పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణీపై సీఎం సమీక్ష


CM-KCR-review-on-passbooks-and-cheque-distribution-program

>భూ రికార్డుల ప్రక్షాళన, పాసు పుస్తకాల పంపిణీ, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నూటికి నూరు శాతం పూర్తయ్యే వరకు అధికార యంత్రాంగం విశ్రమించవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ రోజు వరకు జరిగిన భూమి అమ్మకం,కొనుగోళ్లకు సంబంధించిన అన్ని వివరాలు నమోదు చేసి, దాని ప్రకారం అందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు అందించాలని చెప్పారు. పాసు పుస్తకాల్లో దొర్లిన తప్పులను కూడా సవరించాలని కోరారు. వంద రోజులపాటు భూ రికార్డుల ప్రక్షాళన జరిగినప్పటికీ, ఇంకా కొన్ని చోట్ల రికార్డుల్లో తప్పులు దొర్లడం, అసమగ్ర వివరాలుండడం పట్ల ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. సాంకేతిక కారణాలతో పాటు, మానవ తప్పిదాలు కూడా ఉన్నాయని, దీని వల్ల రైతులకు కొంత అసౌకర్యం కలిగిందని, కొందరికి పాస్ పుస్తకాలు అందలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించినప్పుడు కొన్ని సమస్యలు తప్పవని, ఈ పరిస్థితిని సవాల్ గా తీసుకుని, మరింత ప్రభావవంతంగా పనిచేయాలని సీఎం కోరారు. జిల్లాల పునర్విభజన వల్ల కొత్త జిల్లాలు ఏర్పడ్డాయని, కలెక్టర్లకు పర్యవేక్షణ సులభమయిందని, దీన్ని సానుకూలాంశంగా తీసుకుని మరింత చిత్తశుద్ధితో కార్యక్షేత్రంలో విధులు నిర్వహించాలని ఉద్భోధించారు. వచ్చే నెల నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వస్తుందని, రైతులకు జీవిత భీమా పథకం కూడా అమల్లోకి వస్తుందని, ఇవి సవ్యంగా సాగాలంటే భూమి రికార్డులు సరిగా ఉండాలని చెప్పారు. భూ రికార్డుల ప్రక్షాళన పరిపూర్ణమయి, భూమి యాజమాన్యంపై స్పష్టత వస్తే తప్ప ఈ కార్యక్రమాలు నిర్వహించడం ఎలా సాధ్యమవుతుందని సీఎం అన్నారు. కొన్ని సమస్యలు వచ్చాయని అధైర్య పడవద్దని, బుక్కులు, చెక్కులిచ్చే కార్యక్రమాన్ని వందశాతం విజయవంతం చేయడానికి పునరుత్తేజం పొందాలని సీఎం పిలుపునిచ్చారు. 

కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు, రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంపై ప్రగతిభవన్ లో బుధవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. స్పీకర్ శ్రీ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.కె. జోషి, ముఖ్య కార్యదర్శులు, కలెక్టర్లు పాల్గొన్నారు. జిల్లాల వారీగా ఇప్పటి వరకు ఎన్ని పాసు పుస్తకాలు పంపిణీ చేశారు? ఎంత మందికి చెక్కులిచ్చారు? మిగతా వారికి ఏ కారణం చేత పంపిణీ చేయలేదు? తదితర అంశాలపై సమీక్ష జరిపారు. ప్రతీ రైతుకూ పాసు బుక్కు, చెక్కు అందడానికి ఏ చర్యలు తీసుకోవాలి? అనే విషయంపై అభిప్రాయాలు తీసుకున్నారు.

ఈ సమావేశంలో సీఎం చేసిన సూచనలు:

     

      • పాసు పుస్తకాల పంపిణీ, చెక్కుల పంపిణీ కార్యక్రమం వందశాతం పూర్తయ్యే బాధ్యతను కలెక్టర్లతో పాటు మంత్రులు స్వీకరించాలి

      • భారతదేశానికి రాలేకపోతున్న ఎన్.ఆర్.ఐ.లకు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి ప్రత్యేక విధానం అనుసరించాలి

      • ఆధార్ నంబరు అనుసంధానం చేయడానికి ముందుకు రాని వారి పాసు పుస్తకాలను కూడా పక్కన పెట్టాలి.

      • భూమికి సంబంధించిన అన్ని వివరాలతో ‘ధరణి’ వెబ్ సైట్ నిర్వహించాలని నిర్ణయించినందున, అందులో వివరాలు సరిగా ఉండేందుకు రికార్డులు సరిగా ఉండాలి. అసమగ్ర వివరాలతో ‘ధరణి’ నిర్వహించలేం

      • భూ రికార్డులను సక్రమంగా నిర్వహించే విషయంలో అవినీతికి పాల్పడే వారిపట్ల అత్యంత కఠినంగా ఉండాలి

      • తప్పులు చేసిన వారిని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని గుర్తించి, క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి

      • ప్రతీ మండలంలో వందశాతం బుక్కులు, చెక్కుల పంపిణీ కార్యక్రమం పూర్తయ్యే బాధ్యతను ఆయా మండలాల తహసిల్దార్లకు అప్పగించాలి. జిల్లాలో మంత్రి, నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలి

      • మాన్యువల్ గా మ్యుటేషన్ చేసిన వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసి, దాని ప్రకారం కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలి. ఆన్ లైన్ లో మార్పులను నమోదు చేయడాన్ని నిలుపుదల చేయలేదు. ఈ విషయంలో తహసిల్దార్లకు ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాలి

    ‘‘భూముల విషయంలో దశాబ్దాల తరబడి వివాదాలు, అస్పష్టతలు నెలకొని ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి గత ప్రభుత్వాలు ఎన్నడూ శ్రద్ధ పెట్టలేదు. ప్రభుత్వ శాఖల మధ్య కూడా భూ వివాదాలున్నాయి. రెవెన్యూ, అటవీశాఖ మధ్య గొడవలున్నాయి. భూమి రికార్డులు సరిగా లేకపోవడం వల్ల గ్రామాల్లో గొడవలు, ఘర్షణలు జరుగుతున్నాయి. వీటన్నింటికి చరమగీతం పాడాలనే ఉద్దేశ్యంతో తెలంగాణలో భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టాం. దేశంలో మరే రాష్ట్రం కూడా ఈ సాహసానికి పూనుకోలేదు. తెలంగాణలో చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతమైంది. అధికారులు ఎంతో శ్రమకోడ్చి భూ రికార్డుల ప్రక్షాళన చేశారు. దాని ప్రకారం కొత్త పాసు పుస్తకాలు, రైతు బంధు చెక్కులు అందిస్తున్నాం. ఇంకా మిగిలిన వారికి కూడా బుక్కులు, చెక్కులు అందివ్వాలి. తలపెట్టిన కార్యక్రమం నూటికి నూరు శాతం పూర్తి చేయాలి. రైతు సమన్వయ సమితిలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. అన్ని విధాలా రికార్డులు సిద్ధం అయిన తర్వాతే ‘ధరణి’ వెబ్ సైట్ ప్రారంభిద్దాం’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

    ‘‘రైతులు భూమిని నమ్ముకుని బతుకుతున్నారు. చాలా మంది చిన్న, సన్నకారు రైతులే. ఒక్క ఎకరం లోపు భూమి ఉన్న రైతులు 18 లక్షల మంది ఉన్నారు. అలాంటి పేద రైతు చనిపోతే వారి కుటుంబం ఉన్నట్టుండి అగాధంలో పడిపోతుంది. కాబట్టి మరణించిన రైతు కుటుంబానికి 5 లక్షల బీమా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్.ఐ.సి. ద్వారా బీమా సౌకర్యం కల్పిస్తాం. రైతుల తరుఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది. ప్రతీరైతుకు బీమా పట్టా అందిస్తాం. రైతులు కోరుకున్న వారినే నామినిలుగా చేర్చాలి. బీమా పథకం అమలుకు సంబంధించి ఎల్.ఐ.సి. అధికారులతో చర్చలు జరుపుతున్నాం. రైతు చనిపోయిన వెంటనే ఆయన కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిహారం అందే విధానానికి రూపకల్పన చేయాలి’’ అని సీఎం వివరించారు.

    ‘‘అసైన్డ్ భూములను కొన్న వారు పేదలే అయితే, వారిపేరు మీదే యాజమాన్య హక్కులు కల్పించాలి. వారికి రైతు బంధు పథకం వర్తింపచేయాలి’’ అని సీఎం చెప్పారు.

    రాబోయే 25 రోజుల్లో పట్టాదారు పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమం వందకు వంద శాతం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. బుక్కులు, చెక్కుల పంపిణీ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా మంత్రులు, కలెక్టర్ల అభిప్రాయాలను ముఖ్యమంత్రి తీసుకున్నారు. ప్రతీ జిల్లాకు ఒకరు చొప్పున మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లాంటి వారిని ఇన్‌చార్జ్‌లుగా నియమించాలని నిర్ణయించారు. ఇన్‌చార్జ్‌లుగా నియమితులైన వారు జిల్లాలోనే ఉండి కొత్త పాస్ పుస్తకాల పంపిణీ, చెక్కుల పంపిణీ వందకు వంద శాతం పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

    మే 24నుంచి జూన్ 20 వరకు 25 రోజుల పాటు మరో పని పెట్టుకోకుండా అధికార యంత్రాంగమంతా ఇదే పనిలో నిమగ్నం కావాలని సీఎం చెప్పారు. భూమి వివరాలను నమోదు చేయడానికి ఆన్ లైన్ ఫ్రీజింగ్ ను ఎత్తివేయాలని సీఎం ఆదేశించారు. ఈ నెల 27 నుంచి ఫ్రీజింగ్ ఎత్తివేసి ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేయడానికి తహసిల్దార్లకు అవకాశం కల్పిస్తామని రెవెన్యూ అధికారులు చెప్పారు.

    ‘‘భూముల అమ్మకం, కొనుగోలు వివరాలన్నీ నమోదు చేయాలి. అన్ని రకాల మ్యుటేషన్లు చేయాలి. వారసత్వ హక్కులు తేల్చాలి. కొత్తగా నమోదైన వివరాలతో పాస్ బుక్కులు ముద్రించి పంపిణీ చేయాలి. ఇప్పటికే జారీ చేసిన పాస్ పుస్తకాల్లో దొర్లిన తప్పులు సవరించి, వాటిస్థానంలో కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలి. గుంట భూమికి యజమాని ఎవరో తేల్చాలి. ఈ రోజు వరకు జరిగిన ప్రతీ అమ్మకం, కొనుగోలును నమోదు చేయాలి. వారసత్వ హక్కులను తేల్చాలి. భూ యాజమాన్యానికి సంబంధించిన అన్ని మార్పులను నమోదు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్ లో పెట్టొద్దు. జూన్ 20 నాటికి వివరాల నమోదు కార్యక్రమం పూర్తి కావాలి. ఆ వివరాలను పొందు పరుస్తూ ‘ధరణి’ వెబ్ సైట్ రూపొందించాలి. భూమికి సంబంధించి ఇకపై ఒకటే లెక్క ఉండాలి’’.

    పాసు పుస్తకాల పంపిణీ, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి అధికారులను ఇన్ చార్జులుగా నియమించారు. అధికారులతో పాటు జిల్లాలకు ఇన్‌చార్జ్‌లుగా ఉన్న మంత్రులు కూడా ఈ 25 రోజుల పాటు ఇదే పనిలో ఉండాలని సీఎం ఆదేశించారు.

    పాసు పుస్తకాల పంపిణీ, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి అధికారులను ఇన్ చార్జులుగా నియమించారు. అధికారులతో పాటు జిల్లాలకు ఇన్‌చార్జ్‌లుగా ఉన్న మంత్రులు కూడా ఈ 25 రోజుల పాటు ఇదే పనిలో ఉండాలని సీఎం ఆదేశించారు.

    పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమంపై సమీక్ష అనంతరం రంజాన్ పండుగ ఏర్పాట్లు, రాష్ట్ర అవతరణ వేడుకలు, కళ్యాణలక్ష్మి, హరితహారం తదితర కార్యక్రమాలపై సీఎం శ్రీ కేసీఆర్ కలెక్టర్లకు సూచనలు చేశారు:

       

        • రంజాన్ పండుగ సందర్భంగా నియోజకవర్గాల వారీగా ముస్లింలకు దుస్తుల పంపిణీ చేయాలి

        • పేదలందరికీ కళ్యాణలక్ష్మి పథకం అమలు చేస్తున్నందున కుల దృవీకరణ పత్రాలు అవసరం లేదు

        • జూన్ 1 నుంచే పాఠశాలలు ప్రారంభం అవుతున్నందున జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలను పాఠశాలల్లో కూడా నిర్వహించాలి

        • వచ్చే వర్షాకాలంలో నిర్వహించే తెలంగాణకు హరితహారం కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేయాలి. జిల్లాల్లో నర్సరీలను సందర్శించి, కలెక్టర్లు మొక్కలను సిద్ధం చేయాలి
        •