​17 నుండి గ్రామ జ్యోతి కార్యక్రమం; గ్రామ స్థాయి ప్రణాళికల ఆధారంగా నిధులు

​ఈ నెల 17 నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామజ్యోతి కార్యక్రమం నిర్వహించాలని, ప్రతి గ్రామంలో విధిగా గ్రామ సభలు నిర్వహించి వచ్చే నాలుగేళ్ల కోసం ప్రణాళికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ రావు అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, పంచాయతిరాజ్‌ ముఖ్య కార్యదర్శి రేమాండ్‌ పీటర్‌, కమిషనర్‌ అనితారాంచంద్రన్‌, సిఎంఒ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌ రావు తదితరులతో గ్రామ జ్యోతి కార్యక్రమ ఏర్పాట్లపై బుధవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

గ్రామాల జనాభాను అనుసరించి ఆయా గ్రామాల్లో తయారయిన ప్రణాళికల ప్రకారం నిధులు విడుదల చేయాలని సూచించారు. ఏ గ్రామానికి ఏ పని కోసం ఎన్ని నిధులు విడుదలయ్యాయో ప్రజలందరికి తెలపాలని కూడా సిఎం చెప్పారు. గ్రామాల్లో చెత్త సేకరణ కోసం 25 వేల రిక్షాలు కొని జనాభా ప్రకారం గ్రామాలకు పంపాలన్నారు. ఇదే కార్యక్రమంలొ భాగంగా విరివిగా మొక్కలు కూడా నాటాలన్నారు. చేంజ్‌ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న అధికారులతో కొద్ది రోజుల్లోనే సమావేశం నిర్వహించాలని సిఎం నిర్ణయించారు. గ్రామజ్యోతి కార్యక్రమానికి సంబంధించి విధి విధానాల ముసాయిదాను కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు.​