హైదరాబాద్ నగరంలో డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు భాష వైభవానికి జరిగిన ప్రయత్నంపై చర్చా గోష్ఠులు నిర్వహిస్తారు. తెలంగాణలో వర్థిల్లిన తెలుగును ప్రపంచం నలుమూలలకూ తెలిపే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. తెలంగాణ నుంచి వెలువడిన తెలుగు సాహిత్యాన్ని పరిచయం చేస్తారు. తెలుగు భాషలోని వివిధ ప్రక్రియలకు సంబంధించిన కార్యక్రమాలు ఈ మహాసభల్లో ఉంటాయి.
ఎల్.బి. స్టేడియం ప్రధాన వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయి. రవీంద్రభారతి, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, లలిత కళాతోరణం, నిజాం కాలేజి గ్రౌండ్స్, భారతీయ విద్యాభవన్, పింగళి వెంకట్రామరెడ్డి హాల్, శిల్పకళావేదిక తదితర వేదికల్లో కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం సాహిత్య గోష్ఠులు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బతుకమ్మ, గోండు నృత్యాలు, కోలాటం, పేరిణి, ఆటలు, కలుపుపాట, నాటు పాట, బతుకమ్మ లాంటి పాటలు, వినోద ప్రక్రియలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉంటాయి. తానీషా-రామదాసు సంబంధం, రామదాసు కీర్తనలు, తందనాన రామాయణం, శారదకారులు, హరికథ ప్రక్రియ తదితర అంశాలను ప్రదర్శిస్తారు. పద్యగానం, సినీ పాటల విభావరి, చుక్క పొడుపు నుంచి పొద్దుగూకే వరకు గ్రామీణ ప్రాంతాల్లో పాడుకునే నాట్ల పాటలు, కోత పాటలు, దుక్కి పాటలు, జానపద గేయాలు లాంటి అంశాలు నిర్వహిస్తారు.
వివిధ రకాల నాటక ప్రక్రియలు అంటే ఆదివాసి, గిరిజన, శాస్రీయ, జానపద నృత్యాలు లాంటివి ప్రదర్శిస్తారు. మహిళలు పాడే పాటలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక తరం నుంచి మరో తరానికి ఎలా అందజేయబడ్డాయో కళ్లకు కట్టినట్లు చూపిస్తారు.
దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు పండితులు, భాషా పండితులు, అవధానులు, కవులు, కళాకారులు, రచయితలు, కళాకారులను ఆ మహాసభలకు ప్రభుత్వం తరుఫున ఆహ్వానిస్తారు. దేశ, విదేశాల్లో అతిథులను ఆహ్వానించడానికి, ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ఔచిత్యం వివరించడానికి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలతో పాటు మారిషస్, సింగపూర్, మలేసియాలాంటి దేశాల్లో అక్కడున్న తెలుగు వారి కోసం సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశం నలుమూలల్లో తెలుగు వారు నివసించే ప్రాంతాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. తెలంగాణలోని ముఖ్యమైన పట్టణాల్లో కూడా సన్నాహక సమావేశాలు జరుగుతాయి.
కేవలం తెలుగువారినే కాకుండా భారతీయ భాషల్లో సాహిత్య అకాడమీ, జ్ఞానపీఠ్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు పొందిన ప్రముఖులను కూడా ఈ మహాసభలకు ఆహ్వానిస్తారు. ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో తెలుగు భాష ప్రక్రియలకు సంబంధించి పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తారు. తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు భాష వైభవానికి కృషి చేసిన కవులు, పండితులు, సాహితీ వేత్తలు, కళాకారులను గుర్తించి సన్మానం చేస్తారు. అతిథులందరికీ ప్రభుత్వం తరుఫునే బస, భోజనం, రవాణా సౌకర్యాలు కల్పిస్తారు.