ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి
Telangana Logo

చరిత్ర

History

తెలంగాణ, భౌగోళిక మరియు రాజకీయ అస్తిత్వంగా జూన్ 2, 2014న యూనియన్ ఆఫ్ ఇండియాలో 29వ మరియు అతి పిన్న వయస్కుడైన రాష్ట్రంగా జన్మించింది. అయితే, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక మరియు చారిత్రక సంస్థగా దీనికి కనీసం రెండు వేల ఐదు వందల సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ అద్భుతమైన చరిత్ర ఉంది. తెలంగాణలోని అనేక జిల్లాల్లో లభించిన కైర్న్‌లు, సిస్ట్‌లు, డాల్మెన్‌లు మరియు మెన్‌హిర్‌లు వంటి మెగాలిథిక్ రాతి నిర్మాణాలు వేల సంవత్సరాల క్రితం దేశంలోని ఈ ప్రాంతంలో మానవ ఆవాసాలు ఉన్నాయని చూపుతున్నాయి. చాలా చోట్ల దొరికిన ఇనుప ఖనిజం కరిగించే అవశేషాలు కనీసం రెండు వేల సంవత్సరాలుగా తెలంగాణలో చేతివృత్తి మరియు పనిముట్ల తయారీకి గల మూలాధారాలను ప్రదర్శిస్తాయి. ప్రాచీన భారతదేశంలోని 16 జానపదాలలో ఒకటిగా ప్రస్తుత తెలంగాణలో భాగమైన అస్మాక జనపద సూచన సమాజంలో ఒక అధునాతన దశ ఉందని రుజువు చేస్తుంది.

బుద్ధుని యొక్క మొదటి ఐదుగురు శిష్యులలో ఒకరైన కొండన్న తెలంగాణకు చెందిన ఒక సాధారణ పేరు మరియు అతని స్వస్థలం గురించి ఖచ్చితమైన సమాచారం లేనప్పటికీ, మెదక్ జిల్లాలోని కొండాపూర్‌లోని మొట్టమొదటి బౌద్ధ పట్టణం అతని తర్వాత ఉందని నమ్ముతారు. తనను సరిగ్గా అర్థం చేసుకున్నది కొండన్న అని బుద్ధుడే ప్రముఖంగా అంగీకరించాడు. కరీంనగర్‌లోని బాదనకుర్తికి చెందిన బవరి అనే బ్రాహ్మణుడు తన శిష్యులను ఉత్తర భారతదేశానికి బౌద్ధమతం నేర్చుకోవడానికి మరియు ఈ ప్రాంతంలో ప్రచారం చేయడానికి పంపినట్లు బౌద్ధ ఆధారాలు చెబుతున్నాయి. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించిన మెగస్తనీస్, ఆంధ్రుల కోటలతో కూడిన 30 పట్టణాలు ఉన్నాయని, వాటిలో ఎక్కువ భాగం తెలంగాణలో ఉన్నాయని రాశారు. చారిత్రక యుగంలో, తెలంగాణ శాతవాహనులు, వాకటకులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు మరియు ఆసిఫ్ జాహీలు వంటి శక్తివంతమైన సామ్రాజ్యాలు మరియు రాజ్యాలకు ఆవిర్భవించింది.

ఈ శక్తివంతమైన రాజకీయ నిర్మాణాల ఆవిర్భావం మరియు విరాజిల్లడం అనేది దృఢమైన ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక నిర్మాణం యొక్క ఉనికికి నిదర్శనం. ఆ విధంగా బుద్ధుని కాలం నాటికి తెలంగాణ ఒక చైతన్యవంతమైన సామాజిక అస్తిత్వం మరియు తరువాతి రెండున్నర సహస్రాబ్దాల పాటు కొనసాగింది. ఇంత గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉన్న, ఆంధ్ర ప్రాంతానికి చెందిన చరిత్రకారులు మరియు పండితులు తన చరిత్రను మరుగుపరచడానికి మరియు తుడిచివేయడానికి ప్రయత్నించినప్పటికీ, తెలంగాణ ఎల్లప్పుడూ తన ఆత్మగౌరవం మరియు స్వయం పాలన కోసం పోరాడింది. ముఖ్యంగా 1956-2014 మధ్య కాలంలో తెలంగాణ చరిత్రను విస్మరించి, తుడిచిపెట్టి, చిన్నచూపు చూసి, అనుబంధంగా లేదా ఫుట్‌నోట్‌గా మార్చడానికి అధికారికంగా చేసిన ప్రయత్నాల కారణంగా, తెలంగాణ చరిత్రలో చాలా వరకు సరైన పరిశోధన జరగలేదు లేదా అధ్యయనం చేసినా నమోదు కాలేదు. తెలంగాణ మళ్లీ పుంజుకుంది మరియు ఇప్పుడు తన రాజకీయ గుర్తింపును పొందింది మరియు దాని స్వంత అద్భుతమైన గతాన్ని పునరుద్ధరించే ప్రక్రియలో ఉంది. వేయి తీగలతో అద్భుతమైన సంగీత వాయిద్యం తెలంగాణ చరిత్రను పునర్నిర్మించే ప్రయత్నం ఇది.

చరిత్రకు పూర్వం (1000 బిసిఇ వరకు)

విస్తృతమైన పరిశోధన, ప్రత్యేకించి 1956 తరువాత నిర్లక్ష్యానికి గురికావడం వల్ల జరగకపోయినా, నిజాం ప్రభుత్వం ఆధ్వర్యంలోని పురావస్తు శాఖ తెలంగాణలోని చరిత్ర పూర్వ మానవ జనావాసాల ఆనవాళ్ళను కనుగొనడానికి బ్రహ్మాండమైన ప్రయత్నం జరిగింది. పాత రాతి యుగం నుంచి తెలంగాణలోని వివిధ భాగాల్లో మానవ జనావాసాలు స్థిరంగా కొనసాగినట్టు ఈ అధ్యయనాలు కనుగొన్నాయి. ఒకే ప్రదేశంలో లేదా విస్తరించిన ప్రదేశాల్లో ప్రజలు జీవనాన్ని కొనసాగించారనీ, తరువాతి దశలైన మధ్య రాతి యుగం, కొత్త రాతి యుగం, లోహ యుగాల్లో అభివృద్ధి చెందారని దీనివల్ల స్పష్టమవుతోంది. తవ్వకాల్లో రాతి పనిముట్లు, మైక్రోలిత్స్, సిస్ట్స్, డోల్మెన్స్, కైర్న్స్, మెన్సిర్స్ బయటపడ్డాయి. సరైన, శాస్త్రీయమైన, అధికారికమైన పరిశోధన, తవ్వకాలూ జరగనప్పటికీ, తెలంగాణలోని మొత్తం పది జిల్లాల్లో ఈ అనవాళ్ళు కనిపించాయి. 1950కి ముందునాటి మొదటి తరం పరిశోధకులకు లేదా వ్యక్తిగత ఔత్సాహిక అన్వేషకులు చేసిన ప్రయత్నాలకు ధన్యవాదాలు చెప్పుకోవాలి.  

శాతవాహనులకు ముందు (1000 బిసిఇ- 300 బిసిఇ)

1000 బిసిఇ నుంచి ప్రారంభమైన చారిత్రక యుగంలో తెలంగాణ ఒక భౌగోళికమైన అస్తిత్వంగా, అలాగే తెలుగు ఒక భాషాపరమైన అస్తిత్వంగా సమకాలీన బౌద్ధ, పౌరాణిక గ్రంథాల్లో కొన్ని ప్రస్తావనలు కనిపిస్తాయి. అయితే, శాతవాహనులకు పూర్వ సమాజానికి సంబంధించిన అత్యున్నతమైన అంశాలను కనుగొనడానికి, అభివృద్ధి దశలోను తెలుసుకోవడానికి క్షుణ్ణమైన ఒక పరిశోధన అవసరం. ఈ అంశంలో అధికారికమైన పరిశోధన ఆరు దశాబ్దాలపాటు నిలిచిపోయినప్పటికీ, ఠాకూర్ రాజారామ్ సింగ్, బి.ఎన్. శాస్త్రి, డాక్టర్ డి. రాజా రెడ్డి లాంటి ఔత్సాహికులు కష్టతరమైన అన్వేషణలను సొంతంగా సాగించారు, శాతవాహనులు ఆవిర్భవించడానికి ముందు ఒక వికాసవంతమైన సమాజం ఇక్కడ ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా కోటిలింగాల రాజధానిగా శాతవాహనులకు ముందు ఇక్కడ పాలకులు ఉన్నారని, వారు సొంత నాణేలను ప్రవేశపెట్టారని డాక్టర్ రాజారెడ్డి నాణేల ముద్రణకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలతో నిరూపించారు. ఈ తవ్వకాల్లో గొబడ, నారన, కామ్వాయ, సంగోపల నాణేలను కనుగొన్నారు, కనీసం ఇతర పాలకుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. అధికారిక చిహ్నాలతో సహా పంచ్-మార్క్ కలిగిన నాణేలను ఉపఖండంలో జారీ చేసిన మొదటి ప్రాంతం తెలంగాణే కావచ్చు. బౌద్ధ గ్రంథాలు, అలాగే మెగస్తనీస్, అర్రియన్ లాంటి విదేశీయులు వెల్లడించిన విషయాలు ఈ ప్రాంతంలో ముప్పై కోటలు ఉండేవని పేర్కొన్నాయి, వీటిలో చాలా కోటలను వెలికి తీయాల్సి ఉంది.

శాతవాహనులు (250 బిసిఇ- 200 సిఇ)

మౌర్య సామ్రాజ్యం పతనమైన తరువాత, క్రీస్తుపూర్వం సుమారు మూడవ శతాబ్దంలో శాతవాహనుల ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో మొదటి ప్రముఖమైన సామ్రాజ్యం ఆవిర్భవించింది. శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల. తరువాత ఇతర ప్రసిద్ధ రాజధానులైన పైథాన్, అమరావతి (ధరణికొండ / ధ‌ర‌ణికోట‌)లకు వారు రెండు శతాబ్దాల తమ పాలన తురావత మాత్రమే తరలివెళ్ళారు. అయితే, కోస్తా ఆంధ్రలో ఉన్న తరువాతి ప్రదేశానికి ప్రాధాన్యం ఇవ్వడం కోసం మొదటి రాజధానిని నిర్లక్ష్యం చేయడమో లేదా పక్కన పెట్టడమో జరిగింది. శాతవాహన రాజులు శ్రీముఖ (క్రీస్తుపూర్వం 231-208), శ్రీ శాతవాహన, శాతకర్ణి I, శతశ్రీ, శాతకర్ణి II, వాశిష్టీపుత్ర పులోమావి, వాశిష్టీపుత్ర శాతకర్ణి, వారి గవర్నర్లు జారీ చేసిన నాణేలు కోటిలింగాలలో లభ్యమయ్యాయి. శాతవాహనులు మూడు వైపులా సముద్రాలు సరిహద్దులుగా ఉన్న ద్వీపకల్పంలోని ఒక విస్తారమైన ప్రాంతాన్ని పాలించినట్టు నాణేలు, శిలా శాసనాల ఆధారాలు చెబుతున్నాయి. గాథా సప్తశతి లాంటి సాహిత్యం, అజంతా లాంటి చిత్ర కళ శాతవాహనుల పాలనలో వర్థిల్లాయి.

శాతవాహనుల అనంతరం ( 200 సిఇ- 950 సిఇ)

క్రీస్తుశకం మూడవ శతాబ్దంలో శాతవాహనుల పాలన అంతరించిన తరువాత, కాకతీయులు ఆవిర్భవించేవరకూ, తెలుగు మాట్లాడే ప్రాంతాలు వేర్వేరు పాలకుల కింద చిన్న రాజ్యాలుగా విడిపోయాయి, సుమారు ఆరు నుంచి ఏడు శతాబ్దాలు ఈ ఛిన్నాభిన్నమైన పరిస్థితి కొనసాగింది. ఇది తెలంగాణ చరిత్రలో ఎలాంటి రాజకీయ వ్యవస్థా లేని చీకటి కాలంగా ప్రధాన స్రవంతి ఆంధ్ర చరిత్రకారులు అభివర్ణించినప్పటికీ, ఇక్ష్వాకులు, వాకాటకులు, విష్ణుకుండినులు, బాదామీ చాళుక్యులు, రాష్ట్రకూటులు, వేములవాడ చాళుక్యులు, కల్యాణీ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, కందూరి చోడులు, పోల్వాస వంశాల్లాంటి వివిధ రాజ్యాలు తెలంగాణను పాలించాయని తాజా పరిశోధనలు కనుగొన్నాయి. ఈ కాలానికి సంబంధించిన క్షుణ్ణమైన పరిశోధన ఇంకా జరగవలసి ఉంది.

కాకతీయులు (950 సిఇ- 1323 సిఇ)

రాష్ట్రకూటుల ఉప-సామంతులు తమనుతాము స్వతంత్ర ప్రభువులుగా ప్రకటించుకున్నారు, సుమారు క్రీస్తుశకం 950 ప్రాంతంలో కాకతీయ రాజవంశానికి పునాదులు వేశారు, ఈ సామ్రాజ్యం పటిష్ఠంగా మారింది, తెలుగు మాట్లాడే మొత్తం ప్రాంతాన్ని సమైక్యం చేసింది, సుమారు మూడున్నర శతాబ్దాలకు పైగా కొనసాగింది. గణపతి దేవుడు, రుద్రదేవుడు, ప్రతాపరుద్రుడు లాంటి శక్తిమంతమైన రాజులను, అలాగే ఉపఖండంలో మొట్టమొదటి మహిళా పాలకురాలైన రుద్రమదేవిని ఈ సామ్రాజ్యం చూసింది. కాకతీయులు మొదట్లో హనుమకొండ నుంచి పరిపాలించారు, తరువాత వారి రాజధానిని వరంగల్‌కు మార్చారు.

సాగునీటి ప్రజాపనులు, శిల్పకళ, లలిత కళలకు కాకతీయులు ప్రసిద్ధి చెందారు. అత్యుత్తమ ప్రణాళిక కలిగిన వారి సాగునీటి సౌకర్యాలకు, ఎత్తుపల్లాలతో కూడిన ఈ ప్రాంత స్వభావానికి సరిపడేలా గొలుసుకట్టు చెరువులు ఒక పరిపూర్ణమైన వ్యవస్థ ఏర్పాటుకు ధన్యవాదాలు చెప్పుకోవాలి, కాకతీయ సామ్రాజ్యం ఆర్థికంగా వర్ధిల్లడంతో అది సాంస్కృతిక పురోగతికి కూడా దారి తీసింది. ఈ ప్రభావాన్ని చూసి అసూయపడిన అనేక పొరుగు రాజ్యాలు, ఢిల్లీ సుల్తానులు వరంగల్ మీద అనేకసార్లు యుద్ధానికి ప్రయత్నించి, విఫలమయ్యారు. చివరిగా 1323లో, ఢిల్లీ సైన్యం వరంగల్ కోటను ముట్టడించింది, ప్రతాపరుద్రుడిని బంధించింది, కథనాల ప్రకారం ఆయనను ఢిల్లీకి యుద్ధ సైనికుడిగా తీసుకుపోతూండగా, లొంగిపోవడానికి ఇష్టపడక నర్మదా నదీ తీరంలో ఆయన ఆత్మత్యాగం చేశాడు.

కాకతీయుల అనంతరం విరామకాలం (1323- 1496)

1323లో మాలిక్ కాఫర్ చేతిలో ప్రతాపరుద్రుడు ఓడిపోయిన తరువాత, కాకతీయ సామ్రాజ్యం మరోసారి ముక్కలు చెక్కలయింది, స్థానిక పాలకులు స్వతంత్రులుగా ప్రకటించుకున్నారు, సుమారు 150 సంవత్సరాల పాటు ముసునూరి నాయకులు, పద్మనాయకులు, కళింగ గంగులు, గజపతులు, బహుమనీలు లాంటి వేర్వేరు పాలకులు తెలంగాణను పాలించారు.

కుతుబ్‌షాహీలు (1496-1687)

గోల్కొండ కోట తన రాజధానిగా, బహుమనీల కింద ఉన్న తెలంగాణ సుబేదార్ సుల్తాన్ కులీ కుతుబ్ షా 1496లో తనను స్వతంత్రుడిగా ప్రకటించుకున్నాడు. ఈ వంశానికి చెందిన ఏడుగురు సుల్తానులు తెలంగాణను మాత్రమే కాదు, ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఉన్న భాగాలతో సహా మొత్తం తెలుగు మాట్లాడే నేల అంతటినీ పాలించారు. మొఘల్ సామ్రాజ్యం యుద్ధానికి వచ్చి, గోల్కొండను 1687లో ఓడించింది. తరువాత మూడు శతాబ్దాలు తెలంగాణ మళ్ళీ అనిశ్చితమైన, విచ్ఛిన్నమైన పాలనను చవిచూసింది. 

అసఫ్ జాహీలు (1724- 1948)

1712లో, కమర్- ఉద్-దిన్ ఖాన్‌ను దక్కన్ వైస్రాయిగా ఫర్రుక్‌సియార్ చక్రవర్తి నియమించాడు, అతనికి నిజామ్-ఉల్-ముల్క్ అనే బిరుదును ఇచ్చాడు. తరువాత అతన్ని ఢిల్లీ పిలిపించి, వైస్రాయిగా ముబారిజ్ ఖాన్‌ను నియమించాడు. 1724లో, ముబారిజ్ ఖాన్‌ను కమర్- ఉద్- దిన్ ఖాన్ ఓడించి, దక్కన్ సుబాను తిరిగి హస్తగతం చేసుకున్నాడు. అది మొగల్ సామ్రాజ్యంలో ఒక సర్వస్వతంత్రమైన రాజ్యంగా ఏర్పడింది. ఆయన ఆసిఫ్ ఝా అనే పేరు పెట్టుకున్నాడు, అతని వంశం అసిఫ్ జాహీ వంశంగా ప్రసిద్ధమయింది. ఈ ప్రాంతానికి హైదరాబాద్ దక్కన్ అని అతను పేరు పెట్టాడు. ఆ తరువాత వచ్చిన పాలకులు నిజామ్ ఉల్-ముల్క్ అనే బిరుదాన్ని కొనసాగించారు, వారిని అసిఫ్ జాహి నిజామ్‌లు లేదా హైదరాబాద్ నిజాములు అని పిలిచేవారు. తెలంగాణలోని మెదక్, వరంగల్ డివిజన్లు వారి పాలనలో ఉండేవి.

1748లో అసఫ్ ఝా I మరణించిన తరువాత, ఆయన కుమారుల మధ్య సింహాసనం కోసం ఘర్షణ తలెత్తడంతో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది, వాళ్ళకు అవకాశవాద పొరుగు రాష్ట్రాలు, వలసపాలనలోని విదేశీ శక్తులు సహాయం చేశాయి. 1769లో హైదరాబాద్ నగరం నిజామ్‌లకు అధికారిక రాజధాని అయింది.

అసఫ్ ఝా IV నసీర్- ఉద్- దౌలా బ్రిటిష్ వారితో 1799లో అనుబంధ పొత్తు ఒప్పందంపై సంతకం చేశాడు. దీంతో రాష్ట్ర రక్షణ, విదేశీ వ్యవహారాల మీద నియంత్రణను ఆ రాజ్యం కోల్పోయింది. హైదరాబాద్ రాష్ట్రం బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశంలోని ప్రెసిడెన్సీలు, ప్రావిన్స్ ల మధ్య ఒక రాచరిక రాష్ట్రంగా మారింది.

మొత్తం ఏడుగురు నిజామ్‌లు హైదరాబాద్‌ను పరిపాలించారు. (అసఫ్ ఝా I 13 సంవత్సరాలు పరిపాలించిన తరువాత ఆయన కుమారులు ముగ్గురు (నసీర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్ జంగ్) పాలించారు. అయితే వారిని పాలకులుగా అధికారికంగా గుర్తించ లేదు:

  • నిజామ్- ఉల్- ముల్క్, అసఫ్ ఝా I (మీర్ కమర్- ఉద్- దిన్ ఖాన్)
  • నసీర్ జంగ్ (మీర్ అహ్మద్ అలీ ఖాన్)
  • ముజఫర్ జంగ్ (మీర్ హిదాయత్ ముహి- ఉద్- దిన్ స’అదుల్లా ఖాన్)
  • సలాబద్ జంగ్ (మీర్ సయిద్ మహమ్మద్ ఖాన్)
  • నిజామ్ ఉల్- ముల్క్, అసఫ్ ఝా II (మీర్ నిజామ్ అలీ ఖాన్)
  • సికిందర్ ఝా, అసఫ్ ఝా III (మీర్ అక్బర్ అలీ ఖాన్)
  • నసీర్- ఉద్- దౌలా, అసఫ్ ఝా IV (ఫర్కందా అలీ ఖాన్)
  • అఫ్జల్- ఉద్- దౌలా, అసఫ్ ఝా V (మీర్ తహ్నియత్ అలీ ఖాన్)
  • అసఫ్ ఝా VI (మీర్ మహబూబ్ అలీ ఖాన్)
  • అసఫ్ ఝా VII (మీర్ ఉస్మాన్ అలీ ఖాన్) 

స్వాతంత్ర్యం తరువాత

బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి 1947లో భారతదేశం స్వతంత్రమైనప్పుడు, హైదరాబాద్ సుమారు 13 నెలల పాటు స్వతంత్రమైన రాచరిక రాష్ట్రంగానే ఉంది.

ఈ ప్రాంతాన్ని విముక్తం చేయడం కోసం తెలంగాణలోని రైతులు సాయుధ పోరాటం చేపట్టారు. ఈ సాయుధ పోరాటంలో అసంఖ్యాకమైన ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు. ఖాసీం రజ్వీ నాయకత్వంలో, రజాకర్లు పేరిట ప్రైవేటు సాయుధ దళం దోపిడీలు, హత్యలకు పాల్పడి రాష్ట్రంలో భయానక పరిస్థితులను సృష్టించింది.

1948 సెప్టెంబర్ 17న, ఐక్య భారతదేశంలోకి హైదరాబాద్ రాష్ట్రాన్ని తేవడం కోసం ఆపరేషన్ పోలో పేరిట ఒక సైనిక చర్యను భారత ప్రభుత్వం నిర్వహించింది. 1950 జనవరి 26న హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా సివిల్ సర్వెంట్ ఎం.కె. వెల్లోడిని కేంద్రం నియమించింది.

1952లో, హైదరాబాద్ రాష్ట్రానికి ప్రజాస్వామ్యయుతంగా జరిగిన మొదటి ఎన్నికలో, ముఖ్యమంత్రిగా డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ఎన్నికయ్యారు. ఆ సమయంలో, హైదరాబాద్‌కు చెందిన స్థానికులకు (ముల్కీలకు) తగిన ప్రాధాన్యాన్ని రాష్ట్రంలో ఇవ్వాలన్న డిమాండ్‌తో స్థానికులు ఒక ఆందోళన చేపట్టారు.

మొదటి తెలంగాణ ఉద్యమం

1950ల తొలినాళ్ళలో, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంత ప్రజలు, ప్రత్యేక రాష్ట్రం అనే డిమాండ్‌తో తమను తాము సంఘటితం చేసుకోవడం ప్రారంభించారు. దేశంలో వివిధ రాష్ట్రాల కోసం వస్తున్న డిమాండ్లను పరిశీలించడం కోసం, 1953లో, భారత ప్రభుత్వం రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌ (ఎస్‌ఆర్‌సి)ని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌కు ఫజల్ అలీ, కవలమ్ మాధవ ఫణిక్కర్, హెచ్.ఎన్. కుంజ్రూ నాయకత్వం వహించారు.

సమాజంలోని వివిధ వర్గాల నుంచి విజ్ఞాపనలను స్వీకరించడం కోసం దేశం మొత్తాన్ని ఎస్‌ఆర్‌సి పర్యటించింది. ఎస్‌ఆర్‌సికి తెలంగాణ ప్రాంత ప్రజలు అనేక వినతులు అందజేశారు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలన్న తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. దివంగత ప్రొఫెసర్ జయశంకర్ లాంటి తెలంగాణ మేధావులు, శ్రీ హెచ్.సి. హెడ, శ్రీ కొండా వెంకట రంగారెడ్డి లాంటి రాజకీయ నేతలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి చారిత్రక, రాజకీయ, ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక సమర్థనలతో కూడిన వినతి పత్రాలను అందజేశారు. కమిషన్ తన నివేదికలను 1955 సెప్టెంబర్ 30న సమర్పించింది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిఫార్సు చేసింది.

ఎస్‌ఆర్‌సి సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 1955 సెప్టెంబరు – 1956 నవంబరు మధ్య కాలంలో, తెలంగాణ ప్రజలు వరుస ఆందోళనలను చేపట్టారు. కానీ న్యూఢిల్లీలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన నాయకులు తీవ్రస్థాయిలో చేసిన లాబీయింగ్ ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కోసం ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని విలీనం చేశారు.

విలీనం చోటుచేసుకోవడానికి ముందు ఒక పెద్ద మనుషుల ఒప్పందం కోసం తెలంగాణ నాయకులు పట్టుపట్టారు. ఒప్పందం మీద ఆంధ్ర మరియు తెలంగాణ నాయకులు సంతకాలు చేశారు, ఆంధ్ర నాయకులు తెలంగాణపై వివక్ష చూపకుండా నివారించడం లక్ష్యంగా రక్షణలను అందులో పొందుపరిచారు. అయితే, ఒప్పందాన్ని మొదటి రోజు నుంచీ ఆంధ్ర నాయకులు ఉల్లంఘించారు.

1969 తెలంగాణ ఉద్యమం

పెద్దమనుషుల ఒప్పందాన్ని అమలు చేయకపోవడం, ప్రభుత్వ ఉద్యోగాలు, విద్య, ప్రజా నిధుల వినియోగంలో వివక్ష కొనసాగడం ఫళితంగా 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం మొదలయింది.

1969 జనవరిలో ప్రత్యేక రాష్ట్రం కోసం విద్యార్థులు ఆందోళనలను ఉధృతం చేశారు. జనవరి 19న, తెలంగాణ రక్షణ చర్యలను సక్రమంగా అమలు చేస్తామని హామీ ఇస్తూ అన్ని పార్టీలూ ఒప్పందానికి వచ్చాయి. ఒప్పందంలో ప్రధాన అంశాలు 1) తెలంగాణ స్థానికుల కోసం రిజర్వ్ చేసిన ఉద్యోగాల్లో ఉన్న అందరు తెలంగాణేతర ఉద్యోగులను తక్షణమే బదిలీ చేయాలి. 2) తెలంగాణ మిగులు నిధులను తెలంగాణ అభివృద్ధి కోసం వినియోగించాలి. 3) ఉద్యమాన్ని విరమించాల్సిందిగా తెలంగాణ విద్యార్థులకు విజ్ఞప్తి.

కానీ ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి, మరింత మంది విద్యార్థులు, ఉద్యోగులు రాష్ట్రం ఏర్పాటు ఉద్యమంలో చేరారు. ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో ఈ దశ ఆందోళనలో 369 మంది యువకులు మరణించారు. రాష్ట్రం ఏర్పాటు అంశంపై చర్చించడం కోసం అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇరు ప్రాంతాలకు చెందిన నాయకులతో అనేక రోజులు చర్చించిన తరువాత, 1969 ఏప్రిల్ 12న, ప్రధానమంత్రి ఒక ఎనిమిది సూత్రాల ప్రణాళికను రూపొందించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని విస్తరించడం కోసం తెలంగాణ ప్రజా సమితి (టిపిఎస్) రాజకీయ పార్టీని శ్రీ ఎం. చెన్నారెడ్డి స్థాపించారు.

1971 మార్చిలో పార్లమెంట్ ఎన్నికలను శ్రీమతి ఇందిరాగాంధీ ప్రకటించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో, తెలంగాణలోని మొత్తం 14 స్థానాలకు గాను 10 స్థానాలను తెలంగాణ ప్రజా సమితి గెలుచుకుంది. అయితే, ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ (ఆర్) పార్టీ దారిద్ర్య నిర్మూలన (గరీబీ హటావో) లాంటి అభ్యుదయ విధానాల వేదికపై ఘన విజయాన్ని సాధించారు. ఆ దశలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌ను ఆమోదించడానికి ఆమె అంగీకరించలేదు. ఆ తరువాత, తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం ఆరుసూత్రాల ఫార్ములాను రూపొందించిన అనంతరం, టిపిఎస్ పార్టీని శ్రీ ఎం. చెన్నా రెడ్డి కాంగ్రెస్ (ఆర్) పార్టీలో విలీనం చేశారు. 1973 వరకూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కొనసాగింది, ఆ తరువాత చల్లబడింది.

తెలంగాణ కోసం అంతిమ ఉధ్యమం

1990ల మధ్యలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ వివిధ సంస్థల కింద తెలంగాణ ప్రజలు తమనుతాము సంఘటితం చేసుకోవడం ప్రారంభించారు.

1977లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర శాఖ ప్రత్యేక తెలంగాణను కోరుతూ ఒక తీర్మానం ఆమోదించింది. ఆ పార్టీ జార్ఖండ్, చత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను 2000 సంవత్సరంలో ఏర్పాటు చేసినప్పటికీ, తన కూటమిలోని భాగస్వామి తెలుగుదేశం పార్టీ ప్రతిఘటించడంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదు.

అప్పుడు ఎపి రాష్ట్ర శాసనసభలో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కెసిఆర్) 2000 ఆరంభంలో తెలంగాణ అంశంపై నేపథ్య కార్యాచరణ ప్రారంభించారు. తెలంగాణ మేథావుల బృందాలతో విస్తృత స్థాయిలో చర్చలూ, సంప్రదింపులూ జరిపిన తరువాత 2010 మే 17న ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించడానికి ముందు డిప్యూటీ స్పీకర్ పదవికీ, ఎమ్మెల్యే పదవికీ కెసిఆర్ రాజీనామా చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ కెసిఆర్‌కు తన మద్దతును ప్రకటించారు.

2004లో కాంగ్రెస్ పార్టీతో టిఆర్‌ఎస్ ఎన్నికల పొత్తు పెట్టుకుంది. పార్టీ 26 ఎమ్మెల్యే స్థానాలనూ, 5 ఎంపి స్థానాలను గెలిచింది, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర, భారత ప్రభుత్వాల్లో ప్రవేశించింది. తెలంగాణ అంశం యుపిఎ-1 కనీస ఉమ్మడి ప్రణాళికలో చోటు చేసుకుంది. ప్రత్యేక రాష్ట్రం అంశాన్ని రాష్ట్రపతి అబ్దుల్ కలామ్, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తమ ప్రసంగాల్లో కూడా ప్రస్తావించారు.

టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్‌కు ప్రాథమికంగా షిప్పింగ్ శాఖ మంత్రి పదవి కేటాయించారు. కానీ యుపిఎలో మరో భాగస్వామి అయిన డిఎంకె షిప్పింగ్ శాఖ కావాలని డిమాండ్ చేసింది, ఆ డిమాండ్‌ను నెరవేర్చకపోతే కూటమి నుంచి బయటికి వెళ్తామని బెదిరించింది. దీంతో అప్పుడే రెక్కలు విప్పుకుంటున్న యుపిఎ-1 ప్రభుత్వాన్ని కాపాడడం కోసం కెసిఆర్ స్వచ్ఛందంగా షిప్పింగ్ మంత్రి పదవిని వదులుకున్నారు. కార్మిక మరియు ఉపాధి మంత్రి పదవిని స్వీకరించడానికి ముందు ఏ శాఖా లేని కేంద్ర మంత్రిగా కెసిఆర్ ఉన్నారు. దశాబ్దాలనాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌పై యుపిఎ ప్రభుత్వం నాన్చివేత ధోరణి కొనసాగించడంతో, తన మంత్రిపదవికి 2006లో కెసిఆర్ రాజీనామా చేశారు.

2006 సెప్టెంబరులో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని తక్కువ చేస్తూ ఒక కాంగ్రెస్ నాయకుడు ప్రకటన చేయడంతో, కరీంనగర్ లోక్‌సభ స్థానానికి కెసిఆర్ రాజీనామా చేశారు, తిరిగి భారీ మెజారిటీతో అక్కడే గెలిచారు. తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు బలంగా ఉన్నాయన్న విషయాన్ని కెసిఆర్ ఆ ఎన్నికలో సాధించిన భారీ మెజారిటీ రుజువు చేసింది.

తెలంగాణ ఏర్పాటులో జాప్యాన్ని నిరసిస్తూ 2008 ఏప్రిల్‌లో, తెరాస ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి బయటికి వచ్చారు. కానీ, ఆ ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్ 7 ఎమ్మెల్యే, 2 లోక్‌సభ స్థానాలను మాత్రమే నిలబెట్టుకోగలిగింది.

2009లో, టిడిపి, సిపిఐ, సిపిఎం పార్టీలతో టిఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. తెలంగాణ అనుకూల ఓటు టిఆర్‌ఎస్, కాంగ్రెస్, పిఆర్‌పి, బిజెపి మధ్య చీలిపోవడంతో ఈ మహా కూటమి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. చివరికి టిఆర్‌ఎస్ కేవలం 10 ఎమ్మెల్యే స్థానాలనూ, 2 ఎంపి స్థానాలను గెలుచుకోగలిగింది.

ఉధృతంగా ఉద్యమం

2009 నవంబరు 29న, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాహారదీక్షకు దిగుతున్నట్టు కెసిఆర్ ప్రకటించారు. కానీ, దారిలోనే ఆయనను రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు, ఖమ్మం సబ్-జైలుకు తరలించారు. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాసంఘాలు రంగంలోకి దూకడంతో ఉద్యమం కార్చిచ్చులా వ్యాపించింది. తదుపరి 10 రోజులు మొత్తం తెలంగాణ ప్రాంతమంతా స్తంభించిపోయిం

శ్రీ కె. రోశయ్య నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 7న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసింది. రాష్ట్ర శాసనసభలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం తీర్మానాన్ని ప్రవేశపెడితే తాము మద్దతు ఇస్తామని టిడిపి, పిఆర్‌పి నాయకులు హామీ ఇచ్చారు. కెసిఆర్ ఆరోగ్యం చాలా వేగంగా క్షీణిస్తూ ఉండడంతో 2009 డిసెంబరు 9న, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని యుపిఎ ప్రభుత్వం ప్రకటించింది.

కానీ, 2 వారాల్లోనే సీమాంధ్ర నాయకత్వం నుంచి ప్రతిఘటన ఎదురవడంతో ఈ అంశంపై యుపిఎ వెనుకడుగు వేసింది. తరువాత కెసిఆర్ తెలంగాణ ప్రాంతంలోని రాజకీయ శక్తులన్నిటినీ ఏకం చేసి, అనేక సంస్థలు, పార్టీలను ఒకే గొడుగు కిందకు తెచ్చి తెలంగాణ జెఎసి ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ కోదండరామ్ దానికి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. టిజెఎసి చేపట్టిన అనేక ఆందోళనలు, నిరసనల్లో తెరాస కార్యకర్తలు, నాయకులు చురుగ్గా పాల్గొన్నారు.

రాష్ట్ర ఆవిర్భావం

4 సంవత్సరాల శాంతియుతమైన, ప్రభావశీలమైన ఆందోళనల తరువాత, 2013 జూలైలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను యుపిఎ ప్రభుత్వం ప్రారంభించింది. 2014 ఫిబ్రవరిలో పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ప్రత్యేక రాష్ట్ర బిల్లు ఆమోదం పొందడంతో ఆ ప్రక్రియ పూర్తయింది.

2014 ఏప్రిల్‌లో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో, మొత్తం 119 స్థానాలకు గాను 63 స్థానాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్రం అధికారికంగా 2014 జూన్ 2న ఏర్పాటయింది.

Skip to content