తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు – 2018

​తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర రావు గారి ప్రసంగం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరులకు ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను.

తెలంగాణ అవతరించి నేటికి నాలుగు సంవత్సరాలు. మనం కలలుగంటున్న బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా ఈ నాలుగేళ్లలో బలమైన అడుగులు వేయగలిగాం. ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రణాళికలు సత్ఫలితాలనిస్తున్నాయి.

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ దారుణమైన అణచివేతకు, దోపిడీకి గురైంది. అన్ని రంగాల్లో తీవ్రమైన వెనుకబాటుతనం ఆవహించింది. బతుకుమీదనే ఆశను కోల్పోయేంతగా నిరాశ నిస్పృహలు ఆవరించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్ప తమ తలరాత మారదనె వాస్తవం గ్రహించి, ఉవ్వెత్తున ఉద్యమించి స్వరాష్ట్రం సాధించుకున్నాం. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు, కడగండ్లు, వాటి కారణాలు, పరిష్కారాలను స్పష్టంగా అర్థం చేసుకోగలిగాం. ఆ ఆలోచన పునాదుల మీదనే మానిఫెస్టోను రూపొందించి, ఎన్నికల్లో ఘనవిజయం సాధించాం. ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచి మానిఫెస్టోలోని అంశాలను వెంటవెంటనే అమలు చేస్తున్నాం. విస్తృత ప్రజా ప్రయోజనం కలిగిన కొత్త పథకాలనెన్నింటినో ప్రవేశపెట్టా౦. ఒకవైపు ప్రజల్లో మానసిక స్థైర్యాన్ని కలిగిస్తూ, మరోవైపు నిరంతర ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా చేశాం. ఇది దశాబ్దాల కాలం మనం చేసిన పోరాటానికి దక్కిన సార్థకతగా నేను భావిస్తున్నాను. నేడు తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న విజయాలు తెలంగాణ బిడ్డలుగా మనందరికీ గర్వకారణాలు.

అనతికాలంలోనే రాష్ట్రం అద్భుత విజయాలను సాధించిందని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. దేశంలో మరే రాష్ట్రం అమలుచేయని ఎన్నో కార్యక్రమాలకు నాంది పలకడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. పలు రాష్ట్రాల ప్రతినిధులు, అధికారులు ఇక్కడికి వచ్చి మన పథకాలు, కార్యక్రమాలను పరిశీలించి, ఆయా రాష్ట్రాలలో అమలుచేసేందుకు పూనుకోవడమే ఇందుకు నిదర్శనం. అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలకు తెలంగాణ రోల్ మోడల్ అనే చర్చ దేశ వ్యాప్తంగా జరుగుతుండడం మనందరికీ గర్వకారణం.

21 శాతం ఆదాయాభివృద్ధి రేటు కలిగిన ధనిక రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. “సంపద సృష్టించాలి. సృష్టించిన సంపదను ప్రజలకు పంచాలి’’ అనే సూత్రం ప్రాతిపదికగా ప్రభుత్వం పురోగమిస్తున్నది. సకలజనుల సంక్షేమానికి పాటుపడుతున్నది.

సంక్షేమం
బతుకు దెరువు లేక ఆగమైపోయిన తెలంగాణ ప్రజలకు ముందు కనీస జీవన భద్రత కల్పించాలని, భవిష్యత్తు పట్ల ఆశలు చిగురింపచేయాలని ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత నిచ్చింది. 42 లక్షల మంది అసహాయులకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున పెన్షన్లు అందిస్తూ ఆసరాగా నిలుస్తున్నది. దేశంలో ఎవరూ, ఎక్కడా, ఎన్నడూ ఇవ్వని విధంగా బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, బోదకాలు బాధితులకు, మజీదుల్లో ప్రార్థనాదికాలు నిర్వహించే ఇమామ్, మౌజన్ లకు ప్రభుత్వం జీవన భృతి కల్పిస్తున్నది. ఆడపిల్ల పెళ్లి వల్ల కుటుంబాలు ఆర్థికంగా చితికి పోవద్దని కళ్యాణలక్ష్మి పథకం ద్వారా రూ. 1,00,116 ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఎదిగే పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలని బడి పిల్లలందరికీ సన్నబియ్యం బువ్వ పెడుతున్నది. దేశంలో 40వేల కోట్లతో, 40 పథకాల ద్వారా ప్రజా సంక్షేమం కోస పెద్ద ఎత్తున పాటుపడుతున్న ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ.

వ్యవసాయ రంగాభివృద్ధి
గ్రామీణ ఆర్థికవ్యవస్థ బాగుంటేనే వివిధ వృత్తులను నమ్ముకొని జీవించే ప్రజానీకానికి చేతినిండాపని, కడుపునిండా అన్నం దొరుకుతుంది. వ్యవసాయ రంగం, వృత్తి పనులు బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటుందని నా ప్రగాఢ విశ్వాసం. ఉమ్మడి రాష్ట్రంలో కుదేలైన వ్యవసాయరంగాన్ని, వృత్తి పనులను తిరిగి నిలబెట్టేందుకు ప్రభుత్వం సమగ్ర దృక్పథంతో ప్రణాళికలు రచించి, అమలు చేస్తున్నది. దశల వారీగా వివిధ పథకాలను అమలు చేస్తూ వస్తున్నది.

రైతు రుణాల మాఫీ, సకాలంలో ఎరువులు-విత్తనాల సరఫరా, ఐదువేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారి నియామకం, డ్రిప్ ఇరిగేషన్ కు– పాలీ హౌజ్ లకు, యంత్ర పరికరాలకు భారీ సబ్సిడీలు ఇవ్వడం, పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం, రైతన్నలు చెల్సించాల్సిన నీటి తీరువా బకాయిల రద్దు, వ్యవసాయ ట్రాక్టర్లపై రవాణాపన్ను రద్దు, తదితర కార్యక్రమాల ద్వారా వ్యవసాయ రంగానికి కొత్త ఉత్తేజాన్ని కలిగించాం. సమైక్య రాష్ట్రంలో కరెంటు లేక రైతులు అనుభవించిన కష్టాలకు తెలంగాణ రాష్ట్రంలో చరమగీతం పాడాం. ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త, నేడు కరెంటు పోతే వార్త అనుకునే స్థాయికి విద్యుత్ రంగాన్ని తీసుకురాగలిగాం. 24 గంటల పాటు నాణ్యమైన నిరంతర ఉచిత విద్యుత్ సరఫరాతో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగినయి. రైతుల జీవితాల్లో ఆనందపు వెలుగులు నిండినయి.

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం
సమైక్య రాష్ట్రంలో సాగునీటి విషయంలో జరిగిన అన్యాయాన్ని సవరించి, గోదావరి, కృష్ణ నదీజలాలను తెలంగాణ పొలాలకు తరలించే విధంగా రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నది. ఏది ఏమైనా సరే తెలంగాణ రైతులు కన్న కలలు నిజం చేయాదానికి ప్రభుత్వం నడుం కట్టింది. తెలంగాణ వ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగునీరు అందించి తీరాలనే దృఢ సంకల్పంతో ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా కొనసాగిస్తున్నది.

సమైక్య రాష్ట్ర పాలకులకు తెలంగాణ ప్రజలను భ్రమ పెట్టి పబ్బం గడుపుకోవాలనే దురాలోచననే తప్ప, నిజంగా తెలంగాణకు ప్రాజెక్టులు నిర్మించాలనే ఉద్దేశ్యమెన్నడూ లేదు. ప్రాజెక్టు స్థలం ఎంపిక దగ్గరనే వారి కుట్ర ప్రారంభమవుతుంది. అంతర్రాష్ట్ర వివాదాలకు ఆస్కారం కల్పించే విధంగా డిజైన్ చేసి, తర్వాత ఆ వివాదలనే సాకుగా చూపించి ప్రాజెక్టులు నిర్మించలేదు. అదేమిటంటే నెపం పక్క రాష్ట్రం నెత్తిన వేయడం, ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తలు రెచ్చగొట్టడం అనే పన్నాగాన్ని అమలు చేసారు. ఈ విధంగా సమైక్య పాలకులు తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొడుతుంటే తెలంగాణ నాయకులు తమ చేతకానితనాన్ని ప్రదర్శించారే తప్ప, ఎన్నడూ ఎదురు తిరిగి ప్రశ్నించలేదు. అందుకే ప్రభుత్వం సమైక్య పాలకులు చేసిన ప్రాజెక్టుల డిజైన్లను తెలంగాణ అవసరాలకు తగిన విధంగా రీ డిజైన్ చేయవలసి వచ్చింది.

మహారాష్ట్రతో చారిత్రిక ఒప్పందం
గోదావరి జలాల సమగ్ర వినియోగం కోసం తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపి, చారిత్రక ఒప్పందం చేసుకున్నది. గడిచిన 70 సంవత్సరాలలో ఏ ప్రభుత్వమూ మహారాష్ట్రతో ఒప్పందాన్ని సాధించలేదు. తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాల కోసం మనం ఎంతో పరిణతితో వ్యవహరించి, ప్రాజెక్టుల నిర్మాణానికి కీలకమైన అంతర్రాష్ట్ర ఒప్పందాలను సాధించుకోగలిగాం. నదీ జలాల వినియోగానికి సంబంధించి చేసుకున్న ఒప్పందాలను కేంద్ర జలసంఘం, కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించాయి. దీనివల్ల గోదావరిపై ప్రాజెక్టులు నిర్మించుకోవడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. శరవేగంగా ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయి.

ఆదిలాబాద్ జిల్లాలో లోయర్ పెన్ గంగ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతీసారి ఒక ఎన్నికల అంశంగా వాడుకున్నారు. మహారాష్ట్ర అనుమతిని సాధించడం కానీ, నిర్మాణం ప్రారంభించడం కానీ చేసిన పాపాన పోలేదు. నేడు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధి తో ప్రయత్నం చేయడం వల్ల చనాఖా-కొరాటా బ్యారేజి నిర్మాణం వేగంగా జరుగుతున్నది.

గోదావరి, కృష్ణ నదుల మీద 23 భారీ ప్రాజెక్టులు, 13 మధ్యతరహా ప్రాజెక్టుల పనులు ఇప్పటికే చేపట్టాం. వీటిలో కొన్ని పూర్తిచేయగలిగాం. మరికొన్ని నిర్మాణదశలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరందించేందుకు వీలుగా, ప్రజల అవసరాలు, ఆకాంక్షలు, ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలు, నీటి లభ్యతల ఆధారంగా అవసరమైన మేరకు ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషిచేస్తున్నాం. అందుకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్లో ఈ ప్రాజెక్టులకు ఏటా 25 వేల కోట్ల రూపాయలు కేటాయించుకుంటున్నాం.

పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి
సమైక్య రాష్ట్రంలో ఉద్దేశ్యపూర్వకంగా పెండింగులో పడేసిన కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్, మిడ్ మానేరు, సింగూరు, ఎల్లంపల్లి, కిన్నెరసాని, పాలెం వాగు, కొమురంబీమ్, మత్తడివాగు, నీల్వాయి, జగన్నాథ్ పూర్ లాంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ఇప్పటికే 12 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నది. ఈ ఏడాది వర్షాకాలం పంట నాటికి మొత్తం 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అంతేకాకుండా కొత్తగా తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతల పథకాలు, సదర్ మాట్ బ్యారేజి, మల్కాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవన పథకం చేపట్టింది. అసంపూర్తిగా ఉన్న దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు, 365 రోజుల పాటు ఈ ప్రాజెక్టుకు నీరు అందుబాటులో ఉండేందుకు గోదావరిపై తుపాకుల గూడెం బ్యారేజిని నిర్మిస్తున్నాం.

పాలమూరు-రంగారెడ్డి
పాలమూరు ప్రజల కన్నీరు తుడిచి, వారి పొలాలకు సాగునీరు అందించాలని పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. కృష్ణా జలాల్లో తెలంగాణకున్న వాటాను సంపూర్ణంగా, సమర్థవంతంగా వినియోగించుకోవడానికి వీలుగా వ్యూహాత్మకంగా శ్రీశైలం రిజర్వాయర్ ను సోర్సుగా ఎంచుకుంది. వలస కూలీల కేంద్రంగా పేరు పడిన పాలమూరుతో పాటూ, తీవ్ర దుర్భిక్షం ఎదుర్కొంటున్న ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని భూములకు ఈ పథకం ద్వారా సాగునీరు అందుతుంది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రభుత్వం పట్టుదలతో చేస్తున్న కృషిపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది. పొట్ట చేత పట్టుకొని వలస పోయిన కూలీలెందరో, మళ్ళా తమ సొంత ఊళ్లకు ‘తిరుగు వలసలు’ (Reverse migration) వస్తున్నరు. ఒకవైపు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, మరోవైపు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకుపైగా సాగునీరు అందించి, పాలమూరుకు ఉన్న కరువు జిల్లా అనే పేరును శాశ్వతంగా చెరిపివేస్తుంది. పచ్చని పంటల జిల్లాగా తీర్చిదిద్దుతుంది.

భక్త రామదాసు – సీతారామ ప్రాజెక్టు
రికార్డు సమయంలో భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడంతో కరువు పీడిత ప్రాంతమైన పాలేరు నియోజవర్గం సస్యశ్యామలమైంది. అదే స్ఫూర్తితో ఖమ్మం జిల్లాలోని అణువణువును గోదావరి జలాలతో తడిపేందుకు తలపెట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణం పురోగతిలో ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి కాగానే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జీవన ముఖచిత్రమే మారిపోతుంది.

కాళేశ్వరం ప్రాజెక్టు
గోదావరి నదీ జలాలను సమగ్రంగా వినియోగించుకునే విధంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవసాయానికి వరదాయిని, తెలంగాణకు జీవనదాయిని నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, భూపాలపల్లి, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు సమృద్ధిగా నీరందించే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రికార్డు సమయంలో పూర్తీ చేసే విధంగా పనులు జరుగుతున్నాయి. 37 లక్షల ఎకరాలకుపైగా సాగునీరు అందించే ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే అన్నిరకాల అనుమతులు సాధించాం. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అధికారులు, కార్మికులు రేయింబవళ్ళు మూడు షిఫ్టులలో పనిచేస్తున్నారు. ఇందులో వినియోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, భారీ ఎత్తున సాగుతున్ననిర్మాణ పనులను తిలకించేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా పలువురు ప్రముఖులు వచ్చివెళ్ళారు. రాష్ట్ర గవర్నర్ నరసింహాన్ గారు కూడా ఈ ప్రాజెక్టును తిలకించి, ఇది తెలంగాణ ప్రజలకు జీవధారగా మారబోతున్నదని ప్రశంసించారు. కేంద్ర జలసంఘం ప్రతినిధి బృందం రెండు రోజులపాటు కాళేశ్వరం పనులను పరిశీలించి, ఈ ప్రాజెక్టు దేశ చరిత్రలోనే విభిన్నమైనదని కొనియాడింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణ రంగంలో జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాల రీత్యా కూడా కాళేశ్వరం అన్నివిధాలా ప్రత్యేకమైనదని ఈ బృందం వ్యాఖ్యానించింది.

మిషన్ కాకతీయ
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ కాకతీయ సత్ఫలితాలనిచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో దారుణమైన నిర్లక్ష్యానికి గురై, విధ్వంసమైన వేలాది చెరువులు మిషన్ కాకతీయ వల్ల పునరుద్ధరణకు నోచుకున్నాయి. దీంతో సాగు భూమి విస్తీర్ణం పెరగటంతోపాటు, భూగర్బ జల మట్టం కూడా పెరిగింది. గ్రామసీమల్లోని చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. 46,500 చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే ప్రధానమైన చెరువుల పనులు పూర్తయ్యాయి. చిన్న చెరువులు, కుంటల పనులు పురోగతిలో ఉన్నాయి.

రైతుబంధు – పంట పెట్టుబడి పథకం
రైతాంగాన్ని మరింతగా ఆదుకోవడానికి ఇంకా ఎంతో చేయాలన్న తపన మదిలో మెదులుతూనే ఉంది. వ్యవసాయ సీజన్ వచ్చిందంటే పంట పెట్టుబడి కోసం రైతులు ఎన్ని బాధలు పడతారో ఒక రైతుగా నాకు తెలియంది కాదు. ఒక దశలో పెట్టుబడికోసం ఇండ్లు, భూములు, నగదు కుదవపెట్టి, అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకునే దుస్థితి ఉండేది. ఇంతా చేస్తే పంట చేతికి వచ్చేదాకా నమ్మకం లేదు. వచ్చినా గిట్టుబాటు ధర లభిస్తుందో లేదో తెలియదు. ఫలితంగా రైతులు అప్పులపాలై చితికిపోయేవారు. ఈ పరిస్థితుల్లో నుంచి రైతును బయడపడేయాలి, వ్యవసాయం లాభసాటిగా మార్చాలి. ఎంత భారమైనా సరే, రైతులను మరింతగా ఆదుకోవాలి. వారి ముఖంలో ఆనందం చూడాలి అనే నిరంతర ఆరాటంలోంచి, ఉద్భవించిందే రైతుబంధు పథకం.

రాష్ట్రంలోని రైతులందరికీ ఎకరానికి రూ. 8 వేల రూపాయల చొప్పున ఈ ఏడాది నుంచే పంట పెట్టుబడి సాయం అందిస్తున్నాం. తొలి విడత చెక్కుల పంపిణీతో గ్రామాలలో, ముఖ్యంగా రైతాంగంలో పండుగ వాతావరణం నెలకొన్నది. ఈ పథకం రైతన్నలలో విశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపింది. పంట పెట్టుబడికోసం వడ్డీవ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితిని తొలగించింది. ఈ పథకం ప్రారంభంతో నేడు ఇన్నినాళ్ళకు రైతుమోములో ఆనందాన్ని చూడగలుగుతున్నాం. ఈ పథకం ఇతర రాష్ట్రాలలోనేకాదు, విదేశాలలో వుంటున్నవారిలో కూడా చైతన్యం కలిగించింది. కొంతమంది సంపన్నవర్గాలకు చెందిన రైతులు, దాతలు తమకు ఇచ్చిన పెట్టుబడి మొత్తాలను తిరిగి రైతు సంక్షేమానికే వినియోగించమని ప్రభుత్వానికి తిరిగి ఇస్తున్నారు. దీనితోపాటుగా పథకంలో తామూ భాగస్వాముల మవుతామని, శక్తికొలది విరాళాలు అందిస్తామని ముందుకు వస్తుండటం ఆనందాన్నిస్తోంది. ఇతర రాష్ట్రాలలోని కొన్ని పార్టీలు మన కార్యక్రమాలకు ఆకర్షితమై ఆయా పథకాలను యధాతథంగా వారివారి పార్టీల ఎన్నికల ప్రణాళికలలో పెట్టుకోవడం విశేషం.

రైతులకు జీవిత బీమా
రైతులకు భూమి తప్ప మరే జీవనాధారం ఉండదు. రాష్ట్రంలో చాలా మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. ఒక్క ఎకరం లోపు భూమి ఉన్న రైతులు 18 లక్షల మంది ఉన్నారు. అటువంటి పేద రైతులు ఎవరైనా దురదృష్టవశాత్తూ చనిపోతే, వారి కుటుంబాలు ఉన్నట్టుండి అగాధంలో పడిపోతాయి. చమటోడ్చి లోకానికి అన్నం పెట్టే రైతు కుటుంబానికి అటువంటి దుర్గతి పట్టనివ్వవద్దని ప్రభుత్వం యోచించింది. కుటుంబాన్నిపోషించే పెద్ద దిక్కును కోల్పోయినా వారి కుటుంబానికి తగిన ఆర్థిక భరోసా ఉండాలనే ఉదాత్తమైన ఆలోచనతో రైతులకు జీవితబీమా పథకాన్ని ప్రారంభిస్తున్నది. ఇకపై తెలంగాణలో ఏ రైతు మరణించినా, అతడి కుటుంబానికి పది రోజుల్లోగానే 5 లక్షల రూపాయల జీవిత బీమా మొత్తం అందితీరుతుంది. ఈ బీమా కోసం అవసరమైన ప్రీమియం డబ్బులను రైతు మీద ఒక్క పైసా భారం వేయకుండా ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుంది. జీవితబీమా రంగంలో అనుభవం, విశ్వసనీయత, విస్తృత యంత్రాంగం కలిగిన లైఫ్ ఇన్సూరెన్సు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా – ఎల్.ఐ.సి. ద్వారా ప్రభుత్వమ రైతులకు జీవిత బీమా పథకం అమలు చేస్తున్నది. ఈ పథకం కోసం రైతులు కోరుకున్న వారినే నామినీలుగా చేర్చాలని అధికారులను ఆదేశించాం. నామిని వివరాలు తెలుపుతూ రైతులు దరఖాస్తులు ప్రభుత్వానికి అందించే కార్యక్రమం త్వరలోనే ప్రారంభమవుతుంది. ఆగస్టు 15నుంచి రైతులకు బీమా పత్రాలు అందించే కార్యక్రమం ప్రారంభవుతుంది. ఇవి కేవలం బీమా పత్రాలు కావు, ఇవి రాష్ట్రంలోని రైతుల కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న భద్రతా పత్రాలు.

భూరికార్డుల ప్రక్షాళన
ఇంతకాలం ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, మరే ఇతర రాష్ట్రంలోనూ, ఎవరూ సాహసించని భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని మనం కేవలం వంద రోజుల్లో విజయవంతంగా పూర్తిచేయగలిగాం. ఏ భూమికి ఎవరు యజమానులన్న విషయంలో స్పష్టత వచ్చింది. పంట పెట్టుబడి చెక్కులతోపాటు పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా రైతులకు అందిస్తున్నాం. జూన్ 20లోగా రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు, రైతుబంధు చెక్కుల పంపిణీ పూర్తి చేసే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమయింది. రెండు కోట్ల 38 లక్షల ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులను ప్రక్షాళనం చేయడంతోపాటు, కోటి 40 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి విషయంలో స్పష్టత సాధించగలిగాం. రైతులు తమ భూమి కుదువ పెట్టకుండానే, పాస్ బుక్ లు తీసుకోకుండానే బ్యాంకర్లు రుణాలు ఇచ్చే విధానాన్ని అమలుచేస్తున్నాం. జాతీయ ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడానికి, అన్నిపంటలకు మద్దతు ధర ప్రకటించే విధంగా కేంద్రంపై వత్తిడి తెస్తున్నాం.

అవినీతికి, జాప్యానికి ఆస్కారంలేని విధంగా రాష్ట్రంలో నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని త్వరలోనే ప్రారంభిస్తున్నామని ప్రకటించడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. ప్రతీ మండలంలో రిజిస్ట్రేషన్లు జరగాలి. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 141 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలతోపాటు అన్ని మండలాల తహసిల్దార్లకు రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగిస్తున్నాం.

ధరణి వెబ్ సైట్
భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా తేలిన సమాచారాన్ని పొందుపరుస్తూ ప్రభుత్వం ‘ధరణి’ అనే పేరుతో వెబ్ సైట్ రూపొందిస్తున్నది. జూన్ 20వరకు భూములకు సంబంధించిన పూర్తి స్థాయి స్పష్టత సాధించి, ఆ వివరాలను పారదర్శకంగా ధరణిలో నమోదు చేస్తారు. ఈ వెబ్ సైట్ వల్ల భూముల వివరాలన్నీ ఒకే చోట అందరికీ అందుబాటులో ఉంటాయి. క్రయ, విక్రయాలు ఎప్పుడు జరిగినా, మార్పుచేర్పులు వెంటనే నమోదవుతాయి. కోర్ బ్యాంకింగ్ తరహాలో ధరణి వెబ్ సైట్ నిర్వహణ జరుగుతుంది.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే వ్యవసాయంతో పాటు కులవృత్తులు బాగుపడాలి. అందులో భాగంగానే రాష్రంలో పెద్ద మానవ వనరులుగా వున్న యాదవ, గొల్ల, కురుమలకు 75 శాతం సబ్సిడీపై ప్రభుత్వం పెద్ద ఎత్తున గొర్రెలు పంపిణీ చేస్తున్నది. దీనికి తోడుగా 100 సంచార పశువైద్య శాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే ప్రభుత్వం పంపిణీచేసిన గొర్రెలు పిల్లలను పెడుతుండటంతో రాష్ట్రంలో పశు సంపద గణనీయంగా పెరుగుతున్నది. గొర్రెలకు కావలసిన దాణా కూడా ప్రభుత్వం ఉచితంగా పంపిణీచేస్తుండటంతో పెంపకందారులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

చేపల పెంపకాన్ని కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. చేపల పెంపకానికి అవసరమయ్యే మొత్తం పెట్టుబడిని ప్రభుత్వమే భరించి, లాభాలను మాత్రం బెస్త, ముదిరాజ్, తదితర మత్యకారులకు అందించే కార్యక్రమాలు చేపట్టింది. నవీన క్షౌరశాలల ఏర్పాటుకు నాయీబ్రాహ్మణులకు, అధునాతన యంత్రపరికరాల కొనుగోలుకు రజకులకు, తదితర కులాలవారికి ఆర్థిక సహాయం అందించబోతున్నది. కల్లుగీత వృత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వమే రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది సంఖ్యంలో ఈత, తాడిచెట్ల పెంపకం చేపట్టింది. గీత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చెట్లపై విధించే పన్ను చెట్ల రకం ను పూర్తిగా రద్దుచేశాం. సంచార కులాలు, ఆశ్రిత కులాలు, తదితర వర్గాలవారికోసం వెయ్యి కోట్ల రూపాయలతో ఎం.బి.సి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు పాడిరైతులకు లీటరుకు 4 రూపాయలు ప్రోత్సాహకంగా అందజేస్తున్నాం. ప్రమాదవశాత్తూ గీతకార్మికులు ప్రమాదంలో మరణించినా, తీవ్రంగా గాయపడినా చెల్లించే పరిహారాన్ని కూడా భారీగా పెంచాం.

మిషన్ భగీరథ
తెలంగాణ ప్రజల తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే పథకం మిషన్ భగీరథ. ఈ పథకం ద్వారా ఇప్పటికే వేలాది గ్రామాలకు శుభ్రమైన తాగునీరు అందుతున్నది. రాబోయే కొద్ది నెలల్లోనే అన్ని గ్రామాలకు తాగునీరు అందుతుంది. గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణం చురుకుగా సాగుతున్నది. ఆశించిన ఫలితాలు అందించబోతున్నది.

జాతీయ రహదారులు
రాష్ట్రం ఏర్పడే నాటికి మనకు జాతీయ రహదారులు చాలా తక్కువగా ఉండేవి. జాతీయ సగటు 2.80 కిలోమీటర్లుంటే, తెలంగాణలో మాత్రం కేవలం 2.20 కిలోమీటర్లు మాత్రమే ఉండేది. రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణలో 2,527 కిలోమీటర్ల జాతీయ రహదారులుంటే, ఈ నాలుగేళ్లలో కొత్తగా 3,155 కిలోమీటర్ల జాతీయ రహదారులు సాధించుకున్నాం. ఇప్పుడు తెలంగాణలో 5,682 కిలోమీటర్ల జాతీయ రహదారులున్నాయి. ఇప్పుడు జాతీయ రహదారుల్లో దేశ సగటు 3.81 కిలోమీటర్లుంటే, మన రాష్ట్రంలో 5.02 కిలోమీటర్లుంది.

డబుల్ బెడ్ రూం ఇళ్లు
గత ప్రభుత్వాలు పేదలకు పక్కా ఇల్లు పథకాన్ని అవినీతిమయంగా మార్చేశాయి. ఇల్లు పేరుతో కేవలం ఒక్కగది నిర్మించడం కోసం డబ్బులు మంజూరు చేసే ఈ పథకంలో అనేక చోట్ల అసలు ఇండ్లు నిర్మించుకుండానే బిల్లులు కాజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే, ఈ అవినీతి కుంభకోణంపై విచారణ ప్రారంభించాం. ప్రభుత్వమే పేదలకు ఇండ్లు కట్టించినట్టు గొప్పలు చెప్పుకున్నా, నిజానికి ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించిన అప్పు పేదలపై కత్తిలా వేలాడుతూనే ఉంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం బలహీనవర్గాల గృహనిర్మాణ పథకం కింద లబ్ధిదారులు చెల్లించవలసి వున్న దాదాపు 4వేల కోట్ల రూపాయల రుణ బకాయిలను కూడా రద్దు చేసింది.

నిరుపేదల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గృహ నిర్మాణ పథకం అమలుచేయడంలో కూడా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. నూటికి నూరుశాతం ప్రభుత్వ వ్యయంతో పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ళను నిర్మించి ఇవ్వడం దేశంలోనే ప్రథమం. డబుల్ బెడ్ రూం ఇళ్ళ పథకం క్రింద 2.65 లక్షల ఇండ్లు మంజూరు చేసి, నిర్మిస్తున్నాం. వీటిలో కొన్ని ఇప్పటికే నిర్మించి పేదలకు అందించడం జరిగింది. మిగిలినవాటి నిర్మాణం పురోగతిలో వుంది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే నిరుపేదలకు లక్షకుపైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మిస్తున్నాం.

కేసీఆర్ కిట్స్
నిరుపేద మహిళలు గర్భవతులుగా వున్న సమయంలో కూడా కూలీకి పోవాల్సి రావడం బాధాకరం. ఈ పరిస్థితుల నుంచి వారిని ఆదుకొనేందుకు మానవీయ కోణంతో కే.సీ.ఆర్ కిట్స్ పేరుతో అపూర్వమైన పథకాన్ని అమలుచేస్తున్నాం. నిండు గర్భిణీలు, బాలింతలు కూలీకి వెళ్ళకుండా, వారు నష్టపోయే కూలీనిప్రభుత్వమే చెల్లించే విధంగా అవసరమైన ఆర్థిక సహాయం ప్రభుత్వమే అందజేస్తోంది. ఈ పథకం క్రింద నిరుపేద గర్భిణీలకు నాలుగు విడతలుగా రూ. 12,000 చెల్లిస్తున్నాం. ఆడపిల్లను ప్రసవించిన తల్లికి ప్రోత్సాహకంగా మరో రూ. 1,000 అదనంగా చెల్లిస్తున్నాం. దీనితోపాటుగా నవజాత శిశువులకు కావల్సిన 16 రకాల వస్తువులతోకూడిన రూ. 2,000 విలువైన కిట్ ను కూడా అందించడం జరుగుతోంది. ఈ పథకం అమలు తర్వాత ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరగడంతోపాటు, మాతా, శిశు సంరక్షణ కూడా సమర్థవంతంగా అమలవుతోంది. కే.సీ.ఆర్ కిట్స్ కార్యక్రమం ప్రారంభించిన తరువాత ఇప్పటివరకూ రెండు లక్షల మందికిపైగా మహిళలకు ఈ ప్రయోజనాలు అందించడం జరిగింది.

కేసీఆర్ కిట్స్ పథకం వల్ల ప్రభుత్వాసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఆసుపత్రుల సామర్ధ్యానికి మించి పేషంట్లు, గర్భిణీలు వస్తున్నారు. ఇన్ పేషెంట్లు, ఔట్ పేషంట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. పెరిగిన భారాన్ని లెక్క చేయకుండా, ఎవరికీ వైద్యాన్ని నిరాకరించకుండా ఎంతో ఓపికగా, సమర్థవంతంగా వైద్యం అందిస్తున్న డాక్టర్లకు, ఆరోగ్య శాఖ సిబ్బందికి మనసారా అభినందనలు తెలుపుతున్నాను.

గ్రామీణ ప్రాంతాలలో మహిళల ఆరోగ్య పరిరక్షణకు కృషిచేస్తున్న ఆశా వర్కర్లు, అంగన్ వాడీ వర్కర్లు మరింత బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా పనిచేసేలా ప్రభుత్వం వారికి పెద్దమొత్తంలో వేతనాలను హెచ్చించింది. గర్భవతులకు అంగన్వాడీ కేంద్రాలద్వారా ఆరోగ్యలక్ష్మి పథకం కింద రోజుకు ఒకపూట పూర్తి సంపూర్ణ ఆహారాన్ని అందిస్తున్నాం. దీనితోపాటుగా వారికి అవసరమైన ఐరన్, తదితర మందులుకూడా అక్కడే పంపిణీ జరుగుతోంది.

ఉత్తమ వైద్యసేవలు
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ప్రభుత్వాసుపత్రుల పనితీరు మెరుగుపడింది, ప్రజల్లో విశ్వాసం పెరిగింది. ప్రభుత్వ దవాఖానాలలో కావల్సిన వైద్య పరికరాలు, మందులు, ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చాం. ఫలితంగా ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులపట్ల ప్రజలలో అపోహలు తొలగిపోయి, విశ్వాసం పెరిగింది. ఇది నేను చెప్పడం కాదు. స్వయంగా రాష్ట్ర గవర్నర్ గారే గాంధీ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవడం ప్రభుత్వానికి గర్వకారణం. ఈ సందర్భంగా గవర్నర్ గారు అక్కడి సదుపాయాలను చూసి ఎంతగానో అభినందించారు.

కిడ్నీ వ్యాధి బాధితుల కోసం ఉచితంగా డయాలసిస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చాం. రాష్ట్రంలో మొత్తం 39 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. వీటిలో 17 కేంద్రాలు ఇప్పటికే పనిచేయడం ప్రారంభించాయి. సింగిల్ యూజ్ ఫిల్టర్ డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు, ఎం.ఆర్.ఐ, సిటీస్కాన్, డిజిటల్ రేడియాలజీ, టూ డి ఎకో, తదితర అత్యాధునిక పరికరాలను వివిధ దవాఖానాలలో అందుబాటులోకి తెచ్చాం. జిల్లా, ఏరియా ఆస్పత్రులలో అవసరమైన మరమ్మతులు చేపట్టాం. అవసరమైన పరికరాలను, మందులను సరఫరాచేయడం జరిగింది. ఐ.సి.యు కేంద్రాల సంఖ్య కూడా పెంచడం జరిగింది. ఉత్తమ వైద్యసేవలు అందించినందుకు మన రాష్ట్రానికి పలు జాతీయస్థాయి అవార్డులు కూడా లభించాయి.

హైదరాబాద్ నగరంలో వైద్యసేవలను మరింత విస్తరించి, పేదలందరికీ కూడా అందుబాటులోకి తెచ్చేందుకు వెయ్యికి పైగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నాం. వీటిలో కొన్నింటిని ఇప్పటికే ప్రారంభించుకున్నాం.

కంటి వెలుగు
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనే సూక్తి అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో ఎంతో మంది ప్రజలు కంటి సమస్యలతో బాధ పడుతున్నారు. తగిన సమయంలో పరీక్షలు చేసుకోకపోవడం వల్ల చిన్న సమస్యలు పెద్దవిగా మారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కంటి పరీక్షలు, చికిత్స ఉచితంగా అందించడం కోసం ప్రభుత్వం కంటి వెలుగు అనే పేరుతో పథకాన్ని రూపొందించింది. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కంటి పరీక్ష శిబిరాల నిర్వహణ ప్రారంభమవుతుంది. ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయడంతో పాటు, అవసరమైన వారికి తగిన శస్త్ర చికిత్సలు జరిపిస్తుంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరుతున్నాను.

విద్యారంగం – రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలు
విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రం ముందడుగు వేస్తున్నది. కేజీ టు పిజి ఉచిత విద్యావిధానం అమలులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలను ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, తదితర వర్గాలకి చెందిన విద్యార్థులకోసం కేవలం 296 గురుకులాలు మాత్రమే ఉండేవి. అందులోనూ అరకొర వసతులతో విద్యార్థులు అనేక అగచాట్లు పడేవారు. కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అన్ని హంగులతో రికార్డు స్థాయిలో 542 కొత్త గురుకులాలు ఏర్పాటుచేసుకున్నాం. ఎస్సీ, ఎస్టీ విద్యార్థినుల కోసం డిగ్రీ గురుకులాలను కూడా ప్రారంభించాం. ఇంటిని మరపించేలా గురుకులాల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఉచిత విద్య, హాస్టల్ వసతితోపాటు ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి మూడు జతల యూనిఫారాలు, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు చక్కటి పోషకాహారం, గుడ్లు, పాలు, పెరుగు, మాంసాహారం, నెయ్యి కూడా అందిస్తున్నాం. మన గురుకులాలలోని వసతులు, అందిస్తున్న ఆహారం, విద్యావిధానాన్ని గమనించేందుకు వివిధ రాష్ట్రాలనుంచి ఉన్నతాధికార బృందాలు వచ్చి చూసివెళ్తున్నాయి.

ఇటీవల జరిగిన సివిల్స్ పరీక్షలలో ఎంతో మంది తెలంగాణ బిడ్డలు విజయం సాధించడంతోపాటు, దేశం మొత్తంమీద ప్రథమస్థానం సాధించింది కూడా తెలంగాణ బిడ్డే కావడం మనందరికీ గర్వకారణం. మన జగిత్యాల జిల్లాకు చెందిన అనుదీప్ అనే యువకుడు సివిల్స్ లో ప్రథమ స్థానం సాధించడం నాకు ఎంతో సంతోషం కల్గించింది. అలాగే అనేకమంది క్రీడాకారులు, పర్వతారోహకులు మన రాష్ట్రం నుంచి వెలుగులోకిరావడం, మనరాష్ట్రానికి, దేశానికి గౌరవం తీసుకొనిరావడం మనందరికీ సంతోషదాయకం.

అందుకే రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చదువుకొని గౌరవప్రదంగా జీవించాలని, చదువుకు ఆర్థిక సమస్య ఆటంకం కాకూడదని విదేశీ చదువులకు వెళ్ళేవారికి కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తున్న విషయం మీకు తెలుసు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని పాఠ్యాంశాల బోధన, క్రీడలు, వ్యక్తిత్వవికాసం కల్పించే విధంగా రాష్ట్రంలో గురుకులాలను తీర్చిదిద్దుతున్నాం.

తెలంగాణకు హరితహారం
భవిష్యత్ తరాలకు మంచి పరిసరాలను, మంచి వాతావరణాన్ని అందించాలి. రాష్ట్రంలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి పెద్ద ఎత్తున అమలుచేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్దసంఖ్యలో భాగస్వాములు కావడం ఆనందదాయకం. ఈ కార్యక్రమం ప్రారంభించిన మూడేళ్ళలో సుమారు 82 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. ఈ ఏడాది కూడా తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాలు పంచుకుని విరివిగా మొక్కలు నాటాలని, వాటి సంరక్షణ బాధ్యత స్వీకరించాలని కోరుతున్నాను.

కొత్త పంచాయితీ రాజ్ చట్టం
గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యమే లక్ష్యంగా నూతన పంచాయితీరాజ్ చట్టాన్ని తీసుకువచ్చాం. నామమాత్రంగా ఉన్న పంచాయతీ పాలక వర్గాలను క్రియాశీలంగా మార్చే విధంగా చట్టంలో మార్పులుచేశాం. అధికారాలతోపాటు ఖచ్చితమైన విధులను కూడా పొందుపరిచి ప్రజలకు జవాబుదారీగా ఉండేటట్టు చట్టం రూపొందించాం. గ్రామాల్లో పచ్చదనం పెంచే, పారిశుద్యాన్ని కాపాడే బాధ్యతలను గ్రామ పంచాయితీలే తలకెత్తుకోవాలి. ప్రజలు వారితో తగిన సేవలు పొందే విధంగా చట్టంలో మార్పులు చేశాం. పంచాయితీ రాజ్ ఉద్యమ స్ఫూర్తిని తిరిగి గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పే విధంగా రానున్న రోజుల్లో ప్రభుత్వం మరింత కృషి చేస్తుంది.

కొత్త పంచాయితీలు
ఏడు దశాబ్ధాల కాలంలో గ్రామాలకు దూరంగా ఉన్న తండాలు గూడాలు, శివారు పల్లెలను ప్రత్యేక గ్రామ పంచాయితీలుగా మార్చాలని ప్రజలు ఎంత మొత్తుకున్నా వారి వేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది. తమ గూడాలను, తండాలను గ్రామ పంచాయితీలుగా మార్చాలన్న గిరిజనులు, ఆదివాసీల డిమాండ్ ను పట్టించుకున్న నాధుడే లేకుండా పోయాడు. ఎస్టీ ప్రజల చిరకాల వాంఛను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చింది. పరిపాలనా సంస్కరణలో భాగంగా కొత్తగా 4,383 గ్రామ పంచాయితీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1,326 ప్రత్యేక ఎస్టీ గ్రామ పంచాయితీలను కొత్తగా ఏర్పాటు చేసింది. వీటితో పాటు ఇతర గ్రామాల్లో జనాభా నిష్పత్తిని అనుసరించి ఎస్టీలకు గ్రామ సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్ లభిస్తుంది. ‘మా తండాలో మా రాజ్యం-మా గూడెంలో మా రాజ్యం’ అని గిరిజనులు, ఆదివాసీలు కన్న కలను తెలంగాణ ప్రభుత్వం నిజం చేసింది.

తరలి వస్తున్న పరిశ్రమలు
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకోసం ముందుకువచ్చే పారిశ్రామిక వేత్తలకు మన రాష్ట్రంలో అమలుచేస్తున్న టి.ఎస్ – ఐ.పాస్ సింగిల్ విండో విధానం ఎంతో ఆకర్షణీయంగా వుంది. కేవలం 15 రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు అన్ని రకాల అనుమతులు ఇవ్వడం జరుగుతోంది. ఈ నూతన పారిశ్రామిక విధానం అమలులోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోకి అనేక కొత్త పరిశ్రమలు తరలి వస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 7,155 పరిశ్రమలు అనుమతి పొందాయి. లక్షా 29వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 5 లక్షల 74 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించాయి.

ఐ.టి రంగం
తెలంగాణ రాష్ట్రం ఐ.టి రంగంలో బలీయమైన శక్తిగా ఎదిగింది. ప్రపంచంలో మన హైదరాబాద్ నగరం ఒక ప్రముఖ ఐ.టి హబ్ గా గుర్తింపు పొందింది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితమైన ఐ.టి రంగాన్ని ప్రభుత్వం ఇప్పుడు ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరింప చేస్తున్నది. అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఏర్పాటుచేసిన టి-హబ్ ఎంతో మంది ఔత్సాహికులకు ప్రేరణగా నిలుస్తున్నది.

శాంతి భద్రతలు – సామాజిక రుగ్మతలపై సమరం
తెలంగాణ పోలీసు శాఖ శాంతి భద్రతలను సమర్థవంతంగా పరిరక్షిస్తున్నది. ప్రభుత్వం పోలీసు శాఖను ఆధునీకరించడంతో పోలీసు సేవలు ప్రజలకు మరింత మెరుగ్గా అందుతున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఏర్పాటు చేస్తున్న పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం పూర్తి కావస్తున్నది.

శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నది. ప్రజల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తున్న గుడుంబా మహమ్మారిని అంతమొందించడంలో ప్రభుత్వం విజయం సాధించింది. ప్రజల జీవితాలతో చలగాటం ఆడుతున్న పేకాట క్లబ్బులను ప్రభుత్వం మూసివేసింది. ఆన్ లైన్ పేకాటతో సహా మొత్తంగా పేకాటను రాష్ట్రంలో నిషేధించింది. దీంతో సంసారాల్లో శాంతి నెలకొంటున్నది. వ్యవసాయ రంగానికి ముప్పుగా పరిణమించిన కల్తీ విత్తనాలు, ఎరువులను నిరోధించడానికి ప్రభుత్వం ఈ నేరాలను పిడి యాక్టు పరిధిలోకి తెచ్చింది. అన్ని రకాల కల్తీలపై ఉక్కుపాదం మోపింది. రాష్ట్రంలో కల్తీ ఎరువులు, పురుగు మందులు అమ్మే వారి విషయంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, కల్తీ వ్యాపారుల భరతం పట్టేందుకు ప్రభుత్వంతో సహకరించాలి.

ముగింపు
సుదీర్ఘ పోరాటం ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం సఫల రాష్ట్రంగా స్థిరపడింది. ప్రగతి దారుల వెంట వేగంగా పయనిస్తున్నది. ఇది ఒక చారిత్రాత్మక విజయయాత్ర. అయితే పురోగమనాన్ని అడ్డుకోవాలనే ప్రతీఘాతుక శక్తుల ప్రయత్నాలు ఆనాడు పోరాటంలో ఎదురయ్యాయి. ఈనాడు పరిపాలనలోను ఎదురవుతున్నాయి. సంకల్పం గట్టిదైతే ఎన్ని అవరోధాలనైనా అవలీలగా అధిగమించవచ్చని ప్రభుత్వం రుజువు చేసింది. రాబోయే రోజుల్లోనూ ఇదే విధంగా ద్విగుణీకృత ఉత్సాహంతో ముందుకు సాగుదాం. అవిశ్రాంతంగా పరిశ్రమించి, బంగారు తెలంగాణ గమ్యాన్ని ముద్దాడుదాం. యావత్భారతావనికి దిక్సూచిగా నిలుద్దాం. మరోమారు అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.

జై తెలంగాణ… జై భారత్