. 2014-15లో తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం 1,356 యూనిట్లు కాగా, 2021-22 నాటికి 2,126 యూనిట్లకు పెరిగింది. ఇదే సమయంలో జాతీయ సగటు 1,255 యూనిట్లు మాత్రమే ఉంది. అంటే జాతీయ తలసరి వినియోగం కన్నా తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం 69 శాతం ఎక్కువ.

సాగునీటి రంగంలో స్వర్ణయుగం
తెలంగాణ రైతుకు కంట కన్నీరే తప్ప, తెలంగాణ పొలాలకు ఏనాడూ సాగునీరు లభించలేదు. తలాపునా పారుతుంది గోదారి.. మన చేను మన చెలుకా ఎడారీ అని దీనంగా పాడుకున్న పాటల సాక్షిగా.. తెలంగాణ పొలాల దాహార్తిని తీర్చితీరాలనే పట్టుదల ఉద్యమకాలం నుంచే నా మనసును ఆవహించింది. సాగునీటి రంగంలో సాధించ వలసిన లక్ష్యాలను ఆనాడే స్పష్టంగా నిర్దేశించుకున్నాను.

తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే, సంవత్సరాల తరబడి నిర్లక్ష్యంగా నిలిచిపోయిన ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేయడం, నాగార్జు సాగర్, నిజాంసాగర్, శ్రీరాం సాగర్ వంటి పాత ప్రాజెక్టులను ఆధునికీకరించడం, ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించని ప్రాజెక్టు పనులు తక్షణం చేపట్టడం, అందుబాటులో ఉన్న జలవనరులను సమర్థవంతంగా వినియోగించుకొని, పంటల దిగుబడి పెంచడం వంటి లక్ష్యాలతో ముందుకు సాగింది.

సమైక్య రాష్ట్రంలో మూలకుపడ్డ కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, దేవాదుల, తదితర పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తిచేయడం ద్వారా 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి చేసింది. దీంతో వలసల జిల్లాగా పేరుబడ్డ ఉమ్మడి పాలమూరు నేడు పంట కాలువలతో పచ్చని చేలతో కళకళలాడుతున్నది.

గతంలో పొట్ట చేతబట్టుకొని వలసవెళ్ళిన జనం సొంత ఊళ్లకు తిరిగి వచ్చారు. సంతోషంగా తమ పొలాలు సాగు చేసుకుంటున్నారు. అద్భుతమైన ఈ మార్పుకు అద్దంపడుతూ ‘‘వలసలతో వలవల విలపించు కరువు జిల్లా, పెండింగ్ ప్రాజెక్టులను వడివడిగా పూర్తి చేసి, చెరువులన్ని నింపి, పన్నీటి జలకమాడి, పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నది..’’ అని నేనే స్వయంగా పాట రాసాను.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 80శాతం పైగా పూర్తయింది. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలలో ప్రతి ఎకరానికీ సాగునీరు అందుతుంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు తుదిదశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టు పూర్తిచేసి రైతుల పంట పొలాలకు సాగునీరు అందించబోతున్నామని సంతోషంగా ప్రకటిస్తున్నాను.

20లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు, మరో 20లక్షల ఎకరాలకు సాగునీరును స్థిరీకరించడానికి ఉద్దేశించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలో ఓ అపూర్వ ఘట్టం. ప్రపంచంలోకెల్లా పెద్దదైన ఈ బహుళ దశల భారీ ఎత్తిపోతల పథకాన్ని వేలాది మంది కార్మికులు, ఇంజనీర్లు రాత్రింబవళ్ళు శ్రమించి కేవలం మూడున్నరేళ్ళ స్వల్ప కాలంలో పూర్తిచేసారు. సముద్ర మట్టానికి 80 మీటర్ల ఎత్తున ప్రవహించే గోదావరి నదిని భారీ పంపుల ద్వారా గరిష్టంగా 618 మీటర్లకు ఎత్తిపోయడం జరుగుతున్నది. నేడు కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరిని 250 కిలోమీటర్ల మేర సతత జీవధారగా మార్చింది. దాదాపు 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును అభివృద్ధిలోకి తెచ్చింది. ఒకనాడు చుక్క నీటికోసం అలమటించిన తెలంగాణ ఇప్పుడు 20 కి పైగా రిజర్వాయర్లతో పూర్ణకలశం వలె తొణికిసలాడుతున్నది. దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా విలసిల్లుతున్నది.

తెలంగాణ ఏర్పడిన తొలిదశలోనే ప్రభుత్వం అనుసరించబోయే సాగునీటి విధానంపై రాష్ట్ర శాసన సభలో నేనే స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాను.

ఈ విధానం ఫలితంగా నేడు రాష్ట్రంలో దాదాపు 75 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి ఏర్పడింది. రెండు, మూడేళ్లలో మరో 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణంతో సుజల, సుఫల, సస్యశ్యామల రాష్ట్రంగా తెలంగాణ విరాజిల్లుతోంది. రాష్ట్రంలో 1 కోటి 25లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న స్వప్నం త్వరలోనే సాకారం కానుంది.

పండుగ వలె సాగుబడి.. భూమికి బరువయ్యేంత దిగుబడి
వ్యవసాయరంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుత పరివర్తనను సాధించింది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతుబిడ్డది తీరని దుఃఖం. ఆనాటి బాధలు గుర్తొస్తే ఇప్పటికీ కడుపు తరుక్కు పోతుంది. సాగునీరు లేదు. విద్యుచ్ఛక్తి లేదు, ఎండిన బోర్లు, బీటలు వారిన పంట పొలాలు ఒకవైపు, మరోవైపు పంట పెట్టుబడి లేక, అప్పులపాలై, దళారుల చేతిలో చితికిపోయి, గతిలేక, దిక్కుతోచక దీనులైన రైతులు విధిలేక ఆత్మహత్యలు చేసుకోవడంతో వారి కుటుంబాలకు తీరని దుఃఖం మిగిలింది.

ప్రభుత్వం అందించే అరకొర సాయంకోసం రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్న అపవాదును కూడా తెలంగాణ రైతుబిడ్డ ఆనాడు భరించవలసి వచ్చింది. నేనూ ఒక రైతుబిడ్డనే. రైతులు ఎదుర్కొంటున్నఈ కష్టాలు,నష్టాలు నా స్వానుభవంలో ఉన్నవే. అందుకే, ఒక రైతు బిడ్డగా ఆలోచించి సాగునీరు ఒక్కటే అందిస్తే సరిపోదని, రైతుకు పెట్టుబడి సాయం కూడా అందించినప్పుడే సాగు సుసాధ్య మవుతుందని ఆలోచించాను. రైతు సంక్షేమం దిశగా ఎవరూ కలలో కూడా ఊహించని పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. రాష్ట్రం ఆవిర్భవించిన వెనువెంటనే రైతును తక్షణం ఆదుకోవాలి, వారిలో భరోసా నింపాలి, వ్యవసాయం దండగకాదు పండగని నిరూపించాలనే పట్టుదలతో అనేక సంక్షేమ పథకాలు చేపట్టి, లక్ష్య సాధనలో సఫలీకృతమైంది.

రైతుకు పెట్టుబడి కష్టాలు తీర్చేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకాన్ని 2018లోనే ప్రారంభించుకున్నం. ఈ పథకం ప్రవేశపెట్టి ఇప్పటికి ఐదేళ్ళు పూర్తయింది. ఈ పథకం కింద ఇప్పటివరకూ పది విడతల్లో 65 లక్షల మంది రైతుల ఖాతాలోకి నేరుగా 65 వేల కోట్ల రూపాయలకు పైగా నగదు జమచేయడం ఎవరూ ఊహించని చరిత్ర. భూరికార్డులను డిజిటలైజ్ చేయడం వల్ల రైతుల భూముల వివరాలపై వచ్చిన స్పష్టత ఆధారంగా రైతుబంధు నగదును ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లోకి పంపించగలుగుతున్నది. దేశంలో ఏ రాష్ట్రమూ రైతులకు ఇంత భారీగా పెట్టుబడి సాయం అందించలేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఈ పథకం వ్యవసాయం దిశను, రైతుదశను మార్చివేసింది.

ఇప్పుడు పంట పెట్టుబడి కోసం రైతు ఎదురుచూడాల్సిన పనిలేదు. తల తాకట్టుపెట్టి అధికవడ్డీల అప్పుకోసం చెయ్యిచాచాల్సిన అవసరం లేదు. పంటలు వేసే తరుణంలోనే ఎకరానికి 10 వేల రూపాయల వంతున రెండు విడతలలో క్రమం తప్పకుండా రైతు బంధు సాయం అందివస్తున్నది. కరోనా కష్టకాలంలో కూడా రైతు సోదరులకు పెట్టుబడి నిధులను సమకూర్చిన ఘనత తెలంగాణా ప్రభుత్వానికే దక్కింది. రైతుబంధు పథకం కేంద్ర పాలకుల కళ్ళను సైతం తెరిపించింది. వాళ్లు కూడా మన రైతుబంధు పథకాన్ని అనుసరించక తప్పలేదు. ఈ పథకం దేశ వ్యవసాయ రంగంలో సువర్ణాధ్యాయాన్ని లిఖించింది.

రైతుల సంక్షేమంతో పాటు వారి కుటుంబాల క్షేమాన్ని కూడా చూడాల్సిన బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తలకెత్తుకున్నది. విధివశాత్తూ ఒక రైతన్న తనువు చాలిస్తే, ఆ రైతు కుటుంబం పరిస్థితి ఏమిటి ? అప్పటివరకూ అన్నదాతగా ఉన్న ఆ కుటుంబం అన్నమో రామచంద్రా అని వీధిపాలు కావల్సిందేనా? ఈ దిశలో గత ప్రభుత్వాలేవీ ఆలోచించలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆలోచించింది.

ఏ కారణంచేతనైనా సరే రైతు మరణిస్తే, ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవడానికి రైతుబీమా పథకం ప్రవేశపెట్టింది. రైతు మరణించిన పది రోజుల్లోపే ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల బీమా పరిహారం అందిస్తున్నది. అరగుంట భూమి ఉన్న రైతుకూడా ఈ బీమాకు అర్హుడేనని ప్రభుత్వం విస్పష్టంగా నిర్దేశించింది. బీమాకు సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని వందశాతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.

గతంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే, అప్పటి ప్రభుత్వాలు నామమాత్రంగా, కంటి తుడుపుగా కొద్దిపాటి పరిహారం చెల్లించేవి. దానికోసం రైతు కుటుంబాలు దరఖాస్తులు చేతపట్టుకొని, కాలికి బలపం కట్టుకొని నాయకుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ కన్నీళ్లు పెట్టుకుంటూ తిరగాల్సి వచ్చేది. ఇంటి దిక్కును కోల్పోయిన బాధకు తోడుగా ఈ ప్రయాస మరింత దుఃఖాన్ని కలిగించేది. రైతుబీమా పథకం ఇప్పుడా దురవస్థ నుంచి రైతు కుటుంబాలను పూర్తిగా బయట పడేసింది.

ఏడువేల ధాన్యం కొనుగోలు కేంద్రాలతో ప్రభుత్వమే రైతు ముంగిటికీ వెళ్ళి మద్దతు ధరతో ధాన్యం సేకరిస్తున్నది. ఈ విధంగా ఇప్పటివరకు ఒక కోటి ఇరవై ఒక లక్షల కోట్ల విలువైన ఆరు కోట్ల డెబ్భై ఆరు లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. కేంద్రం నిరాకరించినా, తెలంగాణ ప్రభుత్వమే పండిన పంటనంతా మద్దతు ధరతో కొని, సకాలంలో రైతుకు ధాన్యం అమ్మిన సొమ్మును అందజేయడంతో తెలంగాణ రైతు నిబ్బరంగా, నిశ్చింతగా ఉన్నాడు.

ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానకు కొన్ని జిల్లాలో రైతులు పంటలు నష్ట పోయారు. ముఖ్యంగా వరి, మామిడి, మొక్కజొన్న వంటి పంటలకు బాగా నష్టం వాటిల్లింది. వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలలో నేను స్వయంగా పర్యటించి, రైతుల భుజం తట్టి ధైర్యం చెప్పాను. ఈ సందర్భంగా కొంతమంది రైతులు మాట్లాడుతూ ‘‘ఒక పంట పోయినా పర్వాలేదు. ధైర్యంగా ఎదుర్కొంటాం. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలతో మరోపంట పండించుకుంటాం’’ అని ధీమా వ్యక్తం చేయటం నాకు గొప్ప సంతోషాన్ని కలిగించింది. దశాబ్దకాలంలో ప్రభుత్వం రైతులలో కల్పించిన ఆత్మ నిబ్బరానికి వారి మాటలు నిదర్శనంగా నిలిచాయి. కేంద్ర బృందాలు పర్యటనలు, నివేదికల పేరిట కాలహరణం చేసి ఇచ్చే అరకొర సాయం కోసం ఎదురు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఎకరానికి 10 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించింది. ఈ విధంగా గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదు. రైతు సంక్షేమమే పరమావధిగా భావించే ప్రభుత్వం కనుక ఆపత్కాలంలో రైతుకు కొండంత అండగా నిలిచింది.
 
రాష్ట్రంలో 2013-14 లో ఒక కోటి ఎకరాలలో పంటలు సాగయితే, 2022-23 నాటికి సాగు విస్తీర్ణం 2 కోట్ల 20 లక్షల ఎకరాలకు పెరిగింది. ధాన్యం ఉత్పత్తిలో ఒకప్పుడు 15వ స్థానంలో ఉన్న తెలంగాణా నేడు దేశంలో మొదటి స్థానానికి పోటీ పడుతున్నది. 2014-15లో వరి పంట 34 లక్షల 97 వేల ఎకరాలలో మాత్రమే సాగుకాగా, 2022-23 నాటికి ఒక కోటి 21 లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే, 247 శాతం పెరిగింది. 2014-15 లో పత్తిపంట 41 లక్షల 83 వేల ఎకరాలలో సాగుకాగా, 2022-23 లో 50 లక్షల ఎకరాలలో సాగయింది. అంటే 20 శాతం పెరిగింది.

ఇక పంటల దిగుబడి విషయానికి వస్తే, వరి ధాన్యం 2014-15 లో రాష్ట్రంలో వచ్చిన దిగుబడి 68 లక్షల టన్నులు కాగా, 2022-23లో దాదాపు 3 కోట్ల టన్నులకు పైబడిన దిగుబడిని తెలంగాణ సాధించింది. అంటే, 341 శాతం పెరిగింది. అలాగే, పత్తి దిగుబడి 66 శాతం పెరిగింది.

పామాయిల్ పంటకు తెలంగాణ భూములు ఎంతో అనువైనవిగా ప్రభుత్వం గుర్తించింది. లక్ష కోట్ల రూపాయల పామాయిల్ దిగుమతి చేసుకుంటున్న మన దేశంలో ఆయిల్ పామ్ సాగు ఎంతో లాభదాయకం. రైతులకు ప్రయోజనం కల్గించేందుకు ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో కేవలం 32 వేల ఎకరాలలో మాత్రమే ఆయిల్ పామ్ పంట సాగయ్యేది. నేడు ఒక లక్షా ఐదువేల ఎకరాల్లో సాగవుతున్నది. ఈ పంట సాగు విస్తీర్ణాన్ని 20 లక్షల ఎకరాలకు పెంచేందుకు వ్యవసాయ శాఖ కృషి చేస్తున్నది

దేశంలో ఏ ప్రభుత్వమూ రైతులు చర్చించుకోవడానికి ఒక వేదిక అవసరమని ఆలోచించలేదు. రైతన్నల ఆత్మగౌరవాన్ని చాటే విధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 5 వేల ఎకరాల క్లస్టర్ కు ఒకటి చొప్పున మొత్తం 2,601 రైతువేదికలను నిర్మించింది. ఈ రైతు వేదికలు తెలంగాణ వ్యవసాయ ప్రగతి దీపికలై రైతన్నలకు మార్గదర్శనం చేస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రం అవతరణకు 10 సంవత్సరాల ముందువరకూ వ్యవసాయ రంగ యాంత్రీకరణకు కేవలం 490 కోట్ల రూపాయలు మాత్రమే ఆ నాటి ప్రభుత్వాలు వ్యయ పరిస్తే, మనం స్వరాష్ట్రంలో గత తొమ్మిదేళ్ళలో వ్యవసాయ యంత్రాలకోసం 6 లక్షల 70 వేలమంది రైతులకు ప్రయోజనం కల్పిస్తూ, 963 కోట్ల రూపాయలు ఖర్చుచేసుకున్నాం. 2022-23 సంవత్సరంలో వ్యవసాయరంగ యాంత్రీకరణ కోసం 500 కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం. దశాబ్దకాలం ముంగిట నిలిచి చూస్తే నేడు తెలంగాణ సేద్యం సిరులు కురిపిస్తున్నది. తెలంగాణ రైతు రాజ్యమై విలసిల్లుతున్నది.

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి
రాష్ట్ర ఆవిర్భావం జరిగిన వెంటనే దశాబ్దాల తరబడి ప్రజలను పీడిస్తున్న అనేక గడ్డు సమస్యలను ప్రభుత్వం శాశ్వతంగా పరిష్కరించింది. మరోవైపు అస్తవ్యస్తంగా తయారైన గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సంపూర్ణ పరివర్తనను సాధించేందుకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో సమగ్ర ప్రణాళిలను ప్రవేశపెట్టింది. ఈ ప్రణాళికలు అద్భుతమైన ఫలితాలను సాధించాయి. ఒకప్పుడు తెలంగాణ పల్లెలు, పట్టణాల్లో ఎక్కడ చూసినా చెత్తా చెదారం పేరుకుపోయి కనిపించేది. పరిసరాలు అపరిశుభ్రంగానూ, దుర్గంధ భూయిష్టంగానూ ఉండేవి. పాడుబడిన ఇళ్ల శిథిలాలు, నిరుపయోగమై ప్రమాదకరంగా ఉన్న బావులు, పసిపిల్లలు పడిపోయే విధంగా బోరు పొక్కలు వంగి, మెలికలు తిరిగిన, విరిగి పోయిన విద్యుత్ స్తంభాలు, జారిపోయి ఎక్కడ షాక్ కొడతాయో అనేలా వేలాడుతూ భయపెట్టే విద్యుత్ తీగెలు, గుంతలమయమైన రోడ్లు, బురదమయమైన వీధులు, పిచ్చిచెట్ల పొదలు, మురుగు పేరుకుపోయిన కాల్వలు, మిణుకు మిణుకుమనే వీధిలైట్లతో, పల్లెలు మురికికూపాల్లా ఉండేవి, పట్టణాలు నరకానికి నకళ్లుగా కనిపించేవి. చివరికి ఎవరైనా మరణిస్తే, వారికి గౌరవప్రదంగా అంత్యక్రియలకు కూడా స్థలం వెతుక్కోవాల్సిన అనాగరిక స్థితి ఆనాడు ఆవరించి ఉండేది.

ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా, పల్లెలు, పట్టణాల సమగ్రాభివృద్ధి కోసం చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు గ్రామాల, పట్టణాల రూపురేఖలనే మార్చివేశాయి.

నేడు పల్లెలు, పట్టణాలు మౌలిక వసతులతో పరిశుభ్రతతో, పచ్చదనంతో ఆహ్లాదకరంగా రూపొందాయి. ఈ పరిణామం అంత సులభంగా జరగలేదు. పటిష్టమైన చట్టాలు, సమగ్రమైన ప్రణాళిక, యుద్ధ ప్రాతిపదికన మౌలిక వసతుల నిర్మాణం చేయడం వల్లనే ఈ అద్భుతమైన పరివర్తన సాధ్యమైంది.

2014 ముందు స్థానిక సంస్థలకు తమ బాధ్యతలు, విధులకు సంబంధించి సరైన మార్గనిర్దేశనం ఉండేది కాదు. జవాబుదారీతనం లేని స్థానిక నాయకత్వం రాజకీయాలకు, పైరవీలకే పరిమితమయ్యేది. దీంతో పల్లెలు, పట్టణాల పరిస్థితి అధ్వాన్న దశలో ఉండేది.

స్థానిక సంస్థల పనితీరును మార్చేందుకు ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని, పురపాలక చట్టాన్ని ప్రవేశ పెట్టింది. నాయకులు, ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉంటూ, పారదర్శకంగా, బాధ్యతాయుత పాలన అందించే విధంగానూ, పన్నులు సమర్థవంతంగా వసూలు చేయడంతోపాటూ, పారిశుద్ధ్యం, పచ్చదనం పెంచే విధంగానూ వారికి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించింది. లక్ష్యాల సాధనలో అలసత్వం ప్రదర్శించిన, నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులతోపాటూ, ప్రజాప్రతినిధులపై సైతం కఠిన చర్యలు తీసుకునే నిబంధనలను ఈ చట్టంలో పొందుపరిచింది. దీంతో స్థానిక సంస్థల పనితీరులో అద్భుతమైన మార్పు వచ్చింది. గతంలో మూడు నాలుగు గ్రామాలకు కలిపి ఒక కార్యదర్శి ఉంటే గొప్ప. తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించింది. పారిశుద్ధ్య నిర్వహణకు, మొక్కల పెంపకానికి కావాల్సిన సాధనాలను సమకూర్చింది. ఈ రోజు తెలంగాణలోని ప్రతి గ్రామం ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ ను కలిగి ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకూ ఈ రకమైన వసతులు లేవు.

గ్రామ, పట్టణ పరిపాలనను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం లోకల్ బాడీ కలెక్టర్లను కూడా నియమించింది. ఈ చర్యల ఫలితంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలు కొత్తరూపును సంతరించుకున్నాయి.

మన రాష్ట్రానికి దేశస్థాయిలో కీర్తి, ప్రతిష్టలను సమకూర్చి పెట్టాయి. ఈ కార్యక్రమాల ద్వారా పల్లెలు, పట్టణాలలో పరిశుభ్రత, మంచినీటి వసతి, చెట్ల పెంపకం, అంతర్గత రహదారుల నిర్మాణం, మురుగుకాల్వల నిర్వహణ, హరితహారం, వైకుంఠధామాలు, రైతు కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్ళ నిర్మాణం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగాం. ఉత్తమ పంచాయతీలకు ఉండవలసిన అన్ని అర్హతలు మనం కల్పించుకోగలిగాం.

ప్రభుత్వం తెలంగాణలోని 12,769 గ్రామాలను అంటే 100 శాతం గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా తీర్చిదిద్ది దేశంలోనే టాప్ ర్యాంక్ ను సాధించింది. ఇటీవల న్యూఢిల్లీలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మన పల్లెలకు 13 జాతీయ అవార్డులు లభించాయి. వీటిని రాష్ట్రపతి చేతులమీదుగా ఆయా స్థానిక సంస్థల ప్రతినిధులు అందుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణం.

నేడు తెలంగాణ గ్రామాలను చూసిన వారెవరైనా ఇవి ఒకప్పటి గ్రామాలేనా? ఎంతలో ఎంత మార్పు? అని ఆశ్చర్యపోయే విధంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరిగింది.

తెలంగాణలోని పురపాలికలు భారీ సంఖ్యలో జాతీయ అవార్డులను పొందడం పట్టణ ప్రగతి విజయానికి నిదర్శనం. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 అవార్డుల్లో రాష్ట్రంలోని 23 పట్టణ స్థానిక సంస్థలు అవార్డుల్ని గెల్చుకున్నాయి.

పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన జీవనాన్ని, రాష్ట్రానికి ఎనలేని కీర్తిని ఆర్జించి పెట్టిన గ్రామ సర్పంచ్ లకు, ఎంపిటీసీలకు, జెడ్పీటీసిలకు, మండల అధ్యక్షులకు, జిల్లా పరిషత్ ఛైర్మన్లకు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లకు, కార్పోరేషన్ల మేయర్లకు, కార్పోరేటర్లకు, పంచాయతీరాజ్, మున్సిపల్ మున్సిపల్ ఉద్యోగులకు నేను హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాను.

హైదరాబాద్ నగరాభివృద్ధి
విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ మహానగరం ఒక “మినీయేచర్ ఆఫ్ ఇండియా”. దినదినాభివృద్ధి చెందుతున్న ఈ మహానగరంలో ప్రజల అవసరాలు తీర్చేందుకు హెచ్.ఎం.డీ.ఏ పరిధిలో ఈ నగరంలో మురుగునీటి నిర్వహణ కోసం సీవరేజ్ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నది. నగరంలో నిరంతరం తాగునీటి సరఫరా కోసం 2,214 కోట్ల రూపాయలతో చేపట్టిన సుంకిశాల ఇన్ టేక్ వెల్ పనులు త్వరలో పూర్తి కానున్నాయి.

రోజురోజుకూ పెరుగుతున్న విమాన ప్రయాణీకుల రవాణా సౌకర్యం కోసం హైదరాబాద్ నలుమూలల నుంచి విమానాశ్రయానికి మెట్రోరైలు విస్తరణకు రూపకల్పన చేసుకున్నాం. మొత్తం 6,250 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టును రాష్ట్రప్రభుత్వం తన సొంత నిధులతోనే వచ్చే మూడేళ్ళలో పూర్తి చేయాలని సంకల్పించింది, దీనికి శంకుస్థాపన సైతం జరుపుకున్నాం.

రాజధాని నగరంలో మౌలిక వసతులు మెరుగు పరచడానికి ప్రభుత్వం పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టింది. నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గించడం కోసం ఎస్సార్డీపీ కింద 67 వేల 149 కోట్ల రూపాయలతో 42 కీలక రహదారులు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, ఆర్వోబీల అభివృద్ధి చేపట్టింది. వీటిలో చాలా భాగం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 275 కోట్ల రూపాయలతో 22 లింక్ రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేసింది.

విదేశాల నుంచి వచ్చి హైదరాబాద్ ను చూసినవారు ఆశ్చర్యానందాలకు గురవుతున్నారు. ప్రపంచంలోని ఏ ప్రతిష్టాత్మక నగరానికీ తీసిపోని స్థాయిలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని వారంతా కితాబునిస్తుండటం మనందరికీ గర్వకారణం.

తెలంగాణకు హరితహారం
సమైక్య రాష్ట్రంలో జరిగిన పర్యావరణ విధ్వంసం నుండి కోలుకునేందుకు, అడవుల పునరుద్ధరణ కోసం, రాష్ట్రవ్యాప్తంగా చెట్ల పెంపకం కోసం ప్రభుత్వం తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో చేపట్టింది. హరించుకుపోయిన వనాలను పునరుద్ధరించి, రాష్ట్రంలో పచ్చదనాన్ని 22 శాతం నుంచి 33 శాతానికి పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించుకున్నాం. ప్రజా సహకారంతో ఒక ఉద్యమంగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం.

గత తొమ్మిదేళ్లలో రికార్డు స్థాయిలో 273 కోట్ల మొక్కలు నాటుకున్నాం. 2015-16లో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 19,854 చదరపు కిలోమీటర్లు ఉండగా, 2023 నాటికి అది 26,969 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. దేశంలోనే అత్యధికంగా తెలంగాణ విస్తీర్ణంలో అడవులు 24.06 ఉన్నాయి. చెట్ల సాంద్రత 2014లో 2,549 చ.కి.మీ. ఉండగా.. ప్రస్తుతం అది 2,848 చ.కి.మీలకు పెరిగింది. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో 7.70 శాతం పచ్చదనం పెరిగిందని ఫారెస్టు సర్వే ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొనటం సంతోషదాయకం.

ఒకప్పుడు పట్టణాలు, నగరాల్లోనే పార్కులు అంతగా అందుబాటులో ఉండేవి కావు. ఒకవేళ ఉన్నా వాటి నిర్వహణ సరిగా జరిగేది కాదు. కానీ నేడు తెలంగాణ ప్రభుత్వం ప్రతీ గ్రామంలో ఒక నర్సరీతోపాటు, 19,472 పల్లె ప్రకృతి వనాలు, 2,725 బృహత్ పల్లెప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష కిలోమీటర్ల పొడవునా రహదారి వనాలు పూర్తిచేశాం. అందుకే ఇప్పుడు ఏ రోడ్డు వెంట వెళ్లినా పచ్చదనం కనువిందు చేస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే వాళ్లు తెలంగాణ పొలిమేరల్లోకి రాగానే వర్ణశోభితమై కనువిందు చేస్తున్న చెట్లను చూసి పులకించి పోతున్నారు, ఇది మనకు గర్వకారణం. పట్టణాల్లో 700 కోట్ల రూపాయల వ్యయంతో 179 చోట్ల అర్బన్ ఫారెస్టు పార్కులు ఏర్పాటు చేసుకున్నాం. హరితహారం ఇచ్చిన సత్ఫలితాలతో మన హైదరాబాద్ నగరం ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా రెండుసార్లు గుర్తింపు పొందింది.

రానున్న వర్షాకాలంలో హరితహారం కార్యక్రమంలో 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగానే జూన్ 19వ తేదీన హరితోత్సవాన్ని జరుపుకుందాం. ఇందులో అన్ని సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు, రహదారుల వెంట, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాల్లో అన్ని చోట్లా, అడుగడుగునా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ఈ కార్యక్రమంలో ఆబాల గోపాలం భాగం పంచుకోవాలని పిలుపునిస్తున్నాను.

హరితహారం ద్వారా ఫలసాయం ఇచ్చే మొక్కలతోపాటు, తాటి, ఈత మొక్కలను కూడా పెద్ద సంఖ్యలో నాటి గీతకార్మికుల ఉపాధికల్పనకు కూడా దోహదం చేసుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమం దేశంలో మరెక్కడా లేదు. చైనా, బ్రెజిల్ తర్వాత పచ్చదనాన్ని పెంచేందుకు జరుగుతున్న అతి పెద్ద మానవ మహా ప్రయత్నంగా తెలంగాణకు హరితహారం అంతర్జాతీయ ఖ్యాతి గడించింది.

హరితనిధి ఒక నవీన ఆలోచన:
ప్రపంచంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యంతో హరితనిధిని ఏర్పాటు చేసింది. ఇందులో, శాసనసభ, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్ధులు వీరందరిని హరితనిధిలో భాగస్వాములను చేసింది.

వీరి నుండి సమీకరించిన మొత్తంతో హరిత నిధిని ఏర్పాటు అయ్యింది. నూతన పంచాయితీరాజ్, మున్సిపల్ చట్టాలలో స్థానిక సంస్థలు తమ బడ్జెట్ లో 10 శాతం పచ్చదనం అభివృద్ధికై ఖర్చు చేయాలని నిబంధనను పొందుపర్చింది. ఈ విధానం అద్భుతమైన ఫలితాలను సాధించింది. హరితనిధికి నోడల్ ఏజెన్సీగా అటవీశాఖ వ్యవహరిస్తున్నది.

విద్యారంగంలో అద్భుత ఫలితాలు
దేశవ్యాప్తంగా చూస్తే గురుకుల విద్యలో తెలంగాణకు సాటి రాగల రాష్ట్రం మరొకటి లేదు. నాడు పీ.వీ.నరసింహరావు గారి దార్శనికతతో ప్రారంభమైన గురుకుల విద్యాలయాల వ్యవస్థ, నేడు తెలంగాణ ప్రభుత్వ హయాంలో శిఖరాయమానమైన స్థాయికి చేరింది. గతంలో ఒక్క జూనియర్ కాలేజీ స్థాపన కోసం దశాబ్దాల తరబడి వేచి చూసే దుర్గతి అనుభవించిన తెలంగాణలో నేడు 1,002 గురుకుల జూనియర్ కళాశాలలు కొలువుదీరడం తెలంగాణ ప్రభుత్వం సృష్టించిన చారిత్రాత్మక పరిణామం.

పేద విద్యార్థులు చదువులో ముందుండాలంటే అది గురుకుల విద్య ద్వారానే సాధ్యమవుతుందన్నది తెలంగాణ ప్రభుత్వ విశ్వాసం. అందుకే రాష్ట్రంలో గురుకుల విద్యకు పెద్దపీట వేసుకున్నాం. నేడు చక్కని సౌకర్యాలతో 1,002 వరకూ గురుకులాలను ఏర్పాటు చేసుకున్నాం. అవి 5 లక్షల 59 వేల మంది విద్యార్ధులకు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా నాణ్యమైన వసతులతో కూడిన విద్యనందిస్తున్నాయి. వీటి నిర్వహణకు బడ్జెట్ కూడా భారీగా పెంచాం. విద్యార్థుల సంఖ్య మాత్రమే కాదు, ఉత్తమ ఫలితాల సాధనలోనూ మన విద్యార్థులు ఎవరికీ తీసిపోరని నిరూపిస్తున్నారు. నేడు మన రాష్ట్రంలో గురుకుల కళాశాలల విద్యార్థుల కోసం కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వంటి బహుళజాతి సంస్థలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించే స్థాయికి గురుకులాలు ఎదిగాయి. నిరక్షరాస్య కుటుంబాల నుంచి వచ్చిన పేద విద్యార్థులు గురుకులాలలో శిక్షణ పొంది దేశంలోని అనేక ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రవేశాలను సాధిస్తున్నారు. మన గురుకుల విద్యార్థుల ప్రతిభ ఎవరెస్టు శిఖరాన్ని తాకేంత ఎత్తుకు ఎదిగింది.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు దశలవారీగా మెరుగుపరచేందుకు మన ఊరు -మన బడి అనే బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది.

ఈ పథకం కింద డిజిటల్ విద్యతో పాటు 12 రకాల మౌలిక వసతులను కల్పిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 26,065 పాఠశాలల్లో మూడు దశల్లో ఈ మౌలిక వసతులు ఏర్పాటవుతున్నాయి. ఆంగ్ల మాధ్యమంలో బోధించడానికి అనుగుణంగా ఉపాధ్యాయులందరికీ శిక్షణ ఇవ్వడం జరిగింది. భావి భారత పౌరులు ఆరోగ్యంగా, బలవర్ధకంగా ఎదగాలన్న లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హాస్టళ్ళు, ఇతర విద్యాసంస్థలలో సన్నబియ్యంతో భోజనం పెడుతున్నది. ఇటీవల విడుదలైన ఫలితాలలో రాష్ట్రంలోని అన్నిరకాల పాఠశాలల్లో సంతృప్తికరమైన ఫలితాలు వచ్చాయి. వివిధ రాష్ట్రాల స్థితిగతుల ఆధారంగా ఆర్.బి.ఐ విడుదల చేసిన హ్యాండ్ బుక్ ప్రకారం పిల్లల ఎన్ రోల్ మెంట్ లో తెలంగాణ ముందువరుసలో నిలిచింది. విద్యా బోధనలోనూ, విద్యార్ధుల అభ్యసన ప్రక్రియలోనూ ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతూ విద్యాశాఖ పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. పాఠశాలల్లో విద్యార్ధులకు ఉదయంవేళ ఉపాహారంగా పౌష్టిక విలువలు నిండిన రాగిజావను అందించబోతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.

పేద విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసించడమే ఒక కల. అలాంటిది విదేశీవిద్య చదవాలంటే అది అసాధ్యం అనే భావన ఇదివరకు ఉండేది. కానీ, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే తెలంగాణ ప్రభుత్వం ఘనత. ఎంతో చురుకైన విద్యార్ధులు ప్రతిభావంతులై ఉండికూడా ఆర్థిక స్తోమత లేక ఉన్నత విద్యకు దూరం కాకూడదు. అందుకే, వారికి 20 లక్షల రూపాయల విదేశీ విద్య ఉపకార వేతనం అందించుకుంటున్నాం. దళిత సామాజిక వర్గానికి భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ పేరిట, బలహీన వర్గాలవారికి, ఇ.బి.సి.లకు మహత్మా జ్యోతిబా పూలే పేరిట, బ్రాహ్మణులకు వివేకానంద విదేశీ విద్యా పథకం పేరిట, మైనారిటీలకు కేసీఆర్ ఓవర్సీస్ విద్యాపథకం పేరిట 20 లక్షల రూపాయల సహాయం సమకూరుస్తున్నాం. ఈ పథకం కింద లబ్ధిపొందిన అనేక మంది విద్యార్థులు నేడు వివిధ దేశాలలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.

మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, వారికి ఎటువంటి ఆపద ఎదురైనా ప్రభుత్వం వెనువెంటనే స్పందించి, నేనున్నానంటూవారిని ఆదుకొంటోంది. విదేశమైన ఉక్రెయిన్ సంఘటనలో గానీ, మనదేశంలోని మణిపూర్ సంఘటనల సందర్భంగా గానీ, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ, మన ప్రభుత్వం ప్రత్యేక విమానాలను పంపి ఆయా ప్రాంతాలలోని మన విద్యార్థులను సురక్షితంగా ఇంటికి చేర్చి ఆదుకున్న విషయం మీకు తెలిసిందే.

అత్యుత్తమ వైద్య సేవలు
అత్యంత పిన్నవయస్సు గల రాష్ట్రం స్వల్ప వ్యవధిలో వైద్యారోగ్య రంగాన్ని విస్తృత పరిచింది. వైద్యసేవల ప్రమాణాలను పెంచింది. 2014లో తెలంగాణ వచ్చేనాటికి ఆరోగ్యరంగం అంపశయ్య మీద ఉంది. మందుంటే సూదిలేక, సూది ఉంటే మందు లేక, పడకలు లేక ఉన్న పడకలకు ఆక్సీజన్ సౌకర్యం లేక, సిబ్బంది లేక ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. నేడు స్వపరిపాలనలో ఆరోగ్య రంగం ప్రజలకు అత్యంత చేరువయింది. విశ్వసనీయతను పెంచుకున్నది. ప్రజలకు ఆరోగ్యభాగ్యాన్ని అందించడంలో నేడు తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది.

అన్ని దవాఖానాల్లో మౌలిక వసతులు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకున్నాం. ఆస్పత్రులలో అవసరమైన వైద్య పరికరాలు, సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఉచిత డయాగ్నస్టిక్ సెంటర్లు, కిడ్నీరోగుల కోసం ఉచితంగా డయాలసిస్ సెంటర్లు, అన్ని ఆస్పత్రులలో ఆక్సిజన్ సదుపాయం గల పడకలు ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలో కేవలం 1400 ఆక్సిజన్ పడకలు ఉంటే, వాటి సంఖ్యను 27,966 కు అంటే 20 రెట్లు పెంచుకున్నాం. ఇటీవలనే వైద్యారోగ్యశాఖలో 950 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లను, 1442 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియామకం జరిగింది.

రాష్ట్రం నలువైపుల నుంచీ రాజధాని నగరానికి వైద్యం కోసం వచ్చే పేషంట్లకు సత్వరం కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం కోసం హైదరాబాద్ నగరం నలువైపులా నాలుగు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించుకుంటున్నాం. నిమ్స్ విస్తరణలో భాగంగా మరో రెండువేల పడకలతో ఏర్పాటు చేస్తున్న నూతన వైద్య భవనానికి ఈ దశాబ్ది ఉత్సవాల్లోనే స్వయంగా నేను శంకుస్థాపన చేస్తున్నాను.

వరంగల్ నగరంలో 1100 కోట్ల రూపాయలతో రెండు వేల పడకల సామర్థ్యం గల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. అతి త్వరలోనే ఈ హాస్పిటల్ ప్రారంభించుకునే అవకాశం ఉంది.

గతంలో నగరంలోని బస్తీలలో వైద్యసౌకర్యాలేవీ ఉండేవి కావు. పేదలు విధిలేక ప్రయివేటు వైద్యులను ఆశ్రయించ వలసి వచ్చేది. బస్తీ పేదలకు చేరువలో వైద్యం అందించేందుకు హైదరాబాద్ నగరంలో 256 బస్తీ దవాఖానాలు ప్రారంభించింది. వీటిలో 57 రకాల వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. మేలైన చికిత్సలను అందిస్తున్నారు.

బస్తీ దవాఖానాల మాదిరిగానే ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పల్లె దవాఖానాలను ప్రారంభించబోతున్నది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్స్, న్యూట్రిషన్ కిట్స్, ఆరోగ్యలక్ష్మి తదితర పథకాల వల్ల వివిధ ఆరోగ్య సూచీల్లో తెలంగాణ రాష్ట్రం అద్భుత పురోగతిని సాధించింది. ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల రేటు 30 శాతం నుంచి 62 శాతానికి పెరిగింది. అలాగే, ప్రసవ సమయంలో మాతృ మరణాల రేటు 2014 లో లక్షకు 92 కాగా ప్రస్తుతం 43కి తగ్గిపోయింది. శిశు మరణాల సంఖ్య 2014 లో వెయ్యికి 35 కాగా ప్రస్తుతం 21కి గణనీయంగా తగ్గిపోయింది.

అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం “ఆరోగ్య మహిళ” అనే అత్యుత్తమమైన కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. రాష్ట్రంలో వంద దవాఖానాలలో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమం అమలవుతున్నది. భవిష్యత్తులో మరో 1200 దవాఖానాల్లో ప్రభుత్వం అమలు చేయనున్నది. ఈ మహిళా దవాఖానాలు ప్రతి మంగళవారం కేవలం మహిళల కోసమే పని చేస్తాయి. ఇందులో అటెండర్ నుంచి వైద్యుల వరకూ అంతా మహిళలే ఉంటారు. మహిళలు తమ ఆరోగ్య సమస్యలను సత్వరం పరిష్కరించుకోవచ్చు. ఇక్కడే వైద్య పరీక్షలు చేసి అక్కడికక్కడే మందులు కూడా అందజేస్తారు. అవసరమైతే రిఫరల్ ఆస్పత్రులకు సిఫార్సు చేస్తారు.

రాష్ట్రం ఏర్పాటయిన నాటికి తెలంగాణ ప్రాతంలో కేవలం మూడంటే మూడు వైద్య కళాశాలలు ఉండేవి. ఉస్మానియా, గాంధీ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడేకన్నా ముందు నుంచే ఉన్నాయి. ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. తొలి ఏడున్నర సంవత్సరాల కాలంలోనే ప్రభుత్వం 12 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించింది. ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య 26కి చేరుతుంది. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అనే లక్ష్యం అతిత్వరలోనే నెరవేరనుంది. 2014లో తెలంగాణ ప్రాంతంలో మెడికల్ సీట్లు 850 ఉండగా, వాటి సంఖ్య 2022-23 నాటికి 2,790 కి పెరిగింది. వీటితోపాటు పీజీ సీట్లు కూడా రెట్టింపయ్యాయి. ప్రతి లక్ష జనాభాకు సగటున 19 ఎం.బి.బి.ఎస్ సీట్లతో వైద్య విద్యలో తెలంగాణ దేశం మొత్తంలో ప్రథమ స్థానంలో ఉంది. మెడికల్ పీజీ సీట్లలో ప్రతి లక్ష జనాభాకు 7 సీట్లతో దేశంలో రెండో స్థానంలో ఉంది.

సామాజిక భద్రత కోసం ఆసరా పెన్షన్లు
మానవీయ దృక్పథం లేని ప్రగతి నిరర్థకమని నేను నమ్ముతాను. పేదల కన్నీరు తుడవని, కడుపు నింపని పాలన, పాలన అనిపించుకోదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధితో పాటు, ప్రజా సంక్షేమానికి కూడా సింహభాగం నిధులను ఖర్చు చేస్తున్నది. తెలంగాణలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు, ప్రభుత్వ సంక్షేమ పథకం చేరని ఇల్లు లేదు అని ప్రజలు మాట్లాడుకోవడం తెలంగాణ ప్రభుత్వానికి దక్కిన సార్థకతగా నేను భావిస్తున్నాను

గత ప్రభుత్వాలు ఆసరా పెన్షన్లకింద కేవలం 200 రూపాయలు మాత్రమే చెల్లించేవి. అవికూడా అర్హులందరికీ చేరేవి కావు. లబ్దిదారులకు కనీసం ఒక్క పూటైనా కడుపు నింపని ఆ పెన్షన్ల వల్ల ప్రయోజనం ఏముంది? అందుకే, తెలంగాణ రాష్ట్రంలో పింఛను కింద ఇచ్చే మొత్తాన్ని2,016 రూపాయలకు పెంచుకున్నాం. దివ్యాంగులకు చెల్లించే పెన్షన్ను 3,016 రూపాయలకు హెచ్చించుకున్నాం. పెన్షన్ మొత్తాన్ని పెంచడంతో పాటు, లబ్ధిదారుల సంఖ్యను కూడా గణనీయంగా పెంచుకున్నాం. వృద్ధులు, వితంతువులు, వికలాంగులతో పాటుగా, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, పైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులకు కూడా పెన్షన్ అందించుకుంటున్నాం. 2014లో లబ్ధిదారులు 29 లక్షలు ఉండగా, నేడు 44 లక్షలకు పైగా ఉన్నారు. పెన్షన్ పొందేందుకు వయోపరిమితిని 57 సంవత్సరాలకు తగ్గించడంతో లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగింది.

పేదింటి ఆడపిల్లల పెళ్ళి తల్లిదండ్రులకు భారంగా మారకూడదని కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకం కింద ఒక లక్షా 116 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. ఇప్పటివరకు 13 లక్షల 16 వేల మంది ఆడపిల్లల వివాహాలను ప్రభుత్వం జరిపించింది. ఇందుకోసం 11 వేల కోట్లకు పైగా రూపాయలను ప్రభుత్వం వెచ్చించింది. ఆసరా పించన్లు అందుకుంటున్న వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, మొదలైనవారు ప్రభుత్వాన్ని నిండుగా దీవిస్తున్నారు. వీరందరి ప్రేమాభిమానాలే తెలంగాణ ప్రభుత్వానికి రక్షణ కవచాలై నిలుస్తున్నాయని సవినయంగా తెలియజేస్తున్నాను.

నేతన్న సంక్షేమం
ఉమ్మడి రాష్ట్రంలో నేతన్నల ఆత్మహత్యల పరంపర మనల్ని ఎంతగానో కలచివేసేది. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత నేతన్నల జీవితాలలో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ, సహాయ కార్యక్రమాలను చేపట్టింది. చేనేత కార్మికులకు నూలు, రంగులపై కేంద్ర ప్రభుత్వం కేవలం 10 శాతం సబ్సిడీ ఇచ్చి చేతులు దులుపుకొంటే, తెలంగాణ ప్రభుత్వం చేనేత మిత్ర పథకం కింద 40 శాతం సబ్సిడీ అందిస్తున్నది.

వీటితోపాటు, నేత కార్మికులకు పావలా వడ్డీకే రుణ సదుపాయం కల్పించడంతో పాటు, 2010 నుంచి 2017 వరకూ జాతీయ బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకుల వద్ద ఒక్కొక్క చేనేత కార్మికుడు తీసుకున్న లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేసుకున్నాం. నేత కార్మికులకు ఉపాధి కల్పించి ఆదుకొనేందుకు 2017 సంవత్సరం నుంచి బతుకమ్మ చీరెల తయారీని వారికే అప్పగిస్తూ వస్తున్నాం. ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకూ రూ. 1,727 కోట్లు అందించుకున్నాం.

మత్స్యకారుల సంక్షేమం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జల వనరులను అభివృద్ధి చేయడమే గాకుండా, రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లో చేప, రొయ్య పిల్లల పెంపకాన్ని చేపట్టింది. వాటిపై హక్కులను మత్స్యకారులకే కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. చేపల పెంపకం కోసం ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేసింది. ప్రమాదంలో మరణించే మత్స్యకారుల కుటుంబాలకు ఇన్సూరెన్స్ ద్వారా రూ. 4 లక్షలు, ప్రభుత్వం మరో రూ.5 లక్షలు, మొత్తంగా 9 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తూ అండగా నిలుస్తున్నది.

గీత కార్మికుల సంక్షేమం
కల్లుగీత వృత్తి మీద ఆధారపడి జీవించే గౌడ సోదరుల కోసం తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే సమైక్య రాష్ట్రంలో మూసివేయించిన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని కల్లు దుకాణాలను తిరిగి తెరిపించింది. దీనివల్ల వేలాదిమంది కల్లుగీత కార్మికుల ఉపాధిని నిలబెట్టింది. కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చెట్ల పన్నును రద్దు చేసింది. అంతేకాదు, గతంలోని పన్ను బకాయిలను సైతం మాఫీ చేసింది.

దేశంలో ఎక్కడా లేని విధంగా వైన్‌ షాపుల కేటాయింపులో గౌడ సోదరులకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించింది. తద్వారా గౌడ సోదరులు వ్యాపార రంగంలో బలంగా నిలదొక్కుకునేందుకు అవకాశం కల్పించింది.

మరణించిన లేదా అంగవైకల్యం చెందిన గీత కార్మికునికి సమైక్య రాష్ట్రంలో 50 వేల రూపాయల పరిహారం మాత్రమే అందేది. గౌడ సోదరుల సంక్షేమాన్ని ప్రధాన బాధ్యతగా స్వీకరించిన తెలంగాణ ప్రభుత్వం ఈ పరిహారాన్ని 5 లక్షల రూపాయలకు పెంచి, చిత్తశుద్ధిని చాటుకున్నది.

50 ఏండ్లు నిండిన ప్రతి గీత కార్మికుడికి ప్రభుత్వం 2,016 రూపాయల పింఛన్‌ అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలోని 65,668 మంది గీత కార్మికులకు పింఛన్ల కింద ఇప్పటివరకు దాదాపు 800 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం అందజేసింది. రైతుబీమా తరహాలోనే గౌడ సోదరులకు కూడా 5 లక్షల రూపాయల బీమా పథకాన్ని ప్రభుత్వం అందించబోతున్నది. ఇందుకు అవసరమైన బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది.

మైనారిటీల సంక్షేమం
సర్వమత సమభావన పునాదిగా అన్నివర్గాలలో విశ్వాసాన్ని నెలకొల్పుతూ, ఎవరిపట్లా వివక్షా, ఉపేక్షా లేకుండా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ ఫలాలను సర్వజనులకూ అందిస్తున్నది. మైనారిటీల అభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నది. మైనారిటీ బాలుర కోసం 107, బాలికల కోసం 97 ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూళ్లను నెలకొల్పింది. మైనారిటీ బాలికల విద్యలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ గా నిలిచింది. ఇమామ్ లకు, మౌజన్లకు నెలకు రూ.5 వేల చొప్పున మొత్తం 10 వేల మందికి జీవన భృతిని అందజేస్తున్నది. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఓన్ యువర్ ఆటో, డ్రైవర్ ఎంపవర్ మెంట్ పథకం, ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ తదితర కార్యక్రమాలను అమలు చేస్తున్నది.

ప్రభుత్వమే అధికారికంగా రంజాన్, క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తూ, నిరుపేద ముస్లిం మరియు క్రైస్తవ మతాల పేదలకు కొత్త బట్టలు అందిస్తున్నది. బతుకమ్మ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం కొత్త చీరలు పంపిణీ చేస్తున్నది.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జైన మతస్తులకు మైనారిటీ హోదా కల్పించడంతో వారిలో సంతోషం నెలకొన్నది. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న సర్వమత సమాదరణ విధానానికి ఇది తార్కాణం.

బ్రాహ్మణ సంక్షేమం
సమాజంలో అణగారిన వర్గాలతో పాటు అగ్రవర్ణాల పేదలకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. దేవాలయాలను నమ్ముకొనిజీవనం సాగిస్తున్న నిరుపేద బ్రాహ్మణులకు ధూపదీప నైవేద్యం పథకం ద్వారా ఆదుకుంటున్నది. దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆలయాలలో విధులు నిర్వహించే అర్చకులకు ప్రభుత్వ ఖజానా నుంచి నెలనెలా వేతనాలు అందిస్తున్నది. ఇటీవలనే హైదరాబాద్ లోని గోపన్ పల్లిలో సకలసౌకర్యాలతో, కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని నేను స్వహస్తాలతో ప్రారంభించాను. ఈ భవనం భారతీయ సనాతన సంస్కృతికి వారధిగా, వైదిక గ్రంథాలయంగా, వివిధ క్రతువుల నిర్వహణకు మార్గదర్శిగా పేద బ్రాహ్మణులకు సహకార కేంద్రంగా, లోక కల్యాణకారిగా వెలుగొందాలని ఆకాంక్షిస్తున్నాను. విప్రహిత పేరుతో ఏర్పాటయిన ఈ భవనం సకల జనహితగా, విశ్వహితగా వెలుగొందాలని ఆశిస్తున్నాను.

మహాకవి కాళిదాసు సాహిత్య ఔన్నత్యాన్ని తన సంజీవని వ్యాఖ్యతో ప్రపంచానికి చాటిచెప్పిన మహామహోపాధ్యాయుడు కోలాచల మల్లినాథ సూరి పేరున ఆయన స్వస్థలమైన మెదక్ జిల్లా కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తున్నదని తెలియజేస్తున్నాను.

ప్రస్తుతం బ్రాహ్మణ పరిషత్తు ద్వారా వేద / శాస్త్ర పండితులకు ప్రతినెలా ఇస్తున్న గౌరవ భృతిని రూ.2,500 నుండి రూ.5 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ భృతిని పొందే అర్హత వయస్సును ప్రభుత్వం 75 ఏళ్ల నుండి 65 ఏళ్లకు తగ్గించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 3,645 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం వర్తిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా మరో 2,796 దేవాలయాలకు కూడా ధూప దీప నైవేద్య పథకాన్ని విస్తరింపజేస్తున్నది. దీంతో రాష్ట్రంలో 6,441 దేవాలయలకు ధూప దీప నైవేద్యం పథకం కింద నిర్వహణ వ్యయం అందుతుంది. ఇప్పటివరకు ధూపదీప నైవేద్య పథకం కింద దేవాలయాల నిర్వహణ కోసం అర్చకులకు నెలకు 6 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తున్నది. ఈ మొత్తాన్ని 10 వేల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వేద పాఠశాలల నిర్వహణ కోసం ఇస్తున్న 2 లక్షల రూపాయలను ఇకనుంచీ Annual Grant గా ఇస్తామని తెలియజేస్తున్నాను. I.I.T, I.I.M లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

పాలనాసంస్కరణలు
పరిపాలనా సంస్కరణలు తెలంగాణ సత్వర అభివృద్ధికి గొప్ప చోదకశక్తిగా పనిచేశాయి. పరిపాలనా వ్యవస్థ ప్రజలకు చేరువైంది. పర్యవేక్షణ సులభతరమైంది. ప్రజలకు దూరాభారం తగ్గింది. అధికారుల్లో, ప్రజా ప్రతినిధుల్లో జవాబుదారీతనం పెరిగింది. ఆయా జిల్లా కేంద్రాల అభివృద్ధి వేగవంతమైంది. పాలన పారదర్శకంగా ఉండేందుకు రాష్ట్ర అవతరణ అనంతరం 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించుకున్నాం.

కొత్తగా 153 మండలాలు, 35 రెవెన్యూ డివిజన్లు, 8 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 కొత్త మున్సిపాలిటీలు, 4,914 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పాటు చేసుకున్నాం. గతంలో కలెక్టరేట్ భవనాలు అరకొర వసతులతో ఉండేవి. టాయిలెట్స్ కూడా సరిగా ఉండేవి కావు. కార్యాలయానికి వచ్చే ప్రజలు కూర్చొనేందుకు కుర్చీలుకూడా అందుబాటులో ఉండేవి కావు. కానీ, ప్రస్తుతం వివిధ జిల్లాలలో సకల సౌకర్యాలతో సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయాలను నిర్మించుకుంటున్నాం. ఈ కార్యాలయ భవనాల స్థాయిలో ఏ రాష్ట్రంలో కలెక్టరేట్లు లేవని అందరూ ప్రశంసించడం మన ప్రగతి వైభవానికి నిదర్శనం. ఈ కార్యాలయాలు, ప్రజలకు శ్రద్ధాభక్తులతో సేవచేసే పవిత్ర దేవాలయాలుగా వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ఎంప్లాయి ఫ్రెండ్లీ గవర్నమెంట్
రాష్ట్రం అవతరించిన వెంటనే ప్రభుత్వోద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఇంక్రిమెంట్ ను అందించుకున్నాం. ఉద్యోగులకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చుకున్నాం. కరోనాతో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనా, గత పీఆర్సీ లో 30 శాతం ఫిట్ మెంట్ ను ఇచ్చుకున్నాం. దీనిని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా వర్తింపజేసి అమలు పరుచుకున్నాం. గ్రామీణ సమాజానికి అంగన్ వాడీ టీచర్లు, వర్కర్లు చేస్తున్న సేవను గౌరవిస్తూ ప్రభుత్వం వారి వేతనాలను మూడు దఫాలుగా 325 శాతం పెంచింది.

2014లో అంగన్ వాడీ టీచర్ల వేతనం కేవలం రూ.4,200, వారి సహాయకులకు రూ.2,200 వేతనం లభించేది. ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలోని అంగ‌న్‌వాడీ టీచర్లకు రూ.13,650, మినీ అంగన్ వాడీ టీచర్లకు రూ.7,800, అంగన్ వాడీ హెల్పర్లకు రూ.7,800 చొప్పున దేశంలోకెల్లా అత్యధిక వేతనాలను చెల్లిస్తున్నాం.

పల్లెను ఆరోగ్యంగా ఉంచడంలో ఆశా కార్యకర్తల పాత్ర కీలకమైనది. గర్భిణులను, బాలింతలను కంటికి రెప్పలా కాపాడుకోవడంలో వాళ్లు సాక్షాత్తూ అశ్వినీ దేవతలే. 2014లో వీరికి కేవలం రూ.1500 మాత్రమే లభించేది. నేడు తెలంగాణ ప్రభుత్వం వారికి గౌరవప్రదంగా 9,750 రూపాయల వేతనం అందిస్తున్నది.

నేడు దేశంలో అనేక విభాగాల్లో అత్యధిక వేతనాలు పొందుతున్నది మన తెలంగాణ ఉద్యోగులేనని సగర్వంగా ప్రకటిస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం తొలినుంచీ ఉద్యోగులతో స్నేహభావంతో మెలిగే ప్రభుత్వమన్నది అందరికీ తెలిసిందే. పల్లెల్లో జరిగే ప్రతి పనిలోనూ వీఆర్ఏలు ముందుండి సేవలందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 20 వేల మంది వీఆర్ఏల సర్వీసుల క్రమబద్దీకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. అదేవిధంగా 9355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసులను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ప్రక్రియ కొనసాగుతున్నది. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆకాంక్షలకు తగ్గట్టుగా ఎన్నో అవరోధాలను అధిగమించి భారీగా ఉద్యోగ నియామకాలు చేసుకుంటున్నాం. ఇందుకు లోకల్ కేడర్ల ఏర్పాటు, నియామకాలలో స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్ వ్యవస్థ కోసం రాజ్యాంగ ప్రకారం, రాష్ట్రపతి ఉత్తర్వులను సాధించుకున్నాం. ఈ ఉత్తర్వుల వల్ల తెలంగాణలోని 33 జిల్లాలు, 7 జోన్లు, 2 మల్టీజోన్లుగా ఉద్యోగ నియామకాలకు ఏర్పాటు చేసుకున్నాం. గతంలో స్థానికులకు 60 శాతం నుంచి 80 శాతం వరకే లోకల్ రిజర్వేషన్లు ఉండేవి. కానీ ఇప్పడు అమలుచేస్తున్న నూతన నియామక విధానంలో అటెండరు స్థాయి నుంచి ఆర్డీఓ స్థాయిదాకా స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు లభిస్తాయి. ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన మరో విజయం. ఒక వంక ప్రభుత్వ కార్యాలయాలలో ఖాళీలను పూరిస్తూనే, మరోవంక దీర్ఘకాలంగా కాంట్రాక్టు విధానంపై పనిచేస్తున్న సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరించుకుంటున్నాం. ప్రయివేటు రంగంలో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించుకోగలుగుతున్నాం.

పరిశ్రమల వెల్లువ
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూపొందించిన టీఎస్ఐపాస్ చట్టం రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. దీనివల్ల పరిశ్రమల స్థాపనకు అనుమతుల మంజూరు సులభతరమైంది. దీనికి తోడు 24 గంటలు విద్యుత్తు, మెరుగైన శాంతిభద్రతలు, స్థిరమైన, సమర్థవంతమైన పరిపాలన పరిశ్రమలకు వరంగా మారాయి. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఎన్నింటికో ఇప్పుడు తెలంగాణ ఆకర్షణీయ గమ్యస్థానమైంది.

సమైక్య రాష్ట్రంలో విద్యుత్ కోతలు,పవర్ హాలీడేస్, నీటికొరత కారణంగా అనేక పరిశ్రమలు మూత పడ్డాయి. పారిశ్రామిక వేత్తలు దిక్కుతోచని స్థితిలో విలవిలలాడారు. పరిశ్రమల మూతతో నిరుద్యోగం తాండవించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో ఈ సమస్యలన్నింటికీ సమూల పరిష్కారం లభించింది.

నేడు టిఎస్ ఐపాస్ వల్ల పారిశ్రామిక వేత్తలు ఎంతో ఉత్సాహంతో పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నారు. మన రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు కావలసిన అన్ని మౌలిక వసతులు సమకూర్చడంతోపాటు, సత్వరం అనుమతులూ, ఎక్కడా అవినీతికి చోటులేక పోవడం పారిశ్రామిక వేత్తలకు ఆనందం కలిగిస్తోంది. ఇప్పటివరకూ 2,64,956 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలివచ్చాయి. 17 లక్షల 77 వేల మందికి ఉపాధి లభిస్తున్నది.

ఐటీ రంగంలో తెలంగాణ ప్రగతి
ఐటీ రంగంలోనూ తెలంగాణ రాష్ట్రం మేటిగా నిలిచింది. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఐటీ వార్షిక ఎగుమతుల విలువ 57 వేల 258 కోట్ల రూపాయల నుంచి లక్షా 83 వేల 569 కోట్లకు పెరిగింది. అంటే స్వరాష్ట్రంలో 220 శాతం వృద్ధిరేటు నమోదయింది. ఐటీ ఉద్యోగాల నియామకాలలో కూడా 156 శాతం వృద్ధి ఉండటం విశేషం. 2014 నాటికి తెలంగాణలో కేవలం 3 లక్షల 23 వేల 396 మంది ఐటీ ఉద్యోగులు ఉంటే, ఇప్పుడు వారి సంఖ్య 8 లక్షల 27 వేల 124కి పెరిగింది.

ఐటీ రంగాన్ని హైదరాబాద్ నగరానికే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాలకు కూడా విస్తరింపజేసుకున్నాం. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, సిద్ధిపేటలలో కూడా ఐటీ టవర్లను నిర్మించుకున్నాం. ఎస్.సి పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర అవతరణ అనంతరం 1400 కోట్ల రూపాయలను ప్రోత్సాహకంగా అందించాం. రాష్ట్రంలో ఖాయిలాపడిన పరిశ్రమలను పునరుద్ధరించడానికి కూడా తగిన ప్రాధాన్యతనిస్తున్నాం. సిర్పూర్ పేపర్ మిల్స్ వంటి పలు యూనిట్లను పునరుద్ధరించాం.

రాష్ట్ర అవతరణ తరువాత హైదరాబాద్ మహానగరం పేరు జాతీయంగా, అంతర్జాతీయంగా మార్మోగిపోతోంది. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో అగ్రగామిగా నిలుస్తోంది. ఇటీవల దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణకు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అనేక అంతర్జాతీయ సదస్సులకు మనకు ఆహ్వానాలు అందుతున్నాయి. గతంలో వచ్చిన దిగ్గజ సంస్థలేగాక, ఈ మధ్యన ఇంగ్లాండు, అమెరికాల నుంచి కూడా అనేక ప్రఖ్యాతిగాంచిన సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. కొన్ని సంస్థలు అక్కడికక్కడే ఒప్పందాలు కూడా చేసుకున్నాయి.

ఇదీ తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ఇదీ మన రాష్ట్రం జాతీయ, అంతర్జాతీయంగా సాధించిన ఖ్యాతి. ఇది తెలంగాణపై ఇతర దేశాలకు ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని వెల్లడిస్తున్నది. వినూత్న ఆవిష్కరణలతో ముందుకువచ్చే యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్, రీచ్ సంస్థలు దోహదపడుతున్నాయి.

వినూత్న స్టార్టప్ ల ఆవిష్కరణల్ల టీ-హబ్ దేశంలోనే రికార్డు సృష్టించింది. అందుకే టీ-హబ్-2 ను కూడా ప్రారంభించుకున్నాం. 2022లో భారత ప్రభుత్వం నిర్వహించిన నేషనల్ స్టార్టప్ అవార్డులలో మన టీ-హబ్ ఉత్తమ ఇంక్యుబేటర్ గా నిలిచింది.

పటిష్టంగా శాంతిభద్రతల పరిరక్షణ
శాంతిభద్రతల పరిరక్షణలోనూ తెలంగాణ అగ్రగామిగా ఉంది. ఒక రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే సమర్ధవంతంగా శాంతిభద్రతలు నిర్వహించాలి. శాంతిభద్రతల వల్లనే స్థిరత్వం నెలకొంటుంది. స్థిరత్వం ఉన్నచోటే వ్యాపార వాణిజ్యాలు సక్రమంగా సాగుతాయి. ఈ రోజు మన రాష్ట్రానికి దేశంలో ఎక్కడా లేనివిధంగా పెట్టుబడులు వస్తున్నాయంటే రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో అమలవుతున్న శాంతిభద్రతల నిర్వహణే కారణం. నేడు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను పటిష్టం చేయడంతోపాటు రాష్ట్రస్థాయిలో తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సైబర్ సేఫ్టీ బ్యూరో, అంతర్జాతీయ స్థాయిలో “కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్” ను ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రంలో నిఘా వ్యవస్థను పటిష్టంచేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇది దేశంలోనే రికార్డు.

లక్ష కిలోమీటర్ల రహదారులు
రాష్ట్ర ప్రగతికి సంకేతంగా రహదారులు నిలుస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రోడ్లు గతుకులు పడి, కంకర తేలి ఉండటం వల్ల ప్రయాణం నరకప్రాయంగా ఉండేది. స్వరాష్ట్రంలో రోడ్లు అద్భుతంగా అభివృద్ధి చెందాయి. మండల, జిల్లా కేంద్రాలకు డబుల్ లేన్ రోడ్లు, రాష్ట్ర రాజధానికి ఫోర్ లేన్ రోడ్లు వేసుకున్నాం. జాతీయ రహదారుల నిడివి రెట్టింపైంది. మొత్తంగా రాష్ట్రంలోని రహదారుల నెట్ వర్క్ 1 లక్ష 9 వేల కి.మీ.లకు పెరిగింది.

నూతన సచివాలయం,125 అడుగుల అంబేద్కర్ విగ్రహం
తెలంగాణ స్వరాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్న తర్వాత దాదాపు అన్నిరంగాలనూ పునర్నిర్మించుకుంటున్నాం. హైదరాబాద్ నడిబొడ్డున నూతనంగా వెలసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయ సౌధం, తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠకు ఉజ్వల సంకేతంగా నిలిచింది. గతంలో సచివాలయ ప్రాంగణంలోని భవనాలు అక్కడొకటి, ఇక్కడొకటిగా, అవ్యవస్థితంగా, అసౌకర్యంగా ఉండేవి. ముఖ్యమంత్రి కూర్చునే ఛాంబర్ కు వెళ్లే దారి ఒక చీకటి గుహలోకి ప్రవేశించే దారిలా ఉండేది. అనుకోకుండా అగ్ని ప్రమాదం సంభవిస్తే తప్పించుకోవడానికి ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కూడా ఉండేవి కావు. ఫైరింజన్ తిరిగే స్థలం కూడా ఆయా బ్లాకుల చుట్టూ ఉండేది కాదు.

సచివాలయ ఉద్యోగులు వాళ్ల ఆఫీసు టేబుళ్ల మీదనే భోజనం చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పడా ఇక్కట్లేవీ లేకుండా అధునాతన హంగులతో అన్ని శాఖల కార్యాలయాలను అనుసంధానిస్తూ, వాస్తు నిర్మాణ కౌశలం ఉట్టిపడేలా సుందరంగా అలరారే నూతన సచివాలయ సౌధాన్ని నిర్మించుకున్నాం. మహనీయుడు, సమతామూర్తి, రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచిన ఆర్టికల్ మూడు ప్రకారమే మనం పోరాడి తెలంగాణ సాధించుకోగలిగాం. బాబాసాహెబ్ ఆశయాలు, ఆదర్శాలను ముందుకు తీసుకేళ్ళే క్రమంలోనే సచివాలయానికి కూడా ఆయన పేరు పెట్టడంతోపాటు, సచివాలయం సమీపంలోనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించుకున్నాం. సచివాలయానికి మరోవంక అమరవీరుల స్మారకం నిర్మించుకున్నాం. ఒక వంక 125 అడుగుల ఎత్తులో డాక్టర్ అంబేద్కర్ విగ్రహం, దానికి ఎదురుగా హుస్సేన్ సాగర్ లో బుద్ధుని విగ్రహం, నభూతో న భవిష్యతి అన్నరీతిన నిర్మించిన సచివాలయ సౌధం, మరోవంక అమరవీరులను ప్రతిరోజూ స్మరణకు తెచ్చే అమరజ్యోతి చూసేందుకు సుందరంగా ఉండటమే కాదు, ప్రతినిత్యం మనకు కర్తవ్యబోధ చేస్తుంటాయి.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం ఎదురుగా ఉన్న విశాల స్థలంలో తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీక అయిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సముజ్వలంగా ప్రతిష్టించుకోబోతున్నామని సగర్వంగా తెలియజేస్తున్నాను.

నిరంతర ప్రక్రియగా పేదలకు గృహ నిర్మాణం
నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడం కోసం డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణం చేపట్టాం. ఎంతో వ్యయంతో, అన్ని వసతులతో అందంగా నిర్మించిన ఈ ఇళ్ళను పేదలకు ఉచితంగా అందిస్తున్నాం.

పేదలకు ఉచితంగా రెండు పడకగదుల ఇళ్ళను నిర్మించి ఇచ్చే పథకం మరెక్కడా లేదు. దేశంలో ఎక్కడా పేదల కోసం ఇటువంటి ఇళ్ళ నిర్మాణం జరగ లేదు. కొల్లూరులో 124 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ళ సముదాయం ఓ టౌన్ షిప్ ను తలపించేదిగా ఉంది. ఇక్కడ 117 బ్లాకుల్లో 15,660 ప్లాట్లు నిర్మించాం. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. పేదలకు గృహ నిర్మాణం అనేది ఓ నిరంతర ప్రక్రియ. దీనిని కొనసాగిస్తునే ఉంటాం.

పేదలెవరైనా తమ స్వంత జాగాలో ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం గృహలక్ష్మి పథకం క్రింద 3 లక్షల రూపాయలను మూడు దశల్లో అందిస్తుందని ఇదివరకే తెలియజేశాను. ప్రతీ నియోజకవర్గంలోనూ మూడు వేల మందికి గృహలక్ష్మి పథకం ప్రయోజనం అందించుకుంటున్నాం.

తెలంగాణ ఆధ్యాత్మిక వైభవం
తెలంగాణ చారిత్రక ప్రతిపత్తికి, ఆధ్యాత్మిక ఔన్నత్యానికీ పూర్వ వైభవం తేవడం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. తెలంగాణ ఆధ్యాత్మిక వైభవ ప్రతీకైన యాదగిరి దేవాలయ పునర్నిర్మాణం ఒక అద్భుతమని యావన్మందీ జనం కొనియాడుతున్నారు. సప్తతల గోపురాలతో, కృష్ణశిల శిల్పాలతో భూలోక వైకుంఠంగా, అడుగడుగునా ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేలా ప్రభుత్వం ఈ ఆలయాన్ని తీర్చిదిద్దింది. నేడు ప్రజలు పెద్దఎత్తున ఆ ఆలయాన్ని దర్శించుకొని అక్కడి నిర్మాణాలను తిలకించి అబ్బుర పడుతున్నారు. యాదగిరికి వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.

అలాగే, కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి 500 కోట్ల రూపాయలు మంజూరు చేసుకున్నాం. ఇటీవల నేను స్వయంగా ఆ ఆలయానికి వెళ్ళి పరిశీలించి, దేశంలో కెల్లా ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయంగా దీన్ని తీర్చిదిద్దాలని సంకల్పించాను. ఇదే తరహాలో వేములవాడ, ధర్మపురి దేవాలయాల అభివద్ధి కోసం వందకోట్ల చొప్పున కేటాయించుకున్నాం. పనులు పురోగతిలో ఉన్నాయి. భద్రాద్రి రామచంద్రస్వామి దేవాలయం సైతం ఇదేవిధంగా వైభవంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.

మన రాష్ట్రంలో కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా నిలచిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు వెనుక ప్రభుత్వం చేసిన కృషి ఎంతో ఉంది. నేడు ప్రపంచ వ్యాప్తంగా మన రామప్ప పేరు ఖ్యాతి గడించింది.

సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా కాశీ క్షేత్రాన్ని సందర్శించాలని కోరుకుంటారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కాశీకి వెళ్ళే భక్తుల సౌకర్యార్థం 60 వేల చదరపు అడుగుల్లో అక్కడ ఓ వసతి గృహం నిర్మించబోతున్నది. అదే విధంగా శబరిమల దర్శనం కోసం వెళ్ళే తెలంగాణ భక్తుల కోసం అక్కడ కూడా మరో వసతి గృహం నిర్మిస్తున్నాం. ఈ విషయంలో కేరళ ముఖ్యమంత్రితో కూడా నేను స్వయంగా మాట్లాడాను.

ప్రాచీనకాలం నుంచీ తెలంగాణ ప్రాంతం బౌద్ధ, జైన మతాలకు కేంద్రంగా విలసిల్లింది. ఆచార్య నాగార్జునుడు నడయాడిన నాగార్జున సాగర్ లో తెలంగాణ ప్రభుత్వం బుద్ధ వనాన్ని అద్భుతంగా నిర్మించింది. ఇది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బౌద్ధులను, ఇతర పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.

ముగింపు
ఇది దశాబ్ది ముంగిట నిలిచిన తెలంగాణ విప్లవాత్మక విజయ యాత్ర. ఉద్యమం నుంచీ ఉజ్వల ప్రగతి దాకా సాగిన జయ పరంపరల జన గాథ. నేడు నా రాష్ట్రం భారత వినీలాకాశంలో వెలుగులు విరజిమ్ముతున్న ధృవతార అని ప్రతి తెలంగాణ పౌరుని ఛాతీ ఉప్పొంగేలా ఖ్యాతి పొందే స్థాయికి తెలంగాణను తీసుకురాగలిగినందుకు నా జీవితం ధన్యమైందని భావిస్తున్నాను.

స్వరాష్ట్ర సాధన ఉద్యమానికి, తెలంగాణ పునర్నిర్మాణానికి రెండింటికీ సారథ్యం వహించే సువర్ణావకాశాన్ని, అదృష్టాన్ని, పాత్రతను నాకు ప్రసాదించిన తెలంగాణ ప్రజానీకానికి నేను సర్వదా, శతధా, సహస్రధా కృతజ్ఞుడను.

నాకు ప్రాణ సమానమైన తెలంగాణ రాష్ట్రం చేరాల్సిన గమ్యాలు, అందుకోవాల్సిన అత్యున్నత శిఖరాలు మరెన్నో ఉన్నాయి. మీ అందరి దీవెనలతో నా శరీరంలో సత్తువ ఉన్నంత వరకూ నేను తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసం పరిశ్రమిస్తూనే ఉంటానని మాట ఇస్తున్నాను.

తెలంగాణ స్ఫూర్తిని దేశవ్యాప్తం చేసేందుకు అనవరతం తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తుంది. సర్వ జనులు సంక్షేమంతో, సంతోషంతో, సమతా మమతలతో సమాన అవకాశాలతో వర్ధిల్లే శ్రేయోరాజ్యంగా భారతీయ సమాజాన్ని రూపుదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం త్రికరణశుద్ధితో పురోగమిస్తుంది. యావత్ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలను మరోమారు తెలియజేస్తూ ముగిస్తున్నాను.

“ధర్మస్య విజయోస్తు.. అధర్మస్య నాశోస్తు..
ప్రాణిషు సద్భావనాస్తు.. విశ్వస్య కల్యాణమస్తు..”

జై తెలంగాణ..
జై భారత్..