ఆగస్టు 15లోగా వేతన సవరణ సంఘ నివేదిక: సీఎం

​ఉద్యోగ సంఘాల జేఏసీ ఇచ్చిన పద్దెనిమిది డిమాండ్లపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సానుకూలంగా స్పందించారు. అన్నింటిపైనా నిర్దిష్ట విధానాలను ప్రకటించారు. ఉద్యోగులు కోరిన పలు డిమాండ్లపై అక్కడికక్కడే నిర్ణయాలు ప్రకటించారు. మరికొన్నింటిపై నిర్దిష్ట విధానాలు రూపొందిస్తామని హామీ ఇచ్చారు. జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంనాడు మధ్యంతర భృతిని ప్రకటిస్తామని చెప్పారు. ఆగస్టు 15లోగా నివేదిక ఇచ్చేలా రెండురోజులలో త్రిసభ్య వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తెలంగాణ సాధన ఉద్యమంలో మహోన్నతంగా ఉద్యమించిన ఉద్యోగులు, రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా ఉజ్వలపాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. క్రమశిక్షణ, నిబద్ధత తెలంగాణ ఉద్యోగులు ప్రత్యేకతలని చాటిచెప్పారు. రాష్ట్రం ఇంత మంచిగా వెళ్తున్న తరుణంలో ఉద్యోగులు మరింత ఉత్సాహంతో పనిచేయాలని కోరారు. బుధవారం ప్రగతి భవన్‌లో ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి చర్చించారు.