గట్టు ఎత్తిపోతల పథకానికి సీఎం శంఖుస్థాపన

​జోగుళాంబ గద్వాల జిల్లాలోని తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన గట్టు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు శుక్రవారం శంఖుస్థాపన చేశారు. గద్వాల నియోజకవర్గంలోని గట్టు, ధరూర్, కేటి దొడ్డి మండలాలలోని 33 వేల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు, 41 చెరువులను నింపేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.

మంత్రులు శ్రీ టి. హరిష్ రావు, శ్రీ జూపల్లి కృష్ణారావు, శ్రీ సి. లక్ష్మారెడ్డి, జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

రూ. 553.98 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. గట్టు ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా ఈ ప్రాంతంలోని రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి సీఎంకు అభినందనలు తెలిపారు.

గట్టు ఎత్తిపోతల పథకం పూర్వాపరాలు:

  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి గద్వాలలో జరిగిన బహిరంగ సభలో గట్టు హైలెవల్ కెనాల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కాని ఆయన హయాంలో ఈ పనులు ప్రారంభం కాలేదు. నిధులు మంజూరు కాలేదు
  • 2012 సెప్టెంబర్ 14వ తేదీన జరిగిన ఇందిరమ్మ కార్యక్రమంలో ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ర్యాలపాడు నుంచి నీళ్లను ఎత్తిపోతల ద్వారా మళ్లించి గట్టు మండలంలోని చెరువులను నింపుతామని ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన తర్వాత దాదాపు సవంత్సరంన్నర పాటు ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదు.
  • 2014 ఎన్నికలకు ముందు మళ్లీ గట్టు ఎత్తిపోతల పథకం ప్రస్తావన తెచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం 0.31 టిఎంసిల నీటితో చెరువుల కింద ఉన్న 3,000 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణకు సర్వే చేయడానికి జీవో నెంబర్ 3 ను 22-01-2014 నాడు విడుదల చేసింది
  • సర్వే జరగలేదు…. ప్రాజెక్టు ప్లాన్ లేదు… డిపిఆర్ రాలేదు… టెండర్లు లేవు…. అయినా శంఖుస్థాపన చేశారు
  • తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్… రిటైర్డ్ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు. మంత్రి హరీష్ రావు స్వయంగా గట్టు, ధరూర్, కె.టి.దొడ్డి మండల ప్రజలతో మాట్లాడారు. కరవు మండలాలకు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా, కేవలం 3 వేల ఎకరాలకు నీరు ఇచ్చేందుకు పనులు చేయడం వల్ల కరువు ప్రాంతాలకు న్యాయం జరగదని ప్రభుత్వం భావించింది
  • దాదాపు 28 వేల ఎకరాల వరకు కొత్త ఆయకట్టుకు గట్టు ఎత్తిపోతల పథకం ద్వారా నీరు ఇచ్చేలా సమగ్ర సర్వే చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జీవో ఆర్.టి నెంబర్ 461ని 2016 మే 3వ తేదీన విడుదల చేసింది. 52.46 లక్షల రూపాయలు అదనంగా మంజూరు చేసింది
  • ప్రాజెక్టు సమగ్ర సర్వే సమర్పించే దశలో సోలార్ పవర్ ప్లాంట్ కోసం రిజర్వు చేసిన ఐదు వేల ఎకరాలను ఆయకట్టు పరిధిలోకి తేవాలని స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు. వారి కోరికను ప్రభుత్వం కాదనలేదు. తిరిగి రీ సర్వే చేయించింది. తద్వారా 25 వేల ఎకరాల నుంచి 33 వేల ఎకరాలకు నీరిచ్చేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది
  • గట్టు ఎత్తిపోతల పథకం ద్వారా 2.8 టిఎంసిల నీటితో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తారు. 41 చెరువులు నింపుతారు. 33 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తారు. 553.98 కోట్లను మంజూరు చేశారు. ఈ మేరకు 2018 మే 31వ తేదీన ఈ మేరకు జీవో ఎం.ఎస్ నెంబర్ 60 విడుదల చేశారు

తుమ్మిళ్ల ఎత్తిపొతల పథకం పనులను పరిశీలించిన సీఎం 

జూరాల సోర్స్ నుండి నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా దాదాపు ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి వీలుగా అవసరమైన వ్యవస్థను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నీటి పారుదల శాఖను ఆదేశించాఠు. తుమ్మిళ్ల ఎత్తిపొతల పథకం నుండి ఈ ఏడాదే మొదటి దశ పంపింగ్ ప్రారంభం కావాలని చెప్పారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పూర్తి చేయడం ద్వారా 87,500 ఎకరాల ఆర్డిఎస్ ఆయకట్టును వందకు వంద శాతం స్థిరీకరించగలుగుతామన్నారు.

తుంగభద్ర నది నుండి నీటిని ఎత్తిపోసి ఆర్డీఎస్ కాలువలకు అందించే తుమ్మిళ్ల ఎత్తిపొతల పథకం పనులను ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం పరిశీలించారు. తుంగభద్ర వద్ద ఇంటేక్ పాయింట్ ను, అప్రోచ్ కెనాల్ ను, పంప్ హౌజ్ లను పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట నీటి పారుదల శాఖ మంత్రి శ్రీ టి. హరీష్ రావు, పంచాయతిరాజ్ శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ శ్రీ ఎస్. నిరంజన్ రెడ్డి, రాజ్యసభ ఎంపి శ్రీ కె. కేశవరావు, ఐడిసి చైర్మన్ శ్రీ శంకర్ రెడ్డి, నీటి పారుదల శాఖ ఇఎన్సీ శ్రీ మురళీధర్, ఎస్.ఇ. శ్రీ ఖగేందర్, జెన్కో డైరెక్టర్, ఎస్.పి.డి.సి.ఎల్ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి, సీఎంఒ కార్యదర్శి శ్రీమతి స్మితా సభర్వాల్, కలెక్టర్ శ్రీ రోనాల్డ్ రాస్ తదితరులు వున్నారు.

‘‘ఆర్డీఎస్ ద్వారా 87,500 ఎకరాలకు సాగునీరు అందాల్సి వుండగా గత పదేళ్లుగా పూర్తి ఆయకట్టుకు నీరు రావడం లేదు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా పూర్తి ఆయకట్టుకు నీరందుతుంది’’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ‘‘తుమ్మిళ్లతో పాటు గట్టు ఎత్తిపోతల పథకాలు పూర్తయితే కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య వున్న నడిగడ్డలో లక్షా 20 వేల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి’’ అని ముఖ్యమంత్రి అన్నారు. ‘‘జూరాల ద్వారా లక్షా నాలుగు వేల ఎకరాలు, నెట్టెంపాడు ద్వారా రెండున్నర లక్షల ఎకరాలు, భీమా ద్వారా రెండున్నర లక్షల ఎకరాలు, కోయిల్ సాగర్ ద్వారా 50 వేల ఎకరాలు, ఆర్డీఎస్ ద్వారా 87,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించడానికి ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టుల ద్వారానే తాగునీరు కూడా అందిస్తాం. నీటిని సమగ్రంగా వినియోగించుకోవడానికి ప్రస్తుతం నిర్మిస్తున్న రిజర్వాయర్లతో పాటు ఇంకా ఎన్ని రిజర్వాయర్లు అవసరమవుతాయే నిర్ధారించి, ప్రతిపాదనలు రూపొందించాలి. అవసరమైన పంపు హౌజ్ లు, కాలువల నిర్మాణం పూర్తి చేయాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం వివరాలు:

  • రూ.783 కోట్ల వ్యయం
  • 87,500 ఎకరాలకు సాగునీరు
  • ఈ సీజన్ నుంచి నీటి లిఫ్టింగ్
  • ఆర్డీఎస్ ద్వారా గద్వాల, ఆళంపూర్ నియోజకవర్గాల్లో 75 గ్రామాల్లోని 87,500 ఎకరాలకు సాగునీరు అందాలి. 15.9 టిఎంసిల నీటి కేటాయింపు ఉన్నది
  • కానీ గత పదేళ్లుగా కేవలం 31,500 ఎకరాలకు మాత్రమే నీరు అందుతున్నది. మిగతా 56వేల ఎకరాలకు సాగునీరు లేక బీడు బారి పోయింది
  • కేవలం 5 టిఎంసిలు మాత్రమే ఉపయోగించుకోగలుగుతున్నాం. మిగతా 11 టిఎంసిలు అందడం లేదు
  • ఈ గ్యాప్ ను పూడ్చడానికి మొత్తం 87,500 ఎకరాల భూమికి నీరు ఇవ్వడానికి రూ.783 కోట్ల వ్యయంతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం చేపట్టారు
  • తుంగభద్ర నది నీళ్లు నిల్వ చేసే సుంకేసుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి తుమ్మిళ్ల గ్రామం వద్ద నీటిని లిఫ్ట్ చేసి, ఆర్డీఎస్ కెనాల్ లో నీరు పోస్తారు. దీంతో 56వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది
  • రెండో దశలో మల్లమ్మకుంట, జులకల్, వల్లూరు రిజర్వాయర్లు నిర్మిస్తారు. ఒక టిఎంసి నీటిని రిజర్వ్ చేస్తారు
  • ఈ సీజన్ లోనే సుంకేసుల నుంచి నీటిని పంప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు