జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
భారతదేశంలో అత్యంత గొప్పవైన హనుమాన్ పుణ్యక్షేత్రాల్లో మొదటిదిగా చెప్పుకునే స్థాయిలో కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని పునరుద్ధరించాలనీ, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ దేవాలయం తర్వాత తెలంగాణ నుంచి మరొక పుణ్యక్షేత్రం భారతదేశ ఆధ్యాత్మిక వైభవం మరింత ద్విగుణీకృతం అయ్యే దిశగా, సర్వ హంగులతో కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. దాదాపు 300 ఏండ్ల క్రితం నిర్మితమైన, అత్యంత పురాతనమైన చారిత్రక కొండగట్టు అంజన్న దేవస్థానాన్ని రోజు రోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా, ఆధ్యాత్మిక శోభ పరిఢవిల్లేలా ఆగమశాస్త్ర నియమనిబంధనలకు లోబడి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి చేపట్టాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని పర్యటించి, అనంతరం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
కొండగట్టు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వాయుమార్గంలో కొండగట్టుకు బయలుదేరారు. కొండగట్టు ప్రాంతానికి చేరుకున్న అనంతరం ఏరియల్ వ్యూ ద్వారా దేవాలయ పరిసర ప్రాంతాలను సీఎం క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ తర్వాత సమీపంలోని నాచుపల్లి జేఎన్టీయు హెలిప్యాడ్ కు చేరుకున్న సీఎంకు మంత్రులు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీ కొప్పులు ఈశ్వర్, శ్రీ గంగుల కమలాకర్ ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుండి బస్సులో కొండగట్టు అంజన్న క్షేత్రానికి సీఎం చేరుకున్నారు. ఆలయంలోనికి ప్రవేశించిన సీఎంకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో, వేదమంత్రోచ్ఛారణలతో స్వాగతం పలికారు. అంజన్నకు ప్రత్యేక పూజలు చేసిన సీఎంకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించారు. అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం సీఎం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కాలినడకన ఆలయ పరిసరాల్లో కలియ తిరిగారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు శ్రీ కొప్పుల ఈశ్వర్, శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీ గంగుల కమాలకర్, ఎంపి శ్రీ దివకొండ దామోదర్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు శ్రీ వినోద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే శ్రీ సుంకె రవిశంకర్ తో పాటు, ఎమ్మెల్యేలు శ్రీ రసమయి బాలకిషన్, శ్రీ బాల్క సుమన్, శ్రీ జీవన్ రెడ్డి, శ్రీ సంజయ్, శ్రీ కె. విద్యాసాగర్ రావు, శ్రీ కోరుకంటి చందర్, మండలి చీఫ్ విప్ శ్రీ భాను ప్రసాద రావు, ఎమ్మెల్సీ శ్రీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్సీ శ్రీ నారదాసు లక్షణ రావు, ఎఫ్ డిసి ఛైర్మన్ శ్రీ అనిల్ కూర్మాచలం, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ రవీందర్ సింగ్, డిసిసిబి ఛైర్మన్ శ్రీ అల్లోల శ్రీకాంత్ రెడ్డి, శ్రీ గెల్లు శ్రీనివాస్ యాదవ్, సీఎంఓ అధికారులు శ్రీ భూపాల్ రెడ్డి, శ్రీమతి స్మితా సబర్వాల్, ఆర్ అండ్ బి అధికారులు శ్రీ గణపతి రెడ్డి, శ్రీ రవీందర్ రావు, మిషన్ భగీరథ ఈఎన్సీ శ్రీ కృపాకర్ రెడ్డి, కలెక్టర్ శ్రీమతి యాస్మిన్ భాషా, ఆలయ స్తపతి శ్రీ ఆనందర్ సాయి, వాస్తు సలహాదారు శ్రీ సుద్దాల సుధాకర్ తేజ, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఈఓ శ్రీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ “భారతదేశంలోనే గొప్పదైన ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడున్నదంటే కొండగట్టు అంజన్న ఆలయం పేరు వినపడేలా అత్యంత గొప్పగా, అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో తీర్చిదిద్దాలి. దేశవ్యాప్తంగా ఉన్న హనుమాన్ భక్తులు దర్శించుకునేందుకు అనువుగా నిర్మాణ ప్రణాళికలు రూపొందించాలి. సుమారు 750-800 ఎకరాల్లో ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టాలి” అని సీఎం సూచించారు.
దేవాలయాన్ని భక్తుల అవసరాలకు అనుగుణంగా విస్తరించడానికి సేకరించాల్సిన భూములు, సంబంధించిన అంశాలపై ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్, రెవెన్యూ అధికారులతో లొకేషన్ మ్యాపును వీక్షిస్తూ, భూమి వివరాలను సీఎం పరిశీలించారు.
స్థల పురాణం తెలిపే పుస్తకాలను ముద్రించాలని, రాష్ట్రంలోని అన్ని ఆలయాల స్థల పురాణ పుస్తకాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. కష్టాల్లో ఉన్నవారికి, మానసిక ఆందోళనలతో సతమతమయ్యే భక్తులకు కొండగట్టు అంజన్న భరోసాగా నిలిచాడని, ఇక్కడి వచ్చిన భక్తులకు కష్టాలు తొలిగుతున్నాయని ప్రజలు విశ్వసిస్తున్నారని సీఎం తెలిపారు.
ఈ సందర్భంగా కొండగట్టు అంజన్న స్థల పురాణం గురించి సీఎం స్వయంగా అధికారులకు వివరించారు. “300 ఏళ్ళ క్రితం ఈ కొండ మీదకు వచ్చిన ఒక భక్తునికి కలలో దర్శనిమిచ్చి ఆలయాన్ని నిర్మించాలని స్వామి వారు ఆదేశించగా, ఇదే విషయాన్ని నాటి ఆ ప్రాంత దేశ్ ముఖ్ కు విన్నవించగా, అప్పటి పరిస్థితుల దృష్ట్యా స్వామి వారి ఆలయ నిర్మాణం జరిగింది. తదనంతర కాలంలో కొంత కొంత అభివృద్ధి అవుతూ వచ్చింది. కానీ ఆంజనేయ స్వామ భక్తులు హనుమాన్ జయంతి, దీక్షలు తదితర ఆధ్యాత్మిక సందర్భాల్లో ఆంజనేయ స్వామి భక్తుల రద్దీ పెరిగిపోతూ వస్తున్నది. గత పాలనలో ఇక్కడ తాగునీటికి కూడా ఇబ్బందికర పరిస్థితులుండేవి. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత ఆ లోటు తీరింది.” అని సీఎం అన్నారు.
రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి హనుమాన్ భక్తులు ఇక్కడికి వచ్చి హనుమాన్ దీక్షలు స్వీకరిస్తారు. దీక్ష విరమణలు కూడా ఇక్కడే చేస్తారు. పెద్ద ఎత్తున అఖండ హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుంది. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలన్నింటికి సరిపోయేలా 50 వేల మంది పట్టేలా విశాలమైన హాల్ ను నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
కొండగట్టుపై ఉన్న కోనేరు, సీతమ్మ కన్నీటిధార, బేతాళస్వామి ఆలయం కొత్త పుష్కరిణి, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాల గురించి సీఎం అధికారులతో చర్చించారు. పెరుగుతున్న హనుమాన్ భక్తులను దృష్టిలో ఉంచుకొని గొప్పగా ఈ దేవాలయాన్ని విస్తరించాల్సిన అవసరం ఉన్నదని సీఎం అన్నారు. ఈ నేపథ్యంలో వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి ఆలయ పునర్నిర్మాణాన్ని, అభివృద్ధిని చేపట్టనున్నట్లు తెలిపారు. ఆంజనేయ స్వామి పునరుద్ధరణకు నిధులకు ఎలాంటి కొరత లేదనీ, 1000 కోట్ల రూపాయలైన కేటాయించేందుకు సిద్ధమని సీఎం చెప్పారు.
యాదగిరిగుట్ట ఆలయ నిర్మాణం సమయంలో చేపట్టిన సూక్ష్మ పరిశీలన, విస్తృతస్థాయి సమావేశాలు, సమీక్షలు నిర్వహించి ఆగమ శాస్త్రం, వాస్తు నియమాలను అనుసరించి అంజన్న ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను చేపతడతామని సీఎం స్పష్టం చేశారు. వాస్తు నియమాల ప్రకారం ఏ నిర్మాణాన్ని ఎక్కడ చేపట్టాలో నిర్ణయించుకోవాలన్నారు. అందుకు తగ్గట్టుగానే స్థలాలను గుర్తించాలన్నారు. ఈ నేపథ్యంలో ఆగమ శాస్త్ర నియమాలను అనుసరించి గర్భాలయం ముట్టుకోకుండా మిగతా ఆలయాన్ని విస్తరించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
భవిష్యత్తులో హనుమాన్ జయంతి సందర్భంగా 10 లక్షల మంది భక్తులను అంచనా వేసి, అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యాభై వేల మంది ఒకేసారి దీక్ష చేపట్టేలా అత్యంత విశాలమైన దీక్షాపరుల మంటపాన్ని అన్ని హంగులతో నిర్మించాలని అన్నారు. భక్తుల వెంట వచ్చేవారికి కూడా సరిపోయే విధంగా వసతులను ఏర్పాటు చేయాలన్నారు. భోజన శాలల నిర్మాణం, టాయ్ లెట్లు, నీటి సౌకర్యాలను అందించే వ్యవస్థలను, అన్ని రకాల మౌలికవసతులతో కూడిన వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ సబ్ స్టేషన్, దవాఖాన, బస్టాండు, 80 ఎకరాల్లో సువిశాల పార్కింగ్ స్థలం, రోడ్ల నిర్మాణం, పుష్కరిణి, వాటర్ ట్యంకులు, నీటి వసతి, కాటేజీల నిర్మాణం, దీక్షాపరుల మంటపం, అన్నదాన సత్రం, కళ్యాణ కట్ట, పోలీస్ స్టేషన్ తదితర మౌలిక వసతులను భవిష్యత్ కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు సిద్దం చేయాలని సీఎం స్పష్టం చేశారు.
ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన మంగళవారం నాడు, శని, ఆదివారాల్లో దాదాపు 20 వేలమంది వరకు భక్తులు దర్శించుకుంటారనీ, మిగతా రోజుల్లో 2 నుండి 3 వేల వరకు ప్రస్తుతం భక్తులు వస్తున్నారని, భక్తుల రద్దీ వివరాలను అధికారులు, అర్చకులు సీఎంకు వివరించారు. కాగా ఆలయం పునరుద్ధరణ తర్వాత ఈ సంఖ్య మూడు, నాలుగు రెట్లకు పెరుగుతుందనీ, అందుకు యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రమే నిదర్శనమని సీఎం అన్నారు.
భక్తులు గుడికి చేరుకునే రోడ్డు, తిరిగి గుడి నుండి బయటకు వెళ్ళే రోడ్డును వీలయినంత విశాలంగా నిర్మించాలని, క్యూలైన్ల నిర్మాణం, ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బందులు కలగకుండా రవాణా సౌకర్యాలు, విశాలమైన ప్రధాన ద్వారం ఏర్పాటు చేయాలని రోడ్డు భవనాల శాఖ అధికారులను సూచించారు. ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఘాట్ రోడ్డులను అభివృద్ది చేయాలని సూచించారు.
“తెలంగాణ పుణ్యక్షేత్రాలన్నింటిలో కెల్లా గొప్ప అటవీ సంపద, ప్రకృతి రమణీయత ఇక్కడ ఉన్నది. ఇక్కడి నీళ్ళు తాగితే రోగాలు నయమవుతాయి. ఈ ఆలయానికి ఈ అడవే ఆయువు పట్టు. ఈ అడవిని మనం ముట్టుకోవద్దు. మరొకరిని ముట్టనీయ వద్దు. కొండగట్టు అంజన్న అభయారణ్యం ప్రాంతం మైసూరు – ఊటి రహదారిలోని నీలగిరి కొండల్లోని బందీపూర్ అభయారణ్యం మాదిరి మార్చాలి. ఈ దిశగా పకడ్బందీ చర్యలు చేపట్టాలి” అని భూపాల్ రెడ్డికి సీఎం సూచించారు.
“ఈ ప్రాంతం వేములవాడ, ధర్మపురి, కొండగట్టు అంజన్న, మరోపక్క మిడ్ మానేర్, ఇక్కడికి సందర్శనకు వచ్చిన భక్తులు ఈ పుణ్యక్షేత్రాలన్నింటిని దర్శించి పోతుంటారు. ఈ పచ్చదనంతో గడిపేందుకు రెండు మూడు రోజులు వారి బిడ్డలతో పాటు గడిపేలా కోరుకుంటారు. అటువంటి వాతావరణం ఇక్కడ ఉన్న నేపథ్యంలో, వారికి వసతి కల్పించే దిశగా కాటేజీల నిర్మాణం ఉండాలి. గుట్ట మీద కాటేజీల నిర్మాణానికి దాతలను ఆహ్వానించాలన్న సీఎం అన్నారు. ఇప్పటికే శ్వేత గ్రానైట్స్ వారు నిర్మించి కాటేజ్ విస్తరణలో పోతున్నందున దాన్ని తిరిగి నిర్మిస్తామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. దానికి తగిన స్థలాన్ని కేటాయించాలని కోరారు. అందుకు సమ్మతించిన సీఎం, గంగుల కమలాకర్ ను అభినందించారు. గుట్ట మీదకి వచ్చే వివిఐపిల కోసం యాదగిరిగుట్ట మాదిరి ప్రెసెడెన్షియల్ సూట్, వివిఐపి సూట్ల నిర్మణానాకి సంబంధించి స్థలాన్ని ఎంపిక చేసి, వాస్తుల నియమాలను అనుసరించి నిర్మాణాలు చేపట్టాలన్నారు. అందుకు ప్రణాళిక లు సిద్ధం చేయాలని సూచించారు.
“హనుమంతుడు రామభక్తుడిగా, భక్తి విశ్వాసాలకు మాత్రమే ప్రతీక కాదు. ఆయన గొప్ప వక్త కూడా హనమంతుడు గొప్ప వాచస్పతి. గొప్ప జ్ఞాని. గొప్ప వ్యవహార కర్త. ఇదే విషయాన్ని రాముడు కూడా పలువురికి చెప్పినట్లు మన పురాణాలు చెప్తున్నాయి” అని సీఎం వివరించారు. “హనుమంతుని గొప్పదనాన్ని అన్ని కోణాలో వివరిస్తూ, దేశంలో మరెక్కడాలేని విధంగా హనుమంతుని గురించిన విషయాలను ఇక్కడ సమకూర్చాలి. హనుమంతుని గూర్చిన విశేషాలను, గుణగణాలను ప్రదర్శించేలా కొండగట్టు క్షేత్రం తీర్చిదిద్దబడాలి.
పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చినప్పుడు పార్కింగ్ తదితర సమస్యలను అధిగమిచేందుకు శబరిమళలో ఏర్పాట్లను పరిశీలించి రావాలని సీఎం సూచించారు. ఆలయ నిర్మాణానికి 4 ఎకరాల విశాల స్థలాన్ని కేటాయించాలి.” అని సీఎం అన్నారు.
ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి కనీసం మూడు సంవత్సరాల కాలం పడుతుందనీ, అప్పటిదాకా ఆగమశాస్త్ర నియమాలను అనుసరించి బాలాలయాన్ని నిర్మించాలని, శిల్పులను సిద్ధం చేసుకోవాలని ఆలయ స్తపతి ఆనంద్ సాయికి సీఎం సూచించారు. గుట్టల పై నుంచి సహజంగా ప్రవహించే నీటి ప్రవాహం, “సంతులోని లొద్ది”లో నీటి లభ్యత గురించి, దాని అభివృద్ధి గురించి సీఎం చర్చించారు.
గుట్ట చుట్టూ ఉన్న చెరువుల గురించి ఇరిగేషన్ అధికారులతో సీఎం ఆరా తీశారు. కళ్యాణ కట్ట దగ్గర పుష్కరిణిలు ఏర్పాటు చేయాలన్నారు. కళ్యాణ కట్ట పుష్కరిణి పక్కపక్కన ఉండటంతో పాటు స్త్రీలు, పురుషులకు ప్రత్యేక పుష్కరిణులు ఏర్పాటు చేయాలన్నారు.
కొండగట్టు అంజన్న ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి పైపుల ద్వారా నీటిని తరలించే పనులను చేపట్టాలని, కార్యదర్శి స్మిత సబర్వాల్, ఇరిగేషన్ అధికారులకు సిఎం సూచించారు. ఈ నీటితోనే నిర్మాణ పనులు మొదలు పెట్టాల్సి ఉన్నందున తక్షణమే చర్యలు ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అందుకు తగిన పనులను వెంటనే చేపట్టాలని కార్యదర్శి సీఎం స్మితా సబర్వాల్ ను ఆదేశించారు.
దేవాలయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యాచరణతో రాష్ట్రంలో రోజు రోజుకీ ఆధ్యాత్మకి శోభ పెరిగిపోతున్నదనీ, భక్తులు దేవాలయాలను గొప్పగా ఆదరిస్తున్నారని, రాష్ట్రంలోని దేవాలయాలు స్వయం సమృద్ధితో, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక వనరులతో పాటు, ఆలయాలకు వస్తున్న విరాళాలు, ఆర్థిక వనరులను తిరిగి ఆలయాల పునరుద్ధరణకు వినియోగించేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని దేవాదాయ శాఖ అధికారులకు, దేవాదాయశాఖ మంత్రికి సీఎం సూచించారు.
కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా వసతి గృహాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఎండి మనోహర్ రావుకు సీఎం సూచించారు. దేవాలయానికి వచ్చే భక్తులు మొదట మూలవిరాట్టు హనుమంతునితో పాటు, దర్శించుకునే ఇతర దేవుళ్ళ వివరాలను సీఎం తెలుసుకున్నారు. మొదటి మూలవిరాట్టును దర్శించుకన్న తర్వాత అమ్మవారిని, ఆ తర్వాత వేంకటేశ్వర స్వామిని, తర్వాత గుట్ట కింద భేతాళ స్వామి దర్శనం, రాములవారి పాదుకలను దర్శించుకుంటారని, ఇదే పద్దతిని అనుసరిస్తూ నిర్మాణాలు చేపట్టాలని స్తపతి ఆనంద్ సాయికి సీఎం సూచించారు. అంజనాద్రి పేరుతో వేదపాఠశాలను నిర్మించాలనీ, అందుకు తగిన స్థలం ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు.
రెండు గంటలకుపైగా సుదీర్ఘంగా సాగిన సమావేశంలో ఆలయ పున్నర్మిర్మాణం, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి చర్యలు చేపట్టాల్సిందిగా అన్ని విభాగాల అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఈ మహా కార్యం పూర్తయ్యే వరకు తాను అనేక పర్యటనలు చేపట్టాల్సి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీ కొప్పుల ఈశ్వర్, శ్రీ గంగుల కమలాకర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.